జీఏడీ, ఆర్థిక శాఖలు బీఆర్‌కే భవనంలోకి?  | GAD and Finance Departments into BRK building | Sakshi
Sakshi News home page

జీఏడీ, ఆర్థిక శాఖలు బీఆర్‌కే భవనంలోకి? 

Published Thu, Jun 20 2019 3:27 AM | Last Updated on Thu, Jun 20 2019 3:27 AM

GAD and Finance Departments into BRK building - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులు మొదలుకాగానే అందులోని ప్రస్తుత కార్యాలయాలు తాత్కాలికంగా ఇతర భవనాల్లోకి తరలనున్నాయి. జీఏడీ, ఆర్థిక శాఖలాంటి ముఖ్యమైన కార్యాలయాలను ప్రస్తుత సచివాలయానికి చేరువలో ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవనంలోకి తరలించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులోంచి కొన్ని కార్యాలయాలను వేరే చోటకు తరలించనున్నారు. వీలైనన్ని ప్రధాన శాఖల కార్యాలయాలను ఈ భవన సముదాయంలోకి తరలించాలని నిర్ణయించారు. మిగిలిన వాటిని ఆయా శాఖల ఉన్నతాధికారుల కార్యాలయాలకు మార్చాలని నిర్ణయించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కార్యాలయాలన్ని ఎర్రమంజిల్‌లోని ఆ శాఖ ఈఎన్‌సీ కార్యాలయానికి, రవాణా శాఖ మంత్రి కార్యాలయాన్ని ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలోకి, నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని ఎర్రమంజిల్‌లోని నీటిపారుదల విభాగం కార్యాలయంలోకి... ఇలా సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. ఈలోపు బూర్గుల రామకృష్ణారావు భవనంలో కొత్త కార్యాలయాలకు వీలుగా భారీగా మార్పుచేర్పులు, మరమ్మతులు చేయాలని నిర్ణయించటం విశేషం.
 
ఒకేసారి కూల్చివేత.... 
సచివాలయంలోని కార్యాలయాలను తాత్కాలికంగా మరో చోటకు తరలిస్తే ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో, సచివాలయాన్ని రెండు విడతలుగా నిర్మించాలని తొలుత భావించారు. ప్రస్తుత కార్యాలయాలను ఏపీకి కేటాయించిన భవనాల్లోకి మార్చి తెలంగాణ సచివాలయ భవనాలను కూల్చివేయాలనేది తొలి నిర్ణయం. అక్కడే కొత్త భవనాలు నిర్మించి తిరిగి సచివాలయ కార్యాలయాలను వాటిల్లోకి మార్చి ఆ తర్వాత ఏపీ భవనాలను కూల్చాలని భావిం చారు. అలా చేస్తే భవనాల కూల్చివేతతో వచ్చే దుమ్ము ధూళితో ఇబ్బంది పడాల్సి వస్తుందని తేల్చారు. దీంతో ప్రత్యామ్నాయ భవనాల్లోకి తరలించాలని ఇప్పుడు నిర్ణయించారు.  

ఆ రెండు శాఖలకు కొత్త భవనాలు తప్పవా..
శాసనసభ, శాసన మండలిలకు ఎర్రమంజిల్‌లో కొత్త భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ పాత భవనాన్ని కూల్చి అక్కడ నిర్మించనున్నారు. దీనికి సమీపంలో నీటిపారుదల శాఖ కార్యాలయం ఉండటంతో దాన్ని కూడా కూల్చాల్సి వస్తోంది. దీంతో వేరే ప్రాంతంలో దాని కోసం ప్రత్యేకంగా మరో భవనం నిర్మించాల్సి ఉంది. ఇక్కడే రోడ్లు భవనాల శాఖ కోసం మూడేళ్లక్రితం భారీ ఆధునిక భవనాన్ని నిర్మించారు. రూ.12 కోట్ల అంచనా వ్యయంతో మొదలై ఆ తర్వాత రకరకాల పేర్లతో నిర్మాణ వ్యయాన్ని పెంచుతూపోయి చివరకు రూ.68 కోట్లతో దాన్ని కట్టారు. ఇంత వ్యయంతో నిర్మించినందున దాన్ని కూల్చొద్దని ప్రాథమికంగా భావిస్తున్నారు.

అసెంబ్లీకి సంబంధించిన కార్యాలయాలను ఇందులో ఏర్పాటు చేసుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. కానీ ఆర్కిటెక్ట్‌లు ఆ స్థలాన్ని పరిశీలించి, కొత్త అసెంబ్లీ నమూనాకు ఈ భవనం అడ్డుగా ఉంటుందని భావిస్తే మాత్రం కూల్చాల్సి ఉంటుంది. అప్పుడు ఆ భవనం కోసం చేసిన భారీ వ్యయం వృథా అయినట్టే. కూల్చాల్సిన అవసరం రాకున్నా అందులోని ఆర్‌అండ్‌బీ కార్యాలయాలను మాత్రం తరలించాల్సి ఉంటుంది. దాని కోసం వేరే చోట కొత్త భవనాన్ని నిర్మించాల్సి వస్తుంది. నీటిపారుదల శాఖ, ఆర్‌అండ్‌బీకి కలిపి కొత్త భవనాల కోసం కనీసం రూ.వంద కోట్లకు పైగా ఖర్చవుతుందని భావిస్తున్నారు.  

సచివాలయ భవనాల అప్పగింత పూర్తి 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధీనంలోని సచివాలయ భవనాల అప్పగింత ప్రక్రియ బుధవారం పూర్తయింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధీనంలోని హెచ్, జే, ఎల్, కే, నార్త్‌ హెచ్, సౌత్‌ హెచ్‌ బ్లాకులను ఆ రాష్ట్ర అధికారులు బుధవారం రాత్రి తెలంగాణ ప్రభుత్వ అధికారులకు అప్పగించారు. ప్రస్తుత సచివాలయం ఉన్న చోటే తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణానికి ఈనెల 27వ తేదీన శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వ యంత్రాంగం సత్వరంగా స్పందించి తమ అధీనంలోని సచివాలయ భవనాల అప్పగింత ప్రక్రియను పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయం తాత్కాలిక రాజధాని అమరావతికి తరలిపోవడంతో గత నాలుగేళ్లుగా హైదరాబాద్‌ నగరంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ కోసం కేటాయించిన భవనాలు నిరుపయోగంగా ఉన్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement