నరేందర్, వాతావరణ శాఖ అధికారి, నిజామాబాద్ 45 డిగ్రీలకు చేరువగా నమోదైన ఉష్ణోగ్రత ( వాతావరణ శాఖ విడుదల చేసిన 0గ్రాఫ్)
ఇందూరు (నిజామాబాద్ అర్బన్): ఉన్నట్టుండి భానుడు ఇందూరుపై ఒక్కసారిగా నిప్పులు కక్కాడు. మూడు రోజుల కిందట 40 డిగ్రీలున్న ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతూ శుక్రవారం ఏకంగా 45 డిగ్రీలకు చేరువైంది. ఈ వేసవి సీజన్‌లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. భానుడి భగభగలతో ఇందూరు నిప్పుల కొలిమిలా మారింది. ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. ఇటు ముఖం మాడిపోయేలా భయంకరమైన వడ గాల్పులు దడ పుట్టించాయి. బయటకు వెళ్లాలంటే జనం జంకిపోయారు. ఉదయం 9 గంటలకే 34 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతోంది. 44 డిగ్రీలు దాటి ఎండలు దంచి కొట్టడంతో సాయంత్రం ఏడు దాటినా భూమి నుంచి వేడి సెగలు తగ్గడం లేదు.
సాయంత్రం ఐదు గంటలకే 41 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటోంది. సీసీ రోడ్లు ఉన్న ప్రాంతాల్లో వేడి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఇక బీటీ రోడ్లు, రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇంట్లో సీలింగ్ ఫ్యాన్లు ఏ మాత్రం పని చేయడం లేదు. వాటిని వినియోగించినా వేడి గాలి రావడంతో జనాలు కూలర్లను కొనుగోలు చేస్తున్నారు. ఎండల భయానికి ఇంటికే పరిమితమై ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. అత్యవసర ప్రయాణం చేసేవాళ్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు ముఖాలకు మాస్క్‌లు, తలకు క్యాప్‌లు వినియోగిస్తున్నారు. బయట పనులు చేసుకునే వారు ఉదయం 10 గంటల కల్లా పూర్తిచేసుకుని ఇళ్లకు చేసుకుంటున్నారు. మళ్లీ సాయంత్రం ఐదు దాటిన తరువాతే గడప దాటుతున్నారు. శీతల పానీ జ్యూస్‌లకు డిమాండ్ పెరిగింది. ప్రభుత్వ కార్యాలయాల్లో కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. కంప్యూటర్లు కూడా ఏసీలు, కూలర్లు పెడితే కానీ పని చేయడం చేదు.
రెండేళ్ల తరువాత మళ్లీ ఇప్పుడే...
2016 ఏప్రిల్ 30న 45.1 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కాగా మళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది.సిసలైన ఎండాకాలానికి ఏప్రిల్, మే నెలలకు పెట్టింది పేరు. రానున్న మే నెలలో ఎండల ఎంతగా తీవ్రంగా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం 45 డిగ్రీలు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు రానున్న రెండుమూడు రోజుల్లో 46 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఎండలు ఇంకా పెరిగే అవకాశముంది..
ఏప్రిల్ నెలలోనే 45 డిగ్రీల ఎండలు నమోదవుతున్నాయి. వచ్చే మే నెలలో 46 డిగ్రీలు దాటినా ఆశ్చర్యం లేదు. వచ్చే రెండు రోజుల్లో ఎండలు తీవ్రంగా ఉండనున్నాయి. అల్పపీడనాలు వస్తే తప్ప భానుడి భగభగల నుంచి ఉపశమనం లభించదు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటితే వాతావరణ శాఖ డేంజర్‌గా పరిగణిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment