సాక్షి, సిటీబ్యూరో: వంటింట్లో గ్యాస్ వణికిస్తోంది. వరుస సిలిండర్ పేలుళ్లు నగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. వంట గ్యాస్ ఉపయోగించడంలో వినియోగదారుల నిర్లక్ష్యం, భద్రత ప్రమాణాలపై అవగాహన లోపం, సిలిండర్ డోర్ డెలివరీ కాగానే తనిఖీ చేయకపోవడం, గ్యాస్ లీకేజీలపై చిన్నపాటి ఏమరుపాటు వంటి కారణాలతో కుటుంబం మొత్తం భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తోంది. ప్రధాన ఆయిల్ కంపెనీలు కనీస భద్రత ప్రమాణాలను గాలికి వదిలేశాయి. ఏడాదికి ఒకసారి మొక్కుబడిగా అవగాహన సదస్సు నిర్వహించి చేతులు దులుపుకొంటున్నాయి. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద అత్యవసర సేవలకు సంబంధించి టెక్నికల్ సిబ్బంది కొరత వెంటాడుతోంది. దీంతో గ్యాస్ లీకేజీ, ఇతరత్రా వినియోగదారుల కాల్స్ పెండింగ్‌లో పడిపోతున్నాయి. డెలివరీ బాయ్స్ రిపేరు సిబ్బందిగా అవతారమెత్తి ప్రయివేటు టెక్నీషియన్స్ కంటే అదనంగా సర్వీస్ చార్జీలు బాదేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. మొత్తం మీద ఆయిల్ కంపెనీల నిర్లక్ష్యం, మానవ తప్పిదాలు వంటింట్లో విస్ఫోటనాలకుకు దారితీస్తున్నాయి.
సిలిండర్ టెస్ట్‌లో నిర్లక్ష్యం
ప్రధానంగా ఆయిల్ కంపెనీలు సిలిండర్ టెస్టింగ్‌లో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. సిలిండర్ జీవిత కాలపరిమితి పదేళ్లు. ఆ తర్వాత తిరిగి పరిశీలించి సిలిండర్ ప్రమాణాలను బట్టి మరో ఐదేళ్లు రీఫిల్లింగ్ చేయడమా? లేదా తుప్పు కింద పడేయడం చేయాల్సి ఉంటుంది. గ్యాస్ టెర్మినల్‌లో రీఫిల్లింగ్ జరిగే ముందు ప్రతిసారి సిలిండర్ బాడీ ఇతరత్రా వాటిని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఆయిల్ కంపెనీలు ఇవేమీ పట్టించుకోకుండా టెర్మినల్‌కు వచ్చిన సిలిండర్‌ను మొక్కుబడి పరిశీలనతో రీఫిల్లింగ్ చేసి సరఫరా చేస్తున్నాయి. దీనివల్లే వంటింటి విస్ఫోటనాలు చోటుచేసుకుంటున్నాయి. సిలిండర్ ప్రమాణాలకు సంబంధించిన టెస్ట్ డ్యూ డేట్ ఐదు, పదేళ్లకు ఒకసారి ఉండటం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ప్రతి ఒక్క సిలిండర్ గ్యాస్ టెర్మినల్ నుంచి డిస్ట్రిబ్యూటర్ గోదాముకు, అక్కడి నుంచి వినియోగదారుడి ఇంటికి, ఖాళీ అనంతరం తిరిగి గోదాముకు అక్కడి నుంచి గ్యాస్ టెర్మినల్‌కు వెళ్తుంది. ఇలా ఏడాదిలోనే కనీసం 72 ప్రాంతాలు సిలిండర్ తిరగాల్సింటుంది. దీంతో రవాణా, ఇతరత్రా కారణాలతో సిలిండర్ నాణ్యత ప్రమాణాలు దెబ్బతినడం సర్వ సాధారణం. అయితే ఆయిల్ కంపెనీలు సిలిండర్ ప్రమాణాలపై మాత్రం పదేళ్లు, ఐదేళ్లకు ఒకసారి పరిశీలన జరిపి డ్యూ డేట్‌ను వేయడం ఆందోళన కలిగిస్తోంది.
సిలిండర్ కాలపరిమితి ఇలా..
వంట గ్యాస్ సిలిండర్ భద్రత ప్రమాణాలను కాలపరిమితి (డ్యూ డేట్) బట్టి గుర్తించవచ్చు. డ్యూ డేట్‌లు సిలిండర్‌పై త్రైమాసాకానికి ఒక కేటగిరిగా అక్షరాలు ఉంటాయి. అక్షరంతో పాటు అంకె అంటే కాలపరిమితి గడువు సంవత్సరం కూడా ఉంటుంది. ఉదాహరణకు సిలిండర్ పైన ఏ–19 బీ–19, సీ–19, డీ–19 అనే అక్షరాలు ఉంటాయి. ఏ–అంటే జనవరి నుంచి మార్చి వరకు, బీ అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సీ అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు. డీ అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పరిగణించాలి. పక్కన ఉన్న అంకెను సంవత్సరంగా గుర్తించాలి. అయితే ఖాళీ అయిన సిలిండర్ నాణ్యత ప్రమాణాలు పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే రీఫిల్లింగ్ పాయింట్‌లో కాలపరిమితి ఆధారంగా రీఫిల్లింగ్ చేసి వినియోగదారులకు పంపిణీ చేయడం పరిపాటిగా మారింది.
టెక్నీషియన్ల కొరత
వంట గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద టెక్నీషియన్ల కొరత అధికంగా ఉంది. ఒక్కో డిస్ట్రిబ్యూటర్ పరిధిలో సుమారు వేలాది కనెక్షన్లు ఉన్నా..సిబ్బంది మాత్రం ఇద్దరు, ముగ్గురుకి మించి ఉండరు. దీంతో వినియోగదారులు అత్యవసర నంబర్‌కు ఫోన్‌చేసినా ఫలితం లేకుండా పోతోంది. ఒక్కోసారి డెలివరీ బాయ్స్‌నే టెక్నీషియన్స్ అంటూ పంపించి సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నారు.
అప్రమత్తత లేక...
గ్యాస్ విస్ఫోటనాలకు మానవ తప్పిదాలు కూడా ప్రధానంగా కారణమవుతున్నాయి. గ్యాస్ సిలిండర్ల లీకేజీలు, సిలిండర్, రెగ్యులేటర్, రబ్బర్ ట్యూబ్‌ల నాణ్యత, వాటి తనిఖీల్లో నిర్లక్ష్యం ప్రమాదాలకు దారితీస్తున్నాయి. కొత్త సిలిండర్ అమర్చే సమయంలో రెగ్యులేటర్, వాచర్ రెండూ సరిగ్గా ఇమడక గ్యాస్ బయటకు వస్తోంది. గ్యాస్ లీక్ గమనించకపోవడం, రబ్బర్ ట్యూబ్ వినియోగించడం, వంట చేసే సమయంలో గ్యాస్‌ను సిమ్‌లో ఉంచి మరిచి పోవడం, బర్నర్ మూసుకుపోవడం తదితరాలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
జాగ్రత్తలు
♦ వంట గ్యాస్ స్టవ్ వినియోగించని సమయంలో రెగ్యులేటర్‌ను ఆఫ్ చేయాలి. రాత్రి పూట తప్పనిసరిగా రెగ్యులేటర్ ఆఫ్‌లో ఉండే విధంగా చూసుకోవాలి. వంట గది తలుపుల కింద కనీసం ఒక అంగుళం ఖాళీగా ఉండే విధంగా ఉండాలి
♦ గ్యాస్ లీకేజీ జరిగినప్పుడు తప్పనిసరిగా వాసన వస్తుంది. అలాంటి సమయంలో ఎలాంటి ఏమరుపాటు పనికి రాదు. విద్యుత్ స్విచ్‌లు ముట్టుకోవడం, అగ్గిపుల్ల వెలిగించడం చేయకూడదు. విద్యుత్ స్విచ్‌లు ఆన్ చేయడం, ఆఫ్ చేయడం చేయవద్దు. స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే వచ్చే చిన్నపాటి స్పార్క్(మెరుపు) ప్రమాదానికి దారితీస్తోంది.
♦ గ్యాస్ వాసన పసిగట్టగానే తక్షణం వంటింటి తలుపులు, కిటికీలు బార్లా తెరిచి గ్యాస్‌ను బయటకు పంపే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత గ్యాస్ లీక్ అవుతున్నట్లు గుర్తిస్తే సిలిండర్‌ను బయటికి తీసుకెళ్లి బహిరంగ ప్రదేశంలో సేఫ్టీ పిన్ బిగించి ఉంచాలి.
♦ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్ద కాకుండా బహిరంగ మార్కెట్‌లో, గ్యాస్ రీఫిల్లింగ్ వ్యాపారుల వద్ద సిలిండర్ కొనుగోలు చేయడం ప్రమాదకరం.
♦ సిలిండర్ కంటే ఎత్తులో స్టవ్ ఉండాలి. సిలిండర్‌ను నిలువుగానే పెట్టాలి.
♦ వంట గదిలో ఫ్రిజ్ పెట్టవద్దు. అందులో ఉండే థర్మోస్టాట్ వల్ల ఆటో కటాఫ్ అవుతోంది. గ్యాస్ లీకైన సమయంలో ప్రమాదానికి దారితీస్తోంది.
♦ వంటింట్లో గ్యాస్ లీకేజీ గుర్తించగానే గ్యాస్ కంపెనీ అత్యవసర (టోల్ ఫ్రీ) నెంబర్ 1906 గానీ, డిస్ట్రిబ్యూటర్ అత్యవసర నెంబర్‌కు గానీ ఫోన్ చేయవచ్చు.
అవగాహన అవసరం
వంట గ్యాస్ వినియోగదారులు పూర్తిగా డోర్ డెలివరీ కాగానే సీల్ కరెక్టుగా ఉందా లేదా చూసుకోవాలి. సిలిండర్ కాలపరిమితి పరిశీలించాలి. సీల్ తీయగానే ఓపెన్ రింగ్ కట్ అయినా...గ్యాస్ వాసన వచ్చినా తిరిగి సిలిండర్ వెనక్కి పంపాలి. రెగ్యులేటర్, బర్నర్‌ను ఎప్పటి కప్పుడు తనిఖీ చేసుకోవాలి. రెండేళ్లకు ఒకసారి స్టవ్‌ను మార్చు కోవాలి. – అశోక్, అధ్యక్షుడు, వంట గ్యాస్ డీలర్ల సంఘం గ్రేటర్, హైదరాబాద్
మానవ తప్పిదాలతోనే ప్రమాదాలు
వంటింట్లో మానవ తప్పిదాలతోనే ప్రమాదాలు సంభవిస్తున్నాయి. టెర్మినల్‌లో భద్రత ప్రమాణాల ఆధారంగా సిలిండర్‌లో రీఫిల్లింగ్ చేసి పంపిణీ చేస్తారు. గ్యాస్ వినియోగం తోపాటు గ్యాస్ లీకేజీ, రెగ్యులేటర్, బర్నర్ తదితర వాటిపై వినియోగదారులకు అవగాహన అవసరం. వంట గ్యాస్ వినియోగంపై ఆయిల్ కంపెనీల వారిగా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. – రోహిత్‌గార్గే, ఆయిల్ కంపెనీ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment