పెబ్బేరు మండలం గుమ్మడం పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి ఐదుగురు.. 12వార్డుల స్థానాలకు 60మంది పోటీచేశారు. వీరిని 120మంది బలిపరిచారు. నామినేషన్ సమయంలో వీరంతా బకాయి ఉన్న పన్నులను గ్రామ పంచాయతీలో చెల్లించారు. ఒక్కొక్కరు రూ.1300 నుంచి రూ.1500వరకు చెల్లించడంతో గ్రామంలో రెండులక్షల 10వేల రూపాయలు వసూలయ్యాయి. ఈ డబ్బులు పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వ ఖజానాలో జమచేయాల్సి ఉంది. కానీ, ఆ డబ్బు ఖజానాలో జమ కాలేదు. అసలు అవి ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదు. ఈ పరిస్థితి కేవలం గుమ్మడం పంచాయతీదే కాదు..
పెబ్బేరు : పెబ్బేరు మండలంలో 25 గ్రామ పంచాయతీలున్నాయి. వీటికి 2013లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల సమయంలో పోటీ చేయాలంటే ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు ఉండకూడదన్న నిబంధన ఉంది. బకాయి ఉన్న అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరిస్తారు. దీనికి తోడు వారిని బలపరిచేవారు కూడా బకాయి ఉండకూడదన్న నిబంధన ఉంది. దీంతో పోటీకి దిగిన అభ్యర్థులతో పాటు వారిని బలపరిచేవారు కూడా తమ బకాయిలను గ్రామ పంచాయతీకి చెల్లించారు. ఇలా చెల్లించిన డబ్బు సుమారుగా 20లక్షల రూపాయల దాకా ఉంటుంది. ఆ డబ్బులో చాలా వరకు ప్రభుత్వ ఖజానాకు చేరలేదు. దీనిపై అధికారులు కూడా కచ్చితమైన సమాధానం చెప్పడం లేదు.
అప్పటి రికార్డులు అందుబాటులో లేవు
2013 స్థానిక ఎన్నికల సమయంలో అభ్యర్థుల నుంచి వసూలు చేసిన పన్నుల వివరాలు అందుబాటులో లేవు. ఆ సమయంలో ఇక్కడ పనిచేసిన పంచాయతీ కార్యదర్శికే తెలియాలి. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు సమాచార హక్కు చట్టం ద్వారా ఇదే వివరాలు అడగడంతో సమాచారం లేదని సమాధానం ఇచ్చాం.
-బాలరాజు, పంచాయతీ కార్యదర్శి, గుమ్మడం.
కొన్ని గ్రామపంచాయతీల్లో జమ చేయలేదు
స్థానిక సంస్థల ఎన్నికలలో అభ్యర్థుల నుంచి పన్నులు వసూలు చేసిన విషయం వాస్తవమే. వాటిని వెంటనే ఎస్టీఓలో జమ చేయాల్సిందిగా పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలిచ్చాం. కొన్ని గ్రామ పంచాయతీల్లో జమ చేయలేదు. వాటిని పరిశీలించి వెంటనే జమ చేసేలా చూస్తాం.
-జ్యోతి, ఎంపీడీఓ, పెబ్బేరు.
విచారణ చేస్తాం
గ్రామ పంచాయతీల్లో వసూలు చేసిన పన్నులను పంచాయతీ కార్యదర్శులు ఎస్టీలో జమ చేయాల్సి ఉంది. ఎక్కడైనా పంచాయతీ కార్యదర్శులు ఆ నిధులను ట్రెజరీలో జమచేయకుంటే వాటిపై విచారణ జరుపుతాం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటాం.
-వెంకటేశ్వర్లు, డీపీఓ, మహబూబ్‌నగర్
నిధులు గల్లంతు..!
Published Sat, Aug 22 2015 12:56 AM | Last Updated on Sun, Sep 3 2017 7:52 AM
Advertisement
Advertisement