ఏపీ భవనాల్లోకి సచివాలయం!
► కొత్త భవనాలు నిర్మించే వరకు వినియోగం
► తర్వాతే ఏపీ భవనాల కూల్చివేత
► కొత్త ప్రతిపాదనలను పరిశీలిస్తున్న సీఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త సచివాలయ భవనం నిర్మించేందుకు.. ఇప్పుడున్న భవనంలోని కార్యాలయాలను పలు ప్రాంతాల్లోని ఇతర భవనాలకు తరలించడంపై కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. సచివాలయాన్ని ఇతర ప్రాంతాలకు తరలించే బదులు.. ఏపీ ఖాళీ చేసి అప్పగించనున్న భవనాల్లోకి మార్చితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బూర్గుల రామకృష్ణారావు భవనంలో సీఎం కార్యాలయంతోపాటు పలు విభాగాలను ఏర్పాటు చే యాలని, మరికొన్ని ఇతర భవనాల్లో కొన్ని కార్యాలయాలను సర్దుబాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఇలా సచివాలయాన్ని ఇతర చోట్లకు తరలిస్తే ఇబ్బందులుంటాయని, కీలక పత్రాలు మాయమయ్యే ప్రమాదం ఉంటుందనే ఆందోళనలు ఉన్నా యి. ఆయా భవనాలకు భారీగా మరమ్మతులు చేయాల్సి రావడంతో విపరీతంగా ఖర్చు పెరుగుతుంది. ఇప్పటికే కొత్త సచివాలయం దుబారా అంటూ ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు.. ఇది మరో అవకాశమిస్తుంద నే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే దీనిపై సీఎస్‌కు కొందరు సన్నిహితులు, అధికారులు పలు కీలక సూచనలు చేసినట్టు సమాచారం.
ఆ భవనాలు వినియోగిస్తే..!
తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఏపీ ఆధీనంలో ఉన్న సచివాలయ భవనాలను తెలంగాణకు అప్పగించేందుకు ఆ రాష్ట్రం సానుకూలత వ్యక్తం చేసింది. ఇప్పటికే ఏపీ సచివాలయం దాదాపు తరలిపోయింది. కేవలం ఎల్ బ్లాక్‌లోని ఓ అంతస్తును మాత్రమే ఇంకా వినియోగిస్తున్నారు. అందులోని కార్యాలయాలనూ త్వరలోనే తరలించనున్నారు. మరోవైపు ప్రస్తుతం తెలంగాణ సచివాలయం కొనసాగుతున్న ఏ, బీ, సీ, డీ బ్లాకులను తొలగించి అక్కడే కొత్త భవనాలను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. అంటే ఏపీ సచివాలయం ఉన్న భవనాల తొలగింపు ప్రస్తుతానికి అవసరం లేదు.
ఈ నేపథ్యంలో తెలంగాణ సచివాలయాన్ని ఏ, బీ, సీ, డీ బ్లాకుల నుంచి హెచ్, ఐ, జే, కే, ఎల్ బ్లాకుల్లోకి తరలిస్తే సరిపోతుందని సీఎస్‌కు సన్నిహితులు సలహా ఇచ్చినట్టు సమాచారం. కొత్త భవనం సిద్ధమయ్యాక అందులోకి కార్యాలయాలను తరలించి హెచ్, ఐ, జే, కే, ఎల్ బ్లాకులను కూల్చివేయవచ్చని.. వాటి స్థానంలో ప్రతిపాదించిన పచ్చిక బయళ్లు, ఇతర నిర్మాణాలను చేపట్టవచ్చని సూచించినట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే ఏ ఇబ్బందీ ఉండదని పేర్కొన్నట్లు తెలిసింది. దీనివల్ల కార్యాలయాల తరలింపు భారం, మరమ్మతుల కోసం ఆర్థిక భారం తప్పుతాయని.. తరలింపులో ఫైళ్లు, ఇతర సమాచారం గల్లంతయ్యే అవకాశమూ ఉండదని అభిప్రాయపడినట్లు సమాచారం.
సమన్వయ లోపమూ తప్పుతుంది..
ముఖ్యంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో కార్యాలయం ఉండాల్సి వస్తే సమన్వయం లోపిస్తుందని వారు సీఎస్‌కు సూచించినట్లు తెలిసింది. ఏపీ ఇచ్చేసే భవనాల్లోకి మారిస్తే.. అదే సచివాలయంలో కొనసాగినట్లవుతుందని, ఏ ఇబ్బందీ ఉండదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఇక నవంబర్ 24న సీఎం కొత్త క్యాంపు కార్యాలయ భవనం అందుబాటులోకి వస్తున్నందున సీఎం అక్కడి నుంచే పాలన కొనసాగించవచ్చని సూచించినట్లు తెలిసింది. అక్కడ విశాలమైన సమావేశ మందిరం ఉన్నందున సమావేశాల నిర్వహణకు ఇబ్బంది ఉండదని పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఈ ఆలోచనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆమోదించేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు.
వేగంగా క్యాంపు కార్యాలయ పనులు
మరోవైపు సీఎం కొత్త క్యాంపు కార్యాలయ భవనం వేగంగా సిద్ధమవుతోంది. నవంబర్ 24న గృహప్రవేశానికి ఇప్పటికే ము హూర్తం ఖరారైనందున ఈనెల 20లోపు భవనాన్ని సిద్ధం చేసి, అప్పగించాలని రోడ్లు భవనాల శాఖ నిర్ణయించింది. ఇందుకోసం రాత్రింబవళ్లు పనులు జరిపిస్తున్నారు. ప్రస్తుతం ఫినిషింగ్, ఫ్లోరింగ్, రంగులు వేసే పనులు జరుగుతున్నాయి. రూ.33 కోట్లతో తొమ్మిది ఎకరాల్లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవన సముదాయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.