ముగిసిన డెడ్‌లైన్..! | from today Polyethylene Covers Ban in siddipet | Sakshi
Sakshi News home page

ముగిసిన డెడ్‌లైన్..!

Published Tue, Jul 1 2014 12:25 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

ముగిసిన డెడ్‌లైన్..! - Sakshi

ముగిసిన డెడ్‌లైన్..!

- నేటినుంచి సిద్దిపేటలో పాలిథిన్ కవర్ల నిషేధం
- ఆకస్మిక దాడులకు సిద్దిపేట మున్సిపల్ అధికారులు సిద్ధం

 సిద్దిపేటజోన్: ప్లాస్టిక్ రహిత పట్టణంగా సిద్దిపేటను తీర్చిదిద్దేందుకు అధికారులు కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా నెల రోజులు పాటు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమం సోమవారం నాటితో ముగిసింది. మంగళవారం నాటినుంచి పట్టణంలో పాలిథిన్ కవర్ల వాడకాన్ని నిషేధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జూలై 1 నుంచి పట్టణంలో పాలిథిన్ కవర్ల నిషేధం అమలులోకి రానుంది.

ఈ క్రమంలో మంగళవారం నుంచి మున్సిపల్ అధికారులు ఆకస్మిక దాడులకు బృందాలను ఏర్పాటు చేశారు. 40 మైక్రాన్ల మందం ఉన్న పాలిథిన్ కవర్లనే వాడాలనే నిబంధనను ఆమలు చేస్తూ నిర్ణీత మందం కన్నా తక్కువగా ఉన్న పాలిథిన్ కవర్ల వినియోగంపై మున్సిపల్ అధికారులు నిషేధం విధించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా భూ సమతుల్యత దెబ్బతినకుండా మున్సిపల్ అధికారులు  నెల క్రితమే పట్టణంలో పాలిథిన్ కవర్ల నిషేధంపై విస్తృత ప్రచారం చేపట్టారు.

అందులో భాగంగానే మున్సిపల్ కమిషనర్ రమణచారి నేతృత్వంలో 30 రోజులుగా పట్టణంలోని వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో రోజు వారీ సమీక్ష నిర్వహించారు. పాలిథిన్ కవర్ల వాడకం వల్ల కలిగే దుష్పలితాలను, ఇబ్బందులను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. గత నెలలో పట్టణంలోని పలు వ్యాపార వాణిజ్య సంస్థలపై ఆకస్మిక దాడులను నిర్వహించి కేసులు కూడా నమోదు చేశారు.

జూలై మాసం నుంచి పూర్తిస్థాయిలో పాలిథిన్ కవర్లను నిషేధించనున్న క్రమంలో వ్యాపారులకు ఆవగాహన కల్పించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సైతం వెనుకాడబోమని స్పష్టం చేశారు. పాలిథిన్ కవర్లను విక్రయించే వ్యాపార సంస్థలకు ముందుస్తుగా నోటీసులు  అందజేశారు.

అదే విధంగా వ్యాపార వాణిజ్య సంస్థలకు సైతం ఆవగాహన కల్పించారు. మొదటి విడతలో జరిమానాలు విధించి మరోమారు అటువంటి పొరపాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.  సిద్దిపేటను పాలిథిన్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలనే అధికారుల అశయం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement