Burgula Ramakrishna Rao Building
-
ఆయుష్ కిట్ల రూపకల్పన అద్భుతం : ఈటెల
సాక్షి, హైదరాబాద్ : ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయుష్ రక్ష కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం బీఆర్కేఆర్ భవన్లో ప్రారంభించారు. రెడ్ జోన్ లో పని చేస్తున్న పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బందికి ఈ కిట్స్ ను అందజేయనున్నారు. 20 వేల కిట్స్ ను మొదటి దఫా పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ .. ఆయుర్వేదం అతి ప్రాచీనమైన వైద్య శాస్త్రమని పేర్కొన్నారు. కరోనా ను ఎదుర్కొనేందుకు ఆయుష్ కమీషనర్ అలుగు వర్షిణి ఆధ్వర్యంలో ఆయుష్ డిపార్ట్మెంట ఐదు రకాల మందులతో ఆయుష్ రక్ష కిట్స్‌ను రూపొందించారన్నారు. ఆయుష్ కిట్స్ తయారు చేసినందుకు వారికి అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచానికి ఇలాంటి వైద్యాన్ని అందించిన దేశం భారత దేశం మాత్రమేనన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత దేశం కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. తెలంగాణలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యాప్తి, మరణాల రేటు చాలా తక్కువగా ఉందని తెలిపారు. (లాక్డౌన్: భారీగా రోడ్డెక్కిన వాహనాలు) అనంతరం హైదరాబాద్ సెంట్రల్ జోన్ జాయింట్ కమిషనర్ విశ్వప్రసాద్, ఐజిపి హోమ్ గార్డ్స్ బాలనాగాదేవి, సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్ రెడ్డిలకు మంత్రి ఈటల రాజేందర్ ఆయుష్ రక్ష కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ డిపార్ట్మెంట్ అడిషనల్ డెరైక్టర్ అనసూయ, ప్రిన్సిపల్ సూర్యప్రకాష్, సూపరింటెండెంట్ పరమేశ్వర్, డ్రగ్ టెస్టింగ్ లాబొరటరీ డైరెక్టర్ శ్రీనివాస చారీ, ఫార్మసీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ప్రొఫెసర్ కె సి. డాక్టర్ శ్రీకాంత్ బాబు, కేంద్ర ఆయుర్వేద రీసెర్చ్ కౌన్సిల్ అధికారి డాక్టర్ సాకేత రాం, నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, విశ్వ ఆయుర్వేద పరిషద్ నేషనల్ సెక్రెటరీ డాక్టర్ ప్రేమనందరావు, డాక్టర్ సురేష్ జకోటియ పాల్గొన్నారు. ఈ కిట్స్ తో పాటు విశ్వ ఆయుర్వేద పరిషద్ తరపున 250 గ్రాముల చవన్ ప్రాష్‌ను రెండు వేల యూనిట్లుగా పంపిణీ చేస్తున్నట్లు సెక్రెటరీ తెలిపారు. (మాస్క్ లేకుంటే బుక్కయినట్టే..!) -
జీఏడీ, ఆర్థిక శాఖలు బీఆర్కే భవనంలోకి?
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులు మొదలుకాగానే అందులోని ప్రస్తుత కార్యాలయాలు తాత్కాలికంగా ఇతర భవనాల్లోకి తరలనున్నాయి. జీఏడీ, ఆర్థిక శాఖలాంటి ముఖ్యమైన కార్యాలయాలను ప్రస్తుత సచివాలయానికి చేరువలో ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవనంలోకి తరలించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులోంచి కొన్ని కార్యాలయాలను వేరే చోటకు తరలించనున్నారు. వీలైనన్ని ప్రధాన శాఖల కార్యాలయాలను ఈ భవన సముదాయంలోకి తరలించాలని నిర్ణయించారు. మిగిలిన వాటిని ఆయా శాఖల ఉన్నతాధికారుల కార్యాలయాలకు మార్చాలని నిర్ణయించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కార్యాలయాలన్ని ఎర్రమంజిల్‌లోని ఆ శాఖ ఈఎన్సీ కార్యాలయానికి, రవాణా శాఖ మంత్రి కార్యాలయాన్ని ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలోకి, నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని ఎర్రమంజిల్‌లోని నీటిపారుదల విభాగం కార్యాలయంలోకి... ఇలా సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. ఈలోపు బూర్గుల రామకృష్ణారావు భవనంలో కొత్త కార్యాలయాలకు వీలుగా భారీగా మార్పుచేర్పులు, మరమ్మతులు చేయాలని నిర్ణయించటం విశేషం. ఒకేసారి కూల్చివేత.... సచివాలయంలోని కార్యాలయాలను తాత్కాలికంగా మరో చోటకు తరలిస్తే ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో, సచివాలయాన్ని రెండు విడతలుగా నిర్మించాలని తొలుత భావించారు. ప్రస్తుత కార్యాలయాలను ఏపీకి కేటాయించిన భవనాల్లోకి మార్చి తెలంగాణ సచివాలయ భవనాలను కూల్చివేయాలనేది తొలి నిర్ణయం. అక్కడే కొత్త భవనాలు నిర్మించి తిరిగి సచివాలయ కార్యాలయాలను వాటిల్లోకి మార్చి ఆ తర్వాత ఏపీ భవనాలను కూల్చాలని భావిం చారు. అలా చేస్తే భవనాల కూల్చివేతతో వచ్చే దుమ్ము ధూళితో ఇబ్బంది పడాల్సి వస్తుందని తేల్చారు. దీంతో ప్రత్యామ్నాయ భవనాల్లోకి తరలించాలని ఇప్పుడు నిర్ణయించారు. ఆ రెండు శాఖలకు కొత్త భవనాలు తప్పవా.. శాసనసభ, శాసన మండలిలకు ఎర్రమంజిల్‌లో కొత్త భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ పాత భవనాన్ని కూల్చి అక్కడ నిర్మించనున్నారు. దీనికి సమీపంలో నీటిపారుదల శాఖ కార్యాలయం ఉండటంతో దాన్ని కూడా కూల్చాల్సి వస్తోంది. దీంతో వేరే ప్రాంతంలో దాని కోసం ప్రత్యేకంగా మరో భవనం నిర్మించాల్సి ఉంది. ఇక్కడే రోడ్లు భవనాల శాఖ కోసం మూడేళ్లక్రితం భారీ ఆధునిక భవనాన్ని నిర్మించారు. రూ.12 కోట్ల అంచనా వ్యయంతో మొదలై ఆ తర్వాత రకరకాల పేర్లతో నిర్మాణ వ్యయాన్ని పెంచుతూపోయి చివరకు రూ.68 కోట్లతో దాన్ని కట్టారు. ఇంత వ్యయంతో నిర్మించినందున దాన్ని కూల్చొద్దని ప్రాథమికంగా భావిస్తున్నారు. అసెంబ్లీకి సంబంధించిన కార్యాలయాలను ఇందులో ఏర్పాటు చేసుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. కానీ ఆర్కిటెక్ట్‌లు ఆ స్థలాన్ని పరిశీలించి, కొత్త అసెంబ్లీ నమూనాకు ఈ భవనం అడ్డుగా ఉంటుందని భావిస్తే మాత్రం కూల్చాల్సి ఉంటుంది. అప్పుడు ఆ భవనం కోసం చేసిన భారీ వ్యయం వృథా అయినట్టే. కూల్చాల్సిన అవసరం రాకున్నా అందులోని ఆర్అండ్బీ కార్యాలయాలను మాత్రం తరలించాల్సి ఉంటుంది. దాని కోసం వేరే చోట కొత్త భవనాన్ని నిర్మించాల్సి వస్తుంది. నీటిపారుదల శాఖ, ఆర్‌అండ్‌బీకి కలిపి కొత్త భవనాల కోసం కనీసం రూ.వంద కోట్లకు పైగా ఖర్చవుతుందని భావిస్తున్నారు. సచివాలయ భవనాల అప్పగింత పూర్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధీనంలోని సచివాలయ భవనాల అప్పగింత ప్రక్రియ బుధవారం పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధీనంలోని హెచ్, జే, ఎల్, కే, నార్త్ హెచ్, సౌత్ హెచ్ బ్లాకులను ఆ రాష్ట్ర అధికారులు బుధవారం రాత్రి తెలంగాణ ప్రభుత్వ అధికారులకు అప్పగించారు. ప్రస్తుత సచివాలయం ఉన్న చోటే తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణానికి ఈనెల 27వ తేదీన శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వ యంత్రాంగం సత్వరంగా స్పందించి తమ అధీనంలోని సచివాలయ భవనాల అప్పగింత ప్రక్రియను పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం తాత్కాలిక రాజధాని అమరావతికి తరలిపోవడంతో గత నాలుగేళ్లుగా హైదరాబాద్ నగరంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ కోసం కేటాయించిన భవనాలు నిరుపయోగంగా ఉన్న సంగతి తెలిసిందే. -
ఏపీ భవనాల్లోకి సచివాలయం!
► కొత్త భవనాలు నిర్మించే వరకు వినియోగం ► తర్వాతే ఏపీ భవనాల కూల్చివేత ► కొత్త ప్రతిపాదనలను పరిశీలిస్తున్న సీఎస్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త సచివాలయ భవనం నిర్మించేందుకు.. ఇప్పుడున్న భవనంలోని కార్యాలయాలను పలు ప్రాంతాల్లోని ఇతర భవనాలకు తరలించడంపై కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. సచివాలయాన్ని ఇతర ప్రాంతాలకు తరలించే బదులు.. ఏపీ ఖాళీ చేసి అప్పగించనున్న భవనాల్లోకి మార్చితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బూర్గుల రామకృష్ణారావు భవనంలో సీఎం కార్యాలయంతోపాటు పలు విభాగాలను ఏర్పాటు చే యాలని, మరికొన్ని ఇతర భవనాల్లో కొన్ని కార్యాలయాలను సర్దుబాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇలా సచివాలయాన్ని ఇతర చోట్లకు తరలిస్తే ఇబ్బందులుంటాయని, కీలక పత్రాలు మాయమయ్యే ప్రమాదం ఉంటుందనే ఆందోళనలు ఉన్నా యి. ఆయా భవనాలకు భారీగా మరమ్మతులు చేయాల్సి రావడంతో విపరీతంగా ఖర్చు పెరుగుతుంది. ఇప్పటికే కొత్త సచివాలయం దుబారా అంటూ ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు.. ఇది మరో అవకాశమిస్తుంద నే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే దీనిపై సీఎస్‌కు కొందరు సన్నిహితులు, అధికారులు పలు కీలక సూచనలు చేసినట్టు సమాచారం. ఆ భవనాలు వినియోగిస్తే..! తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఏపీ ఆధీనంలో ఉన్న సచివాలయ భవనాలను తెలంగాణకు అప్పగించేందుకు ఆ రాష్ట్రం సానుకూలత వ్యక్తం చేసింది. ఇప్పటికే ఏపీ సచివాలయం దాదాపు తరలిపోయింది. కేవలం ఎల్ బ్లాక్‌లోని ఓ అంతస్తును మాత్రమే ఇంకా వినియోగిస్తున్నారు. అందులోని కార్యాలయాలనూ త్వరలోనే తరలించనున్నారు. మరోవైపు ప్రస్తుతం తెలంగాణ సచివాలయం కొనసాగుతున్న ఏ, బీ, సీ, డీ బ్లాకులను తొలగించి అక్కడే కొత్త భవనాలను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. అంటే ఏపీ సచివాలయం ఉన్న భవనాల తొలగింపు ప్రస్తుతానికి అవసరం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ సచివాలయాన్ని ఏ, బీ, సీ, డీ బ్లాకుల నుంచి హెచ్, ఐ, జే, కే, ఎల్ బ్లాకుల్లోకి తరలిస్తే సరిపోతుందని సీఎస్‌కు సన్నిహితులు సలహా ఇచ్చినట్టు సమాచారం. కొత్త భవనం సిద్ధమయ్యాక అందులోకి కార్యాలయాలను తరలించి హెచ్, ఐ, జే, కే, ఎల్ బ్లాకులను కూల్చివేయవచ్చని.. వాటి స్థానంలో ప్రతిపాదించిన పచ్చిక బయళ్లు, ఇతర నిర్మాణాలను చేపట్టవచ్చని సూచించినట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే ఏ ఇబ్బందీ ఉండదని పేర్కొన్నట్లు తెలిసింది. దీనివల్ల కార్యాలయాల తరలింపు భారం, మరమ్మతుల కోసం ఆర్థిక భారం తప్పుతాయని.. తరలింపులో ఫైళ్లు, ఇతర సమాచారం గల్లంతయ్యే అవకాశమూ ఉండదని అభిప్రాయపడినట్లు సమాచారం. సమన్వయ లోపమూ తప్పుతుంది.. ముఖ్యంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో కార్యాలయం ఉండాల్సి వస్తే సమన్వయం లోపిస్తుందని వారు సీఎస్‌కు సూచించినట్లు తెలిసింది. ఏపీ ఇచ్చేసే భవనాల్లోకి మారిస్తే.. అదే సచివాలయంలో కొనసాగినట్లవుతుందని, ఏ ఇబ్బందీ ఉండదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఇక నవంబర్ 24న సీఎం కొత్త క్యాంపు కార్యాలయ భవనం అందుబాటులోకి వస్తున్నందున సీఎం అక్కడి నుంచే పాలన కొనసాగించవచ్చని సూచించినట్లు తెలిసింది. అక్కడ విశాలమైన సమావేశ మందిరం ఉన్నందున సమావేశాల నిర్వహణకు ఇబ్బంది ఉండదని పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఈ ఆలోచనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆమోదించేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు. వేగంగా క్యాంపు కార్యాలయ పనులు మరోవైపు సీఎం కొత్త క్యాంపు కార్యాలయ భవనం వేగంగా సిద్ధమవుతోంది. నవంబర్ 24న గృహప్రవేశానికి ఇప్పటికే ము హూర్తం ఖరారైనందున ఈనెల 20లోపు భవనాన్ని సిద్ధం చేసి, అప్పగించాలని రోడ్లు భవనాల శాఖ నిర్ణయించింది. ఇందుకోసం రాత్రింబవళ్లు పనులు జరిపిస్తున్నారు. ప్రస్తుతం ఫినిషింగ్, ఫ్లోరింగ్, రంగులు వేసే పనులు జరుగుతున్నాయి. రూ.33 కోట్లతో తొమ్మిది ఎకరాల్లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవన సముదాయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.