
జూలై నుంచే అతిచౌక మద్యం!
♦ గుడుంబా స్థానంలో జిల్లాల్లో ప్రయోగాత్మక విక్రయాలకు ప్రణాళిక
♦ రూ. 30కే 180 ఎంఎల్ మద్యం అందించే ప్రయత్నం
♦ టెట్రా ప్యాక్, ప్లాస్టిక్ బాటిల్స్‌లో అందుబాటులోకి
♦ చీపెస్ట్ లిక్కర్ అందించేలా డిస్టిలరీలతో ఎక్సైజ్‌శాఖ ఒప్పందాలు
♦ సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఎక్సైజ్ నూతన విధానం ఖరారు
సాక్షి, హైదరాబాద్ : పేదల జీవితాల్లో చిచ్చుపెడుతున్న గుడుంబా మహమ్మారిని తరిమికొట్టేందుకు సిద్ధమైన ఎక్సైజ్‌శాఖ అందుకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు రంగం సిద్ధం చేసింది. గుడుంబా తయారీ, విక్రయాలపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేస్తున్న అధికారులు... జూలై 1 నుంచి గుడుంబా స్థానంలో అతి చౌక మద్యాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో లభిస్తున్న చీప్ లిక్కర్ ధర 180 ఎంఎల్ సీసాకు రూ. 60కిపైగా ఉండగా, అందులో సగం ధరకే గుడుంబాకు ప్రత్యామ్నాయ మద్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
మహారాష్ట్రలో అక్కడి ఎక్సైజ్‌శాఖ ద్వారా విక్రయిస్తున్న దేశీదారు తరహాలో తక్కువ ధరకు మద్యం అందుబాటులోకి తెస్తే గుడుంబా తయారీ, విక్రయాలు నిలిచిపోతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు అధికార యంత్రాంగం ఈ విషయాన్ని తెలియజేసింది. ఆయన సూచన మేరకు చీపెస్ట్ లిక్కర్‌ను రాష్ట్రంలో ప్రవే శపెట్టే ఉద్దేశంతోనే జూలై 1 నుంచి అమలు కావాల్సిన నూతన మద్యం విధానాన్ని అక్టోబర్‌కు వాయిదా వేసిన ఎక్సైజ్‌శాఖ ఈ మూడు నెలల కాలంలో ప్రయోగాత్మకంగా చీపెస్ట్ లిక్కర్ రుచిని మందుబాబులకు చూపించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే కొన్ని డిస్టిలరీ కంపెనీలతో ఎక్సైజ్‌శాఖ, టీఎస్‌బీసీఎల్ అధికారులు చర్చలు జరిపారు. జూలై నుంచి మద్యం డిపోలకు చీపెస్ట్ లిక్కర్ సరఫరా అయ్యే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.
గుడుంబా ప్రభావిత ప్రాంతాల్లో ప్రయోగం
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 2,111 మద్యం దుకాణాలు కొనసాగుతున్నాయి. వీటిలో జిల్లాలవారీగా గుడుంబా వినియోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా మండలాల పరిధిలోని మద్యం దుకాణాల్లో ఈ చీపెస్ట్ లిక్కర్‌ను అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఆ మండలాల పరిధిలో గుడుంబా ఉత్పత్తి కేంద్రాలన్నింటినీ పూర్తిగా తొలగించడంతోపాటు గ్రామాల్లో నిల్వ ఉన్న గుడుంబాను స్వాధీనం చేసుకొని ఈ చీపెస్ట్ లిక్కర్‌ను ప్రవేశపెడతారు.
హాని కలిగించే గుడుంబాకు బానిసైన వారు ‘ఆరోగ్యకరమైన’ పద్ధతుల్లో డిస్టిలరీల్లో తయారైన ఈ మద్యాన్ని ఎలా ఆదరిస్తారనే విషయాన్ని సెప్టెంబర్ మొదటి వారంలోగా పరిశీలిస్తారు. ఈ చీప్ లిక్కర్ వల్ల మద్యం అమ్మకాల్లో తేడాలు, రెవెన్యూల్లో హెచ్చుతగ్గులతోపాటు మందుబాబుల ‘ఆరోగ్యాన్ని’ కూడా పరిగణనలోకి తీసుకొని సెప్టెంబర్ రెండో వారంలో నూతన మద్యం పాలసీని ఖరారు చేసే అవకాశం ఉందని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. చీపెస్ట్ లిక్కర్‌ను ప్రవేశపెట్టినా... గుడుంబా విక్రయాలు ఆగట్లేదని తేలితే ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది.
కోల్‌బెల్ట్ ఏరియా... కార్మిక వర్గాలు నివసించే ప్రాంతాలు
గుడుంబా విక్రయాలు అధికంగా సాగే ప్రాంతాల్లో సింగరేణి కోల్‌బెల్ట్ ఏరియా ముందు వరుసలో ఉంది. ఆ తరువాత వరుసలో ఇతర పారిశ్రామిక ప్రాంతాలు, గిరిజన తాండాలు, ఏజెన్సీ ఏరియాలు ఉన్నాయి. మంచిర్యాల, గోదావరిఖని, జగిత్యాల, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, రాజేంద్రనగర్, నల్లగొండ, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, గద్వాల, ధూల్‌పేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిల్లో గుడుంబా విక్రయాలు అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లోని వైన్‌షాపుల్లో తొలుత చీపెస్ట్ లిక్కర్‌ను అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. టెట్రా ప్యాక్, ప్లాస్టిక్ బాటిల్స్ ద్వారా 90 ఎంఎల్, 180 ఎంఎల్ పరిమాణాల్లో అందించాలని నిర్ణయించారు.