
అది గంజాయి గ్రామం..!
బాన్సువాడ (ఆదిలాబాద్) : అదో మారుమూల గ్రామం. గ్రామంలో మొత్తం పది గడపలకు మించి ఉండవు. ఆ గ్రామం గురించి సమీప గ్రామాల ప్రజలకు కూడా అంతగా తెలియదు... కానీ మెట్రో నగరాల్లో మాదకద్రవ్యాలను సరఫరా చేసే ముఠాల్లో మాత్రం ఆ గ్రామం పేరు మారుమోగుతోంది. ఈ గ్రామం నుంచి ఎండు గంజాయిని ఆయా నగరాలకు సరఫరా చేయడమే దీనికి ప్రధాన కారణం. బాన్సువాడ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని నిజాంసాగర్ మండలంలో గల ఓ కుగ్రామంలో యథేచ్ఛగా గంజాయిని సాగు చేస్తున్నారు. గిరిజనులు ఉంటున్న ఈ తండాలో అంతర పంటగా గంజాయిని పండిస్తున్నారు.
గంజాయిని సాగుచేసిన తర్వాత దాన్ని ఎండబెట్టి, ప్యాకెట్ల రూపంలో తయారుచేసి మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల సహాయంతో హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలిసింది. ఓ మహిళ గంజాయి రవాణాలో దిట్టగా మారి, ఎండిన గంజాయిని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ద్వారా దేశంలోని ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, విశాఖపట్నం, బెంగళూరు నగరాలకు తరలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వారం రోజుల కిందట ఎక్సైజ్ పోలీసులు నామమాత్రపు తనిఖీలు చేసి, కొంత గంజాయిని మాత్రమే స్వాధీనం చేసుకొన్నారని, విస్తృతస్థాయిలో దాడులు చేస్తే గంజాయి పంట, సరఫరా చేస్తున్న ముఠా ఆగడాలు బయటపడతాయని స్థానికులు అంటున్నారు.
మా దృష్టికి రాలేదు : పురుషోత్తం, ఎక్సైజ్ ఎస్సై
'గంజాయి సాగు చేసి, రవాణా చేస్తున్నట్లు మాకు ఎలాంటి సమాచారం లేదు. వారం రోజుల క్రితం ఈ గ్రామంలోనే తనిఖీలు చేయగా, అంతర పంటగా గంజాయి మొక్కలు పెంచడాన్ని గుర్తించాం. వాటిని తొలగించి కేసు నమోదు చేశాం. ఇంకా ఎక్కడెక్కడ సాగు చేస్తున్నారో తెలియదు'.