
సంఘటన స్థలంలో గుమిగూడిన జనం
కుషాయిగూడ: గ్యాస్ లీకై సిలిండర్ పేలిన ఘటనతో కాప్రా ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా జనం తేరుకోలేకపోయారు. శిథిల భవనాలు, పేలుడు ఆనవాళ్లు, రక్తపు మరకలు, పరిసర నివాసాల్లో చోటు చేసుకున్న విధ్వంసం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఇద్దరు వ్యక్తులు మృతిచెందడం..మరికొందరు గాయపడడం విషాదం నింపింది. ఇక రాత్రి వరకు కూడా పేలుడు ప్రాంతంలో పోలీసులు, బాంబ్‌స్క్వాడ్ బృందాలు విచారణ జరిపాయి. పేలుడు చోటు చేసుకున్న పైఅంతస్థును పూర్తిగా తొలగించారు. సిలిండర్ పేలితే ఇంతటి విధ్వంసమేమిటో అర్థం కావడం లేదంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. భారీగా విన్పించిన పేలుడు శబ్ధంతో తాము ప్రాణాల మీద ఆశ వదులుకున్నామని కొందరు విలపించడం కన్పించింది. 200 మీటర్ల వరకు తీవ్రత కనిపించిన పేలుడు ఘటన...మరో గంట ఆలస్యంగా జరిగి ఉంటే మరింత ప్రాణ నష్టం వాటిల్లేదని స్థానికులు అన్నారు. ఉదయం 8 దాటిందంటే ఈ ప్రాంతామంతా రద్దీగా ఉంటుందని చెప్పారు.
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా: కలెక్టర్
కుషాయిగూడ: కాప్రా పేలుడు ఘటనలో మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఎక్సగ్రేషియా అందేలా చూడటంతో పాటుగా క్షతగ్రాతులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి తెలిపారు. ఘటన స్థలాన్ని సందర్శించి వెళ్లిన కలెక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం శిథిలాల ధాటికి మృతిచెందిన రవి కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో వైద్య సేవలు అందించడంతో పాటు వారం రోజులు భోజన వసతిని కూడ కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
దేవుడి దయవల్లబతికి బయటపడ్డాం
మేం పేలుడు జరిగిన ఇంటి పక్కనే ఉంటున్నాం. స్వల్ప గాయాలయ్యాయి. మేం నిజంగా దేవుడి దయవల్ల బతికి బయట పడ్డాం. పేలుడు ధాటికి ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడిపోయాయి. మంచంపై పడుకున్న నా భార్య కింద పడిపోయింది. ఏం జరిగిందో తెలియక వణికిపోయి...కొద్దిసేపు లోపలే ఉండిపోయాం. – కొప్పుల కుమార్ (స్థానికుడు)
భయాందోళనకు గురయ్యాం
భారీ పేలుడుతో ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యాం. పేలుడు తీవ్రతను బట్టి చూస్తే సిలిండర్ వల్ల జరిగిందని అనిపించడం లేదు. బలమైన పేలుడు సంభవించి శ్లాబ్ పూర్తిగా విరిగిపడింది. మా ఇంట్లోని వస్తువులు, వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భయంతో బయటకు వస్తుండగా చందూలాల్ భార్య లీల కాలిన గాయాలతో అరుస్తూ కన్పించింది. మేం వెంటనే పైకి వెళ్లి మంటలు ఆర్పాం.
– కమలాదేవి
కనీస జాగ్రత్తలు అవసరం – డాక్టర్ వెంకన్న, క్లూస్ ఇన్‌చార్జ్
గ్యాస్ సిలిండర్ అనేది నిత్యావసర వస్తువే కాదు... దాదాపు ప్రతి ఇల్లు, కార్యాలయాల్లో అందుబాటులో ఉంటోంది. ప్రమాదాల బారినపడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కనీస జాగ్రత్తలు తీసుకోవాలని క్లూస్ టీమ్స్ ఇన్‌చార్జ్‌గా ఉన్న సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ వెంకన్న చెప్తున్నారు. కొన్నింటిని ఆయన ‘సాక్షి’కి వివరించారు.
♦ ప్రతి రోజూ నిద్రకు ఉపక్రమించే ముందు స్టౌవ్‌తో పాటు రెగ్యులేటర్ సైతం ఆఫ్ చేయాలి.
♦ స్టౌవ్ దగ్గర ఉన్న ట్యూబ్‌ను అనునిత్యం పరిశీలిస్తూ పగుళ్లు వచ్చాయేమో గుర్తించాలి. ప్రతి ఆరు నెలలకు ట్యూబ్ తప్పనిసరిగా మార్చాలి.
♦ ట్యూబుకు పైన ఏ విధమైన తొడుగులు లేకుండా ఉన్నవే వాడాలి. లేదంటే దానికి వచ్చిన పగుళ్లు గమనించలేం.
♦ వీలైతే సిలిండర్‌ను నేలపైన కాకుండా... కనీసం అరడుగు లోతులో ఉంచే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.
♦ ఫ్రిజ్‌ను వంటగదిలో ఉంచకూడదు. వంటింటికి అందుబాటులో ఉండే మరో గదిలో పెట్టుకోవాలి.
♦ గ్యాస్ లీకైనట్లు అనుమానం వస్తే... ఆ గదిలో లైట్లు వేయడం, ఆర్పడం చేయకుండా రబ్బరు చెప్పులతో మాత్రమే ప్రవేశించి తలుపులు తీయాలి. నాబ్స్‌ను చాలా జాగ్రత్తగా ఆఫ్ చేయాలి. ఈ ప్రయత్నాల్లో ఎక్కడా ఘర్షణ చోటు చేసుకోవడానికి ఆస్కారం లేకుండా చూసుకోవాలి.
♦ మీ ఇంటికి గ్యాస్ సిలిండర్ తీసుకువచ్చిన వారితో కేవలం బరువు మాత్రమే కాకుండా లీకేజ్‌లు కూడా చెక్ చేయమని చెప్పండి.
♦ ఎలాంటి సహాయం కావాల్సి వచ్చినా నిస్సంకోచంగా స్థానిక డీలర్‌ను సంప్రదించండి. మీకు సహాయ పడటం వారి విధి.
♦ వీలున్నంత వరకు గ్యాస్ సిలిండర్ వంటింట్లో లేకుండా బయట ఉండేలా, ఫ్రిజ్‌ను కిచెన్‌లో కాకుండా డైనింగ్ హాల్ లేదా హాల్‌లో ఉండేలా చూసుకోవాలి.
♦ ప్రతి వ్యక్తి నిద్రలో ఉండగా వాసన పసిగట్టే సామర్ధ్యం కోల్పోతాడు. అందుకే గ్యాస్ లీకైన విషయం ఉదయం లేచాక తెలుస్తుంది. అలాంటి అనుమానం వచ్చినా, సాధారణంగా అయినా ఉదయం లేచిన వెంటనే వంట గదిలో లైట్ వేయకూడదు. తలుపులు తీసిన తర్వాత కొంత సేపటికే ఆన్ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment