ఈ గుట్టకిందే ఒకప్పుడు సముద్రం ఉందట...
1,500 మిలియన్ సంవత్సరాల క్రితమే ఇనుపరాయి అవిర్భావం
జియాలజికల్ సర్వేలో బహిర్గతమవుతున్న నిజాలు
బయ్యారం: ఖమ్మం జిల్లాలోని బయ్యారం పెద్దగుట్టపై నిక్షిప్తమై ఉన్న ఇనుపరాయి ఆనవాళ్ల వివరాలు జియాలజికల్ సర్వేలో బహిర్గతమవుతున్నాయి. మూడు రోజులుగా గుట్టపై సర్వే నిర్వహిస్తున్న జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ), మైన్స్ అండ్ జియాలజికల్ అధికారుల బృందాలు ఇనుపరాయి నిర్మాణం, క్వాంటిటీ, క్వాలిటీపై పలు వివరాలను తెలుసుకునే పనిలో నిమగ్నమైనారు. సర్వే బృందం కో-ఆర్డినేటర్ సత్యనారాయణ, జీఎస్‌ఐ జియాలజిస్ట్ వికాస్‌త్రిపాఠి తమ సర్వేలో వెల్లడవుతున్న పలు విషయాలను శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం ఇనుపరాయి నిక్షేపా లు ఉన్న బయ్యారం పెద్దగుట్ట కింద 1,500 మిలియన్ సంవత్సరాల క్రితం పెద్ద సముద్రం ఉండేదని వారు పేర్కొన్నారు. రికార్డుల ప్రకారం పాకాల బేసిన్‌గా పేర్కొన్న ఈ సముద్రం అడుగు భాగంలో ఇనుపరాయి ఆవిర్భవించినట్లు వారు వివరించారు.తమకు అందుబాటులో ఉన్న రేడియాక్ట్ డేటా ప్రకారం ఇనుపరాయి నిల్వలు ఏర్పడ్డ సంవత్సరం లభ్యమవుతుందన్నారు.
బొగ్గు కన్న ఇనుపరాయి .. మొదట ఆవిర్భావం..
జిల్లాలో అపారంగా లభ్యమవుతున్న బొగ్గు నిక్షేపాల కన్నా ఇనుపరాయి నిక్షేపాలే మొదట ఆవిర్భవించినట్లు జియాలజికల్ అధికారులు తెలుపుతున్నారు. 1,500 మిలయన్ సంవత్సరాల క్రితం ఇనుపరాయి ఆవిర్భవించగా 65 మిలియన్ సంవత్సరాల క్రితం బొగ్గు ఆవిర్భవించినట్లు సర్వే బృందం అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.