సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార టీఆర్‌ఎస్‌లోకి వలస వెళ్లగా తాజాగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సైతం అదేబాట పట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన గుడ్‌బై చెప్పారు. తన సతీమణి, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతితో కలసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు భార్యాభర్తలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. అలాగే సోమవారం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో వారు భేటీ ఆయ్యారు. ఈ క్రమంలో గండ్ర జ్యోతిని వరంగల్ గ్రామీణ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ ఖరారు చేసింది.
భూపాలపల్లి జిల్లా అభివృద్ధి కోసమే...
‘భూపాలపల్లి జిల్లా తరలిపోతుందన్న అపవాదులను పటాపంచలు చేయడానికి, జిల్లా సమగ్రాభివృద్ధికి, అశేష సింగరేణి కార్మికుల ఆకాంక్షలను సాకారం చేయడానికి, భూపాలపల్లి జిల్లాను అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతో కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నా. కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రణాళికాబద్ధంగా, చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారు. అందుకే తెలంగాణ ప్రజలు ఆయనకు రెండోసారి అధికారం ఇచ్చారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవడం ప్రజాప్రతినిధిగా నా విధి. భూపాలపల్లి జిల్లా, నియోజకవర్గ ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకుంటా. ఎన్నికల సందర్భంగా ఔటర్ రింగ్‌రోడ్డు, మెడికల్ కాలేజీ సాధిస్తానని చెప్పా. నా మాటకు కట్టుబడి ఉన్నా. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు నియోజకవర్గ పరిధిలోని ఎత్తిపోతల పథకాల నిర్మాణం పూర్తయ్యేలా చూడటం నా బాధ్యత. కేసీఆర్ మార్గనిర్దేశకత్వంలో వాటిని పూర్తి చేస్తా. టీఆర్‌ఎస్‌పై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నాకు అచంచల నమ్మకం ఉంది. తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిద్దీదుతున్న ఆయనతో కలసి నడవాలని నిర్ణయించుకున్నా. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన పదవులన్నింటికీ రాజీనామా చేయడానికి సిద్ధమే. అతిత్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా’ అని లేఖలో గండ్ర పేర్కొన్నారు.
భర్త అడుగుజాడల్లోనే వెళ్తున్నా...
కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు గండ్ర జ్యోతి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. ‘జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి, కాంగ్రెస్ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. నాకు అవకాశం ఇచ్చి రాజకీయంగా నన్ను ప్రోత్సహించిన సోనియాగాంధీతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తదితరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా భర్త, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమాణారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో నేను కాంగ్రెస్‌లో కొనసాగడం భావ్యం కాదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నా’ అని ఆమె వివరించారు. గండ్ర వెంకట రమణారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 102కు పెరగనుంది.
టీఆర్‌ఎస్‌లోకి ఎమ్మెల్యే గండ్ర
Published Mon, Apr 22 2019 11:06 PM | Last Updated on Tue, Apr 23 2019 7:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment