రేపటినుంచే ఘనంగా బోనాల జాతర
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆషాడ మాస బోనాల ఉత్సవాలు ఈనెల 19 ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన వివరాలనుమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ ఏర్పాట్లపై మంత్రులతో సమావేశాన్ని నిర్వహించామన్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులు కార్యక్రమాలను నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఆగస్టు 2,3 తేదీల్లో సికింద్రాబాద్ ప్రాంతంలో, 9,10 తేదీల్లో పాతబస్తీ ఉమ్మడి దేవాయలంలోపాటు ఇతర ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు నిర్వహించ నున్నట్టు తెలిపారు.
లష్కర్ బోనాలుగా ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతర ఆది, సోమవారాల్లో నిర్వహించనున్నారు. ఆదివారం అమ్మవారికి బోనాలు, సాక సమర్పిస్తారు. అనంతరం రంగం ఉంటుంది. ఇందులో జోగిని భవిష్య వాణి వినిపించనుంది. అయితే ఈ సారి జంట నగరాల్లో నిర్వహించే ఉత్సవాల్లో జోగిని పలారం రాధిక సందడి చేయనుంది. హైదరాబాద్ , సికింద్రాబాద్ పరిధిలో అన్ని దేవాలయాల్లో బోనాల జాతరలో జోగిని రాధిక పాల్గొననుంది.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ జాతర నిర్వహించేందుకు ఏర్పాటు ఘనంగా జరుగుతున్నాయి. . తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన లక్షలాది మంది భక్తుల ఈ జాతరలో పాలుపంచుకోనున్నారు. బోనాల పండుగ సందోహం గోల్కొండ కోట లోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్‌సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జీహెచ్‌ఎంసీ, దేవాదాయ, పోలీసు, జలమండలి, విద్యుత్, ఆర్టీసీ, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో జంటనగరాల్లోని అమ్మవారి ఆలయాలన్నీ విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి.
మరోవైపు తెలంగాణా రాష్ట్రంలో అధికార పండుగగా నిర్వహించే బోనాల జాతరలో జోగిని వ్యవస్థను రద్దుచేయాలని, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.