Ganja smugglers
-
ఐదుగురు గంజాయి స్మగ్లర్లు అరెస్ట్
చింతపల్లి రూరల్ (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఒడిశా నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న 759 కిలోల గంజాయిని గురువారం స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు స్థానిక ఏఎస్పీ ప్రతాప్‌శివకిశోర్ తెలిపారు. ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో గంజాయి లభ్యం కాకపోవడంతో ధారకొండ పంచాయతీ గంగవరం గ్రామానికి చెందిన వండలం బాలు బద్దర్ తనకు పరిచయం ఉన్న ఒడిశాలోని చిత్రకొండ బ్లాక్ బరడబందకు చెందిన చేపల వ్యాపారి లింగుఖిలా (బాబూరావు)ను ఆశ్రయించాడు. అతని ద్వారా 759 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి రెండు బొలోరా వాహనాల్లో గూడెం, చింతపల్లి మీదుగా తాళ్లపాలెం చేర్చేందుకు లింగుఖిలాతో రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు వ్యాన్లలో గంజాయి తీసుకొస్తుండగా గూడెం కొత్తవీధిలోని సంస్థ కాలనీ వద్ద సీఐ అప్పలనాయుడు, ఎస్ఐ అప్పలసూరి సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. వ్యాన్లలో ఉన్న బాలుబద్దర్‌తోపాటు రింతాడ పంచాయతీ కుమ్మరివీధికి చెందిన పాంగి గోవర్దన్, మాలిగుడకు చెందిన కొర్రలైకోన్ (లక్ష్మణ్), ఊబలపాలెంకు చెందిన కిల్లో శంకర్రావు, చింతపల్లి మండలం కడశిల్పకి చెందిన మైనర్ (17)ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.38 లక్షల విలువైన 759 కిలోల గంజాయి, రెండు వాహనాలు, ఐదు సెల్ఫోన్లు, రూ.16,900 స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు లింగుఖిలా (బాబూరావు) కోసం గాలిస్తున్నామని ఏఎస్పీ తెలిపారు. ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని వెల్లడించారు. -
తుక్కు కింద కుక్కి
సంగారెడ్డి అర్బన్: అనుమానం రాకుండా ఇనుప తుక్కు లోడ్ కింద రహస్యంగా గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టురట్టయింది. హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వైపు వెళుతున్న ఓ లారీని సంగారెడ్డి రూరల్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు కలసి సోమవారం ఉదయం 6 గంటల సమయంలో కంది చౌరస్తాలో తనిఖీ చేయగా గుట్టుగా గంజాయిని తరలిస్తున్న విషయాన్ని గుర్తించారు. లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి ఆరు క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రధాన సూత్రదారి పరారీలో ఉన్నాడు. సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా మాలెగావ్ గ్రామానికి చెందిన అనిల్ గోవింద్ చిరు వ్యాపారంతో పాటు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన గణేశ్ నందకిషోర్ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరికి సంగారెడ్డి జిల్లాలోని ఎంకేపల్లి వాసి అనిల్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో వీరంతా ముఠాగా ఏర్పడ్డారు. ఈ క్రమంలో గంజాయిని మహారాష్ట్రలోని పండరీపూర్‌కి తరలిస్తే రూ.50 వేలు ఇస్తానని అనిల్‌రెడ్డి చెప్పడంతో మిగతా ఇద్దరు ఏపీలోని తుని వద్ద ప్లాస్టిక్ సంచుల్లో ఆరు క్వింటాళ్ల గంజాయిని ఇనుప స్క్రాప్ కింద లారీలో లోడ్ చేశారు. అక్కడినుంచి బయలుదేరి హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వైపు వెళ్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు లారీని పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ మార్కెట్లో సుమారు రూ.60 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను కోర్టు ముందు హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. ప్రధాన సూత్రధారి అనిల్‌రెడ్డి పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని చెప్పారు. -
విస్తృత తనిఖీలు.. 150 కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గంజాయి వేట దూకుడుగా సాగుతోంది. గంజాయిని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు పోలీస్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు కొరడా ఝుళిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్లు, ఎక్సైజ్ ఠాణా పరిధిలో ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నాయి. భారీస్థాయిలో కేసులు నమోదు చేస్తున్నాయి. గంజాయి సాగు చేస్తున్న వారితోపాటు సరఫరా చేస్తున్న వారినీ అరెస్ట్‌చేసి కటకటాల్లోకి నెడుతున్నాయి. ఈ నెల 20న సీఎం కేసీఆర్ సమీక్ష తర్వాత నుంచి ఇప్పటివరకు నాలుగు క్వింటాళ్లకుపైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు చెప్పాయి. ప్రత్యేక బృందాల సోదాలు ప్రతీ జిల్లా సరిహద్దుల్లో పోలీస్, ఎక్సైజ్ శాఖలు తనిఖీలు ముమ్మరం చేశాయి. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోనూ నిఘా పెంచి గంజాయి స్మగ్లర్లకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతున్నాయి. హైదరాబాద్‌లోని అన్ని జోన్ల డీసీపీల పరిధిలో ప్రతీ రోజు 4 నుంచి 6 గంజాయి కేసులు నమోదవుతున్నాయి. ఒక్కో కేసులో 2 కేజీలకుపైగా గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నాయి. ఈ వారం రోజుల్లో ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే గంజాయి, డ్రగ్స్‌కు సంబంధించి 38 కేసులు నమోదు చేసినట్టు సీపీ అంజనీకుమార్ తెలిపారు. క్వింటాల్‌కుపైగా గంజాయిని హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్వాధీనం చేసుకున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. అదేవిధంగా సైబరాబాద్, రాచకొండ కమిషరేట్లలోనూ వేట కొనసాగుతోంది. సైబరాబాద్‌లో క్రైమ్స్ విభా గం డీసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటుచేసి సోదాలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 10 కేసులు నమోదు చేసి 11 కేజీల గంజా యి స్వాధీనం చేసుకుని, 17 మందిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. అదేవిధంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో తనిఖీలు చేసి 38 కేసులు నమోదు చేశా రు. గంజాయి సిగరెట్లు విక్రయిస్తున్న పాన్షాపులపైనా దృష్టి పెట్టి 13 మందిపై కేసులు పెట్టారు. జిల్లాల్లోనూ ముమ్మరంగా... గంజాయి కట్టడికి వరంగల్, కరీంనగర్, ఖమ్మం కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి మహారాష్ట్ర, తెలంగాణకు సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 32 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా కరీంనగర్‌లోని హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులకు 11.6 కేజీల గంజాయి పట్టుబడటం సంచలనం రేపింది. పోలీసులంతా ఎన్నికల బందోబస్తు, నేతల ప్రచారం, భద్రత వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో గంజాయి స్మగ్లర్లు ఇదే అదనుగా భావించినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో సీపీ సత్యనారాయణ అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో విస్తృతమైన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, పెద్దపల్లి, మంథనిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే, వరుసగా గంజాయి కేసుల్లో పట్టుబడుతున్న నిందితులపై పోలీసులు పీడీ యాక్ట్ అమలుచేస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 31 మందిపై, సైబరాబాద్‌లో ఆరుగురు, రాచకొండలో 8 మంది, నల్లగొండలో ఐదుగురు, ఖమ్మం, భద్రాచలం పోలీస్యూనిట్లలో 9 మందిపై పీడీ యాక్ట్ నమోదుచేశారు. గంజాయి సాగుపై నజర్ కొత్తగూడెం, రామగుండం కమిషనరేట్, ఆసిఫాబాద్, రాచకొండ, సంగారెడ్డి, సైబరాబాద్, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, నల్లగొండ, వికారాబాద్ జిల్లాల్లో గంజాయి సాగుపై ఇటు పోలీస్, అటు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాయి. అంతర్‌పంట పేరుతో గంజాయి సాగు చేస్తున్న వారిని గుర్తించి, పంటలను ధ్వంసం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని జాఫర్పల్లిలో, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్ పరిధిలోని కడ్తాల్లోనూ గంజాయి పంటను ఎక్సైజ్ అధికారులు «ధ్వంసం చేశారు. -
టాస్క్‌ఫోర్స్ తనిఖీ.. 800 కిలోల గంజాయి స్వాధీనం
సాక్షి, విజయవాడ : నగర శివారులో 800 కిలోల గంజాయిని బుధవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారంతో రామవరప్పాడు వద్ద తనిఖీలు చేపట్టగా... లారీలో తరలిస్తున్న సుమారు 80 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. నర్సీపట్నం నుంచి కొయంబత్తూరుకు లారీలో మొక్క జొన్న పిండి బస్తాల చాటున తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని, లారీని సీజ్ చేసినట్లు ఆయన (గంజాయి రవాణా చేసే నార్త్ ముఠాకు చెక్) కూకట్‌పల్లిలో నలుగురు అరెస్ట్ సాక్షి, హైదరాబాద్ : గంజా విక్రయిస్తున్న నలుగురు యువకులను బుధవారం కూకట్‌పల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారంతో గంజా అమ్మడానికి సిద్ధంగా ఉన్న యువకులను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నవీన్ కుమార్, ఆనంద్, అనంత్ కుమార్, శ్రవణ్ అరెస్టు అయ్యారు. వీరు ఖమ్మం సత్తుపల్లి నుంచి 3.5 కిలోల గంజా సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిని ఎస్ఓటీ పోలీసులు.. కూకట్పల్లి పోలీసులకు అప్పగించారు. (భర్తకు గండం ఉందని వివాహిత మెడలో తాళి కట్టి..) -
గంజాయి ముఠా అరెస్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని డ్రగ్ ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తుండగా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను శనివారం అరెస్టు చేశారు. అయిదుగురు సభ్యులున్న ఈ ముఠాలో ఇద్దరు పోలీసులకు చిక్కగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అరెస్టైన నిందితుల నుంచి 3 కేజీ గంజాయిని, 28 ఎల్ఎస్డీ స్లీప్స్, 32 అంఫేటమిన్ డ్రగ్ ప్యాకెట్స్‌తో పాటు 5 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 2.5 విలువ ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. కాగా తమిళనాడుకు చెందిన ఫ్రాన్సిస్ జేవియర్ ఈ ముఠాకు నాయకుడిగా వ్యవహరిన్నాడని, 25ఏళ్ల క్రితమే ఇతని కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడిందని తెలిపారు. ఇక ఫ్రాన్సిస్ జేవియర్‌కు ఇంటర్ నుంచే డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. డ్రగ్స్ ముఠా అరెస్టు నేపథ్యంలో హైదరాబాద్ హోటల్, బార్ యజమానులు జాగ్రత్తగా ఉండాలని, నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలపాలకు పాల్పడొద్దని పోలీసులు హెచ్చరించారు. -
గంజాయి రవాణా ముఠా అరెస్ట్
సాక్షి, నల్లజర్ల(పశ్చిమ గోదావరి) : ఒక కారులో గట్టుచప్పుడు కాకుండా నర్సీపట్నం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను నల్లజర్ల పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్న సంగతి విదితమే. విచారణ అనంతరం గురువారం రాత్రి ముఠా సభ్యులను తాడేపల్లిగూడెం పట్టణ సీఐ ఆకుల రఘు, తహసీల్దార్ కనకదుర్గ నిందితుల్ని అరెస్ట్ చేసి శుక్రవారం కోర్టుకు హాజరుపర్చినట్టు ఎస్సై కె.చంద్రశేఖర్ తెలిపారు. మహబూబ్‌నగర్‌కు చెందిన కాట్రోడ్డు నవీన్, వడిపే సంజీవ్, విశాఖపట్టణానికి చెందిన వెంకటలక్ష్మి బృందంగా ఏర్పడి కమిషన్‌పై గంజాయి రవాణా చేస్తుంటారు. ఇలా అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారివద్ద నుంచి 80 ప్యాకెట్లలో ఉన్న 160 కిలోల గంజాయి, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
130 కేజీల గంజాయి పట్టివేత
సాక్షి, పశ్చిమగోదావరి : తమిళనాడుకు చెందిన ఇద్దరు గంజాయి స్మగ్లర్లను ఏలూరు రూరల్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు విల్లుపురంకు చెందిన కాలేజీ స్టూడెంట్స్ మునిస్వామి మహేంద్ర(24), పళనియప్ప ప్రభూ(24) విశాఖపట్టణం నుంచి తమిళనాడుకు కారులో గంజాయి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే ఏలూరు ఆశ్రం ఆసుపత్రి వద్ద రూరల్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా వీరు పట్టుబడ్డారు. నిందితుల వద్ద నుంచి సుమారు 130 కిలోగ్రాముల గంజాయితో పాటు ఓ కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
గంజాయి అక్రమ రవాణా చేస్తూ..
సాక్షి, విజయనగరం : తుమ్మికాపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. వివరాలు.. కారులో గంజాయిని అక్రమంగా తరలిస్తుండటంతో మితిమీరిన వేగంతో ప్రయాణించారు. ఈ సమయంలో విశాఖపట్నం నుంచి వస్తున్న లారీని, అరకు నుంచి వస్తున్న కారు డీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి మార్గమద్యలో మృతి చెందాడు. మరో వ్యక్తికి చికిత్సను అందిస్తున్నారు. కారులో రెండు బ్యాగుల్లో గంజాయి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గంజాయి లోడ్‌తో అతి వేగంగా కారును నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. -
గంజాయి ఘాటు..
సాక్షి, వరంగల్ రూరల్ : వ్యవసాయాధారిత పేరొందిన జిల్లాకు గంజాయి మహ్మమ్మారి సోకింది. యథేచ్ఛగా సాగు చేస్తున్నా సంబంధిత అధికారులు దృష్టి సారించకపోవడం విడ్డూరం. గంజాయి మత్తెక్కిస్తూ జీవితాలను బలి తీసుకుంటోంది. ప్రమాదకరమైన మత్తు యథేచ్ఛగా చేతులు మారుతోంది. క్షణాల్లో జీవితాలను పీల్చి పిప్పి చేసే మహమ్మారి నిషామత్తులో చదువుకున్నవారు, చదువులేని వారు బలవుతున్నారు. గుప్పుమంటున్న గంజాయి మత్తుకు నేటి యువత చిత్తవడం ఆందోళన కలిగించిన అంశం. గ్రామీణ జిల్లాగా పేరొందిన రూరల్‌లో ఎక్కువగా మిర్చి, పసుపు పంటలు సాగు చేస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు దళారులు మిర్చి పంటల్లో గంజాయి సాగు చేస్తున్నారు. మిర్చి పంటల్లో సాగు చేస్తూ ఇటీవల పట్టుబడిన సంఘటనలు కోకొల్లలు. యథేచ్ఛగా సాగుతున్న ఈ మత్తు దందాకు అడ్డుకట్ట వేయడంలో పోలీసులు, ఇతర అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది విమర్శలు వెల్లువెత్తున్నాయి. శీతాకాలం ముగిసిపోయి వేసవికాలం సమీపిస్తున్నందున ఇలాంటి సమయంలోనే గంజాయి పంట చేతికొచ్చి చేతులు మారుతుంది. అంతర పంటగా.. గంజాయిపై నిషేదం ఉండడంతో ఏజెంట్లు రోడ్ హైవే మార్గాలకు సమీపంలోని గ్రామాల్లో సాగు చేయిస్తున్నారు. గంజాయి బయటకు కనిపించకుండా ఉండేందుకు ముందుగా మిర్చి వంటి పంటలు వేస్తున్నారు. మిర్చి విత్తనాలు మొలకెత్తి కనీసం అడుగు ఎత్తు పెరిగే వరకు చూసి ఆ తర్వాత అంతర పంటగా గంజాయి సాగును మొదలు పెడుతున్నారు. బయటకు మిర్చి పంట తరహాలో కనిపించినా లోపల గంజాయి మొక్కలు ఉంటాయి. మిర్చి కన్నా గంజాయి మొక్క ఎక్కువ ఎత్తు పెరుగుతుంది. మొక్క ఎదిగే క్రమంలో మధ్యకు చీల్చుతున్నారు. దీంతో మొక్క ఎదుగుదల పైకి కనబడకుండా వాటికి సమాతరంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఎవరూ గంజాయి సాగును గుర్తుపట్టని పరిస్థితి ఉండడంతో సాగుదారులకు వరంగా మారుతోంది. పట్టుబడుతున్న గంజాయి.. పోలీసుల నిఘ ఉన్నప్పటికి జిల్లాలో గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. బైక్‌లో నాలుగు కేజీల గంజాయి పెట్టుకుని జనవరి 29న సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనవరి 13న 1 కిలో గంజాయి బైక్‌లో పెట్టుకుని సరఫరా చేస్తున్న వ్యక్తిని, గత సంవత్సరం డిసెంబర్ 27న ఆటోలో నాలుగు కిలోల గంజాయిని సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇలా గత సంవత్సరం గంజాయి విక్రయాల కేసులు 14 నమోదయ్యాయి. గంజాయిని వరంగల్ రూరల్ జిల్లాలో అక్కడక్కడ సాగు చేస్తున్నారు. జనవరి 22న నర్సంపేట మండలంలోని దాసరిపల్లిలో 1.15ఎకరాల్లో మిర్చిలో అంతర పంటగా గంజాయిని సాగు చేశారు. దీనిలో రూ.10 లక్షలు విలువ చేసే 220 మొక్కలు గంజాయి మొక్కలను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. సాగు చేస్తున్న యజమాని ఇంట్లో 12 కిలోల ఎండు గంజాయి సైతం లభ్యమైంది. గతంలో ఇక్కడ సాగు చేసి ఇతర ప్రాంతాలకు విక్రయించేందుకు పంపించేవారు. గత కొంత కాలం జిల్లాలోనే సాగు చేస్తూ ఇక్కడే విక్రయిస్తున్నారని తెలుస్తోంది. మూడు దమ్ములు.. ఆరు కిక్కులు గంజాయి దందా జిల్లాలో మూడు దమ్ములు.. ఆరు కిక్కులుగా సాగుతోంది. యువతనే టార్గెట్ చేసుకుని విక్రయాలు సాగిస్తున్నారు. ఎడ్యుకేషనల్ హబ్‌గా ఉన్న జిల్లాకు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి తమ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. చిన్న చిన్న పాన్ డబ్బాలు, బేకరీలు, బస్టాండ్, రైల్వే స్టేషన్లు, కళాశాలకు సమీపాల్లో విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో విక్రయదారులే సిగరేట్లలో గంజాయిని నింపుకుని తీసువచ్చి విక్రయిస్తున్నారు ప్యాకెట్ల రూపంలో సైతం విక్రయాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. ఒక్కో సిగరేట్ రూ 50లకు, ప్యాకెట్ అయితే రూ.100 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారని సమాచారం. నగరంలోని అండర్‌బ్రిడ్జి సమీపంలోని ఓ కాలనీకి చెందిన వ్యక్తి గత కొన్ని రోజులు గంజాయిని విక్రయిస్తూ తాగుతూ దానికి బానిసై ఇటీవల ఆనారోగ్యం భారిన పడి మరణించాడు. దీంతో ఆ కాలనీలో గంజాయి విక్రయించవద్దని తీర్మాణం చేశారని సమాచారం. అడ్డాలు ఇవే.. రూరల్ జిల్లాకు వరంగల్ నగరం దగ్గర ఉండడంతో ప్రధానంగా వరంగల్ ప్రాంతంలో ఉర్సు గుట్ట, ఎస్ఆర్ఆర్ తోట, పెరుకవాడ, శాంతినగర్, లేబర్ కాలనీలోని ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగంణంలో, బొల్లికుంట, ఆటోనగర్ కాలువ, హన్మకొండ ప్రాంతంలో దర్గా రోడ్, పబ్లిక గార్డెన్, యూనివర్సిటీ ప్రాంతం, హంటర్ రోడ్లలో ఎక్కువగా యువత అడ్డాలుగా ఉండి తాగుతున్నారని సమాచారం. మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని లేబర్ కాలనీ ఈఎస్ఐ ఆస్పత్రి ప్రాంగణంలో ఖాళీ క్వార్టర్లు ఉండడంతో అందులో యువత అడ్డాగా చేసుకుని గంజాయి తాగుతున్నారని తెలిసింది. గంజాయి మహమ్మారి నుంచి యువతను, పెద్దలను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ప్రత్యేక నిఘా పెట్టాం.. గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో తనిఖీలు విస్తృతంగా చేస్తున్నాం. గంజాయి విక్రయాలు చేసిన వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. – వెంకట్‌రెడ్డి, డీసీపీ -
గంజాయి విక్రేత అరెస్టు
జ్యోతినగర్(రామగుండం) : నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న బిపుల్‌దాస్ (34)ను అరెస్టు చేసినట్లు గోదావరిఖని ఏసీపీ రక్షిత కే.మూర్తి, రామగుండం సీఐ సాగర్, ఎన్టీపీసీ ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. శుక్రవారం అరెస్టు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా కలిమెల మండలం కంగూరుకొండకు చెందిన బిపుల్‌దాస్ గతంలో ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులో కాంట్రాక్టు కార్మికుడిగా విధులు నిర్వహించాడు. అనంతరం స్వగ్రామానికి వెళ్లాడు. అక్కడ పని దొరకక సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో కలిమెల అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి వద్ద గంజయి కొనుగోలు చేసి రామగుండం ప్రాంతంలో రెండుసార్లు విక్రయాలు చేపట్టాడు. ఈ క్రమంలో మరోసారి విక్రయించేందుకు రాగా.. పక్కా సమాచారంతో పోలీసులు ఎన్టీపీసీ లేబర్ గేట్ సమీపంలో బిపుల్‌దాస్‌ను తనిఖీ చేయగా రూ.19,000 విలువగల కిలో 880గ్రాముల గంజాయి పట్టుబడింది. తహసీల్దార్ డి.శ్రీనివాస్ సమక్షంలో స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు దుబాసి రమేశ్, టి.స్వామిని అభినందించి వారికి నగదు రివార్డులు అందజేశారు. కఠిన చర్యలు: ఏసీపీ రక్షిత కే.మూర్తి గంజాయి, గుట్కాలను విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని ఏసీపీ రక్షిత కే.మూర్తి స్పష్టం చేశారు. మత్తు పదార్థాలను రవాణా చేస్తున్న విషయాలను పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. -
రావులపాలెం టు ఇందూరు
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): గంజాయి స్మగ్లర్లను పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా ఆగడంలేదు. ఏపీలోని రావులపాలెం నుంచి ఇందూరుకు గం జాయి రవాణా అవుతోంది. ఈ క్రమం లో స్మగ్లర్లపై పోలీసులకు పక్కా సమా చారం రావడంతో వలపన్ని పట్టుకుంటున్నారు. ఈ వివరాలను ఆదివారం డీసీపీ శ్రీధర్‌రెడ్డి విలేకరులకు వెల్లడించారు. నిజామాబాద్ ఆటోనగర్‌కు చెం దిన మునావర్ అలీ గతేడాది 2017 మే నెలలో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబట్టాడు. ఇతడిపై ఆంధ్ర లో 6 కేసులు, మహారాష్ట్రలో ఒకటి, వరంగల్ జిల్లా బచ్చన్నపేట్ పీఎస్‌లో ఒకటి, నిజామాబాద్ ఆరోటౌన్‌లో ఒక కేసు నమోదయ్యాయి. నగర శివారులో తనిఖీల్లో అరెస్టు ఈనెల 27న పెద్దిరాజు, క్యాతం శ్రీనివాస్‌తో 70 కిలోల గంజాయిని ఏపీ10 ఏడీ 1454 నంబరుగల ఇండిగో కారులో 28న ఉదయం నిజామాబాద్ నగర శివారు మాధవనగర్‌కు చేరుకున్నారు. ఇంతలో నిజామాబాద్ రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్రీధర్, పోలీసుల తో కలిసి అర్సపల్లి మాధవనగర్ బైపాస్ పై వాహనాల తనిఖీలు చేశారు. స్మగ్లర్ల కారును పోలీసులు తనిఖీలు చేయగా గంజాయి బాగోతం బయటపడింది. రవాణా చేస్తున్న పెద్దిరాజు, క్యాతం శ్రీనివాస్‌ను పోలీసులు విచారించారు. ము నావర్ అలీకి సప్లయ్ చేస్తున్నామన్నారు. దీంతో పోలీసులు మునావర్ అలీ ఇంటి పై దాడిచేశారు. ఇంట్లో 10 కిలోల గం జాయి లభ్యం కావటంతో వెంటనే అత డిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 80 కిలోల గంజాయిని(రూ.12 లక్షల విలువ) స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. వీరి నుంచి 5సెల్ఫోన్లు, రూ.వెయ్యి, కారును స్వాధీనం చేసుకు న్నామన్నారు. ప్రతిభ చూపిన పోలీసులను డీసీపీ అభినందించారు. వీరికి రివార్డులకు సీపీకి విన్నవిస్తామన్నారు. గుట్కా వ్యాపారి అరెస్టు.. నగరంలోని హైమదీబజార్‌లో గుట్కా వ్యాపారం చేస్తున్న షేక్ అహ్మద్‌ను అరెస్టు చేశామని డీసీపీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. శనివారం అబు బకార్ షాపు, గో దాంలపై పోలీసులు దాడిచేసి 75 కార్టన్ల గుట్కాను పట్టుకున్నారన్నారు. ఇది నిర్మ ల్ జిల్లా బాసర్‌కు చెందిన కరీం సప్లయ్ చేస్తున్నట్లు గుర్తించామని, అతడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగామన్నారు. పథకం పన్నారిలా.. గంజాయి కేసులో విజయవాడ సబ్జైల్లో శిక్ష అనుభవిస్తున్న మునావర్ అలీకి ఇదే జైలులో శిక్ష అనుభవిస్తున్న మరో గంజాయి స్మగ్లర్ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాడెర్ మండలం పాలకొల్లుకు చెందిన క్యాతం శ్రీనివాస్‌రావుతో పరిచయం ఏర్పడింది. వా రిద్దరు బెయిల్‌పై గతేడాది నవంబర్ లో జైల్ నుంచి విడుదలయ్యారు. అయినా మునావర్ ప్రవర్తనలో మా ర్పురాలేదు. ఇతడు మళ్లీ గంజాయి రవాణాపై దృష్టి సారించాడు. క్యాతం శ్రీనివాస్‌తో కలిసి ఈనెల 13న రావులపాలేం గ్రామానికి వెళ్లి పెద్దిరాజును పరిచయం చేసుకున్నారు. 80 కిలోల గంజాయి కావాలంటే, పెద్దిరాజు ప్రస్తుతం తన వద్ద 10 కిలోలు మాత్రమే ఉందని, మిగతా 70 కిలోల గంజాయి 15 రోజుల తర్వాత పంపిస్తానని చెప్పాడు. దాంతో మునావర్ రూ.80 వేలు పెద్దిరాజుకు చెల్లించి 10 కిలోల గంజాయినినిజామాబాద్‌కు తెచ్చాడు. -
ఇద్దరు గంజాయి స్మగ్లర్లు అరెస్ట్
హైదరాబాద్: కీసరకు చెందిన ఇద్దరు బడా స్మగ్లర్లను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్‌రెడ్డి, శివ అనే ఇద్దరు గంజాయి స్మగ్లర్లను మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో హయత్‌నగర్ పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఓ ఫార్చునర్ కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. -
ఆరుగురు గంజాయి స్మగ్లర్లు అరెస్ట్
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టును పోలీసులు ఆదివారం రట్టు చేశారు. ముఠాకు చెందిన ఆరుగురు సభ్యులను పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 410 కేజీల గంజాయితోపాటు ఆటో, బైక్, 7 సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యుల్లో ఇద్దరు తమిళనాడు వాసులని పోలీసులు వెల్లడించారు. ఒడిశా వాసులు కూడా ఉన్నారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.