నిందితుల్లో ఒకరు మైనర్
పరారీలో ప్రధాన నిందితుడు
చింతపల్లి రూరల్ (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఒడిశా నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న 759 కిలోల గంజాయిని గురువారం స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు స్థానిక ఏఎస్పీ ప్రతాప్‌శివకిశోర్ తెలిపారు. ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో గంజాయి లభ్యం కాకపోవడంతో ధారకొండ పంచాయతీ గంగవరం గ్రామానికి చెందిన వండలం బాలు బద్దర్ తనకు పరిచయం ఉన్న ఒడిశాలోని చిత్రకొండ బ్లాక్ బరడబందకు చెందిన చేపల వ్యాపారి లింగుఖిలా (బాబూరావు)ను ఆశ్రయించాడు.
అతని ద్వారా 759 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి రెండు బొలోరా వాహనాల్లో గూడెం, చింతపల్లి మీదుగా తాళ్లపాలెం చేర్చేందుకు లింగుఖిలాతో రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు వ్యాన్లలో గంజాయి తీసుకొస్తుండగా గూడెం కొత్తవీధిలోని సంస్థ కాలనీ వద్ద సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ అప్పలసూరి సిబ్బందితో కలిసి పట్టుకున్నారు.
వ్యాన్లలో ఉన్న బాలుబద్దర్‌తోపాటు రింతాడ పంచాయతీ కుమ్మరివీధికి చెందిన పాంగి గోవర్దన్, మాలిగుడకు చెందిన కొర్రలైకోన్ (లక్ష్మణ్), ఊబలపాలెంకు చెందిన కిల్లో శంకర్‌రావు, చింతపల్లి మండలం కడశిల్పకి చెందిన మైనర్ (17)ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.38 లక్షల విలువైన 759 కిలోల గంజాయి, రెండు వాహనాలు, ఐదు సెల్‌ఫోన్లు, రూ.16,900 స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు లింగుఖిలా (బాబూరావు) కోసం గాలిస్తున్నామని ఏఎస్పీ తెలిపారు. ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment