► రూ.65వేలు పెట్టండి.. కోటి పట్టండి
►నల్లగొండ జిల్లాలో ఏడాదిగా ఘరానా మోసం
►‘రేడియేషన్ పవర్’తో డబ్బే డబ్బంటూ ప్రచారం
►ఇప్పటికి రూ.3 కోట్లకు పైగా టోకరా
మునుగోడు: ‘‘కేవలం రూ.65 వేలు పెట్టుబడిగా పెట్టండి. కోటి రూపాయలు సొంతం చేసుకోండి’’ అంటూ మోసగాళ్లు చెప్పిన మాయమాటలను నమ్మి అత్యాశతో అనేకమంది నిండా నష్టపోయారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలో దాదాపు ఏడాదిగా సాగుతున్న ఈ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. భూమిపైనే గాక ఇతర గ్రహాల్లోనూ ఖనిజ సంప దలను కనిపెట్టేందుకు ఉపయోగపడే రేడియేషన్ పవర్ (ఆర్‌పీ) దొరికిందని, దాన్ని వెలికితీసి విదేశాలకు విక్రయిస్తే లక్షల కోట్లొస్తాయని కొందరు అక్ర మార్కులు ప్రచారం మొదలుపెట్టారు.
వెలికితీత తదితరాలకు కొంత ఖర్చవు తుందని, ఆ మొత్తాన్ని సర్దేవారికి లాభాల్లో భారీగా వాటాలిస్తామని నమ్మిం చారు. రూ.65 వేలు పెడితే కోటి, అంతకంటే ఎక్కువగా పెడితే ఇంకా అదనంగా ఇస్తామని చెప్పారు. ఇలా మునుగోడు మండలంలో పలువురిని నమ్మించి డబ్బు లు వసూలు చేశారు. ఆరేళ్ల క్రితం మునుగోడు మండలంలో ఇలాగే పలువురిని బురిడీ కొట్టించిన కేసులో నిందితుడైన వ్యక్తే ఈ దందాకు సూత్రధారి అని సమాచారం. ఏడాదిగా మండలవ్యాప్తంగా దాదాపు 300 మంది నుంచి రూ.3 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది.
కొందరు రూ.65 వేల నుంచి రూ.2 లక్షల దాకా ఇస్తే, మరికొందరు ఏకంగా రూ.10 లక్షలు, రూ.15 లక్షల దాకా ఇచ్చి దివాలా తీశారు! వీరిలో ఓ చీటీల వ్యాపారీ ఉన్నాడు. ఇప్పుడతను తనవద్ద చీటీలు వేసినవారికి డబ్బులు కూడా ఇవ్వలేని స్థితికి చేరాడని సమాచారం. విషయం బయటపెడితే తాము పెట్టిన మొత్తం ఇక ఎప్పటికీ తిరిగి రాదనే భయంతో బాధితులు ఎవరికీ చెప్పుకోవడం లేదు. ఈ విషయమై నెల రోజు లుగా పుకార్లు వినిపిస్తున్నా తమకైతే ఫిర్యాదేమీ అందలేదని మునుగోడు ఎస్‌ఐ రాములు చెప్పారు. బాధితులు ఫిర్యాదు చేస్తే మోసగాళ్లపై చర్యలు తీసుకుం టామన్నారు. మాయమాటలు నమ్మి ఎవరూ డబ్బులివ్వొద్దని సూచించారు.