గంజాయి ఘాటు.. | Ganja Crops In Warangal | Sakshi
Sakshi News home page

గంజాయి ఘాటు..

Published Sat, Feb 9 2019 10:40 AM | Last Updated on Wed, Mar 6 2019 8:09 AM

Ganja Crops In Warangal - Sakshi

నర్సంపేట మండలం దాసరిపల్లిలో గంజాయి పంట వద్ద పోలీసులు(ఫైల్‌) 

సాక్షి, వరంగల్‌ రూరల్‌ : వ్యవసాయాధారిత పేరొందిన జిల్లాకు గంజాయి మహ్మమ్మారి సోకింది. యథేచ్ఛగా సాగు చేస్తున్నా సంబంధిత అధికారులు దృష్టి సారించకపోవడం విడ్డూరం. గంజాయి మత్తెక్కిస్తూ జీవితాలను బలి తీసుకుంటోంది. ప్రమాదకరమైన మత్తు యథేచ్ఛగా చేతులు మారుతోంది. క్షణాల్లో జీవితాలను పీల్చి పిప్పి చేసే మహమ్మారి నిషామత్తులో చదువుకున్నవారు, చదువులేని వారు బలవుతున్నారు. గుప్పుమంటున్న గంజాయి మత్తుకు నేటి యువత చిత్తవడం ఆందోళన కలిగించిన అంశం. గ్రామీణ జిల్లాగా పేరొందిన రూరల్‌లో ఎక్కువగా మిర్చి, పసుపు పంటలు సాగు చేస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు దళారులు మిర్చి పంటల్లో గంజాయి సాగు చేస్తున్నారు. మిర్చి పంటల్లో సాగు చేస్తూ ఇటీవల పట్టుబడిన సంఘటనలు కోకొల్లలు. యథేచ్ఛగా సాగుతున్న ఈ మత్తు దందాకు అడ్డుకట్ట వేయడంలో పోలీసులు, ఇతర అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది విమర్శలు వెల్లువెత్తున్నాయి. శీతాకాలం ముగిసిపోయి వేసవికాలం సమీపిస్తున్నందున ఇలాంటి సమయంలోనే గంజాయి పంట చేతికొచ్చి చేతులు మారుతుంది.

అంతర పంటగా..
గంజాయిపై నిషేదం ఉండడంతో ఏజెంట్లు రోడ్‌ హైవే మార్గాలకు సమీపంలోని గ్రామాల్లో సాగు చేయిస్తున్నారు. గంజాయి బయటకు కనిపించకుండా ఉండేందుకు ముందుగా మిర్చి వంటి పంటలు వేస్తున్నారు. మిర్చి విత్తనాలు మొలకెత్తి కనీసం అడుగు ఎత్తు పెరిగే వరకు చూసి ఆ తర్వాత అంతర పంటగా గంజాయి సాగును మొదలు పెడుతున్నారు. బయటకు మిర్చి పంట తరహాలో కనిపించినా లోపల గంజాయి మొక్కలు ఉంటాయి. మిర్చి కన్నా గంజాయి మొక్క ఎక్కువ ఎత్తు పెరుగుతుంది. మొక్క ఎదిగే క్రమంలో మధ్యకు చీల్చుతున్నారు. దీంతో మొక్క ఎదుగుదల పైకి కనబడకుండా వాటికి సమాతరంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఎవరూ గంజాయి సాగును గుర్తుపట్టని పరిస్థితి ఉండడంతో సాగుదారులకు వరంగా మారుతోంది.

పట్టుబడుతున్న గంజాయి..
పోలీసుల నిఘ ఉన్నప్పటికి జిల్లాలో గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. బైక్‌లో నాలుగు కేజీల గంజాయి పెట్టుకుని జనవరి 29న సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనవరి 13న 1 కిలో గంజాయి బైక్‌లో పెట్టుకుని సరఫరా చేస్తున్న వ్యక్తిని, గత సంవత్సరం డిసెంబర్‌ 27న ఆటోలో నాలుగు కిలోల గంజాయిని సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇలా గత సంవత్సరం గంజాయి విక్రయాల కేసులు 14 నమోదయ్యాయి. గంజాయిని వరంగల్‌ రూరల్‌ జిల్లాలో అక్కడక్కడ సాగు చేస్తున్నారు. జనవరి 22న నర్సంపేట మండలంలోని దాసరిపల్లిలో 1.15ఎకరాల్లో మిర్చిలో అంతర పంటగా గంజాయిని సాగు చేశారు. దీనిలో రూ.10 లక్షలు విలువ చేసే 220 మొక్కలు గంజాయి మొక్కలను ఎక్సైజ్‌ పోలీసులు ధ్వంసం చేశారు. సాగు చేస్తున్న యజమాని ఇంట్లో 12 కిలోల ఎండు గంజాయి సైతం లభ్యమైంది. గతంలో ఇక్కడ సాగు చేసి ఇతర ప్రాంతాలకు విక్రయించేందుకు పంపించేవారు. గత కొంత కాలం జిల్లాలోనే సాగు చేస్తూ ఇక్కడే విక్రయిస్తున్నారని తెలుస్తోంది.

మూడు దమ్ములు.. ఆరు కిక్కులు
గంజాయి దందా జిల్లాలో మూడు దమ్ములు.. ఆరు కిక్కులుగా సాగుతోంది. యువతనే టార్గెట్‌ చేసుకుని విక్రయాలు సాగిస్తున్నారు. ఎడ్యుకేషనల్‌ హబ్‌గా ఉన్న జిల్లాకు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి తమ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. చిన్న చిన్న పాన్‌ డబ్బాలు, బేకరీలు, బస్టాండ్, రైల్వే స్టేషన్‌లు, కళాశాలకు సమీపాల్లో విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో విక్రయదారులే సిగరేట్లలో గంజాయిని నింపుకుని తీసువచ్చి విక్రయిస్తున్నారు ప్యాకెట్‌ల రూపంలో సైతం విక్రయాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. ఒక్కో సిగరేట్‌ రూ 50లకు, ప్యాకెట్‌ అయితే రూ.100 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారని సమాచారం. నగరంలోని అండర్‌బ్రిడ్జి సమీపంలోని ఓ కాలనీకి చెందిన వ్యక్తి గత కొన్ని రోజులు గంజాయిని విక్రయిస్తూ తాగుతూ దానికి బానిసై ఇటీవల ఆనారోగ్యం భారిన పడి మరణించాడు. దీంతో ఆ కాలనీలో గంజాయి విక్రయించవద్దని తీర్మాణం చేశారని సమాచారం.

అడ్డాలు ఇవే.. 
రూరల్‌ జిల్లాకు వరంగల్‌ నగరం దగ్గర ఉండడంతో ప్రధానంగా వరంగల్‌ ప్రాంతంలో ఉర్సు గుట్ట, ఎస్‌ఆర్‌ఆర్‌ తోట, పెరుకవాడ, శాంతినగర్, లేబర్‌ కాలనీలోని ఈఎస్‌ఐ ఆసుపత్రి ప్రాంగంణంలో, బొల్లికుంట, ఆటోనగర్‌ కాలువ, హన్మకొండ ప్రాంతంలో దర్గా రోడ్, పబ్లిక గార్డెన్, యూనివర్సిటీ ప్రాంతం, హంటర్‌ రోడ్‌లలో ఎక్కువగా యువత అడ్డాలుగా ఉండి తాగుతున్నారని సమాచారం. మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లేబర్‌ కాలనీ ఈఎస్‌ఐ ఆస్పత్రి ప్రాంగణంలో ఖాళీ క్వార్టర్‌లు ఉండడంతో అందులో యువత అడ్డాగా చేసుకుని గంజాయి తాగుతున్నారని తెలిసింది. గంజాయి మహమ్మారి నుంచి యువతను, పెద్దలను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. 

ప్రత్యేక నిఘా పెట్టాం..
గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో తనిఖీలు విస్తృతంగా చేస్తున్నాం. గంజాయి విక్రయాలు చేసిన వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. – వెంకట్‌రెడ్డి, డీసీపీ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement