
ఎసీబీకి పట్టుబడ్డ జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు సత్యనారాయణ, చరణ్
సాక్షి సిటీబ్యూరో: నగరంలో అవినీతి అధికారులు, సిబ్బంది రెచ్చిపోతున్నారు. పర్యవేక్షణ, క్రమశిక్షణ గాడితప్పటంతో లంచావతారులు సాధారణ జనాన్ని పీల్చిపిప్పి చేస్తున్నారు. ప్రతిపనికి ఓ రేటు నిర్ధారించి నేరుగా నగదు తీసుకోవటమో లేక తాము అనధికారికంగా నియమించుకున్న ఏజెంట్ల ద్వారా పనులను చక్కబెట్టుకుంటున్నారు. ఇందులో మున్సిపల్ (జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు, హెచ్‌ఎండీఏ)కు రెవెన్యూ, ట్రాన్స్‌కో(డిస్కం), పోలీస్ శాఖలు అగ్రభాగాన ఉన్నట్లు ఏసీబీ తాజాగా విడుదల చేసిన లెక్కలు చెబుతున్నాయి. మంగళవారం సైతం జీహెచ్‌ఎంసీ, సిటీ సివిల్ కోర్టుల్లో ఇద్దరి ఉద్యోగుల్ని ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. జీహెచ్‌ఎంసీ విషయంలో తమ స్థాయిలో ఎన్నిచర్యలు తీసుకున్నా జోన్, సర్కిల్ స్థాయిలో అక్రమాలు, అవినీతిపరులకు ఇంకా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
ముఖ్యంగా నివాస, వ్యాపార నిర్మాణాలకు సంబంధించి అనుమతుల నుండి మొదలవుతున్న అవినీతి వ్యవహారం, నిర్మాణదారులు అనుమతించిన దానికంటే అదనంగా వేసుకునే ఫ్లోర్లకు స్క్వేర్ ఫీట్ చొప్పున రేట్లు నిర్ధారించి వసూళ్లు చేస్తున్నారు. ఇక రెవెన్యూ విభాగంలోనూ ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్‌మెంట్ విషయంలోనూ భారీ మాయాజాలం నెలకొంటోంది. నివాస భవనాలను వాణిజ్య భవనాలుగా, వాణిజ్య భవనాలను నివాస భవనాలుగా చూపటంతో పాటు మొత్తం విస్తీర్ణాన్ని సైతం నిర్ధారించే విషయంలో భారీ గోల్‌మాల్‌కు పాల్పడుతూ సొంతజేబులు నింపేసుకుంటున్నారు. ఇక హెచ్‌ఎండీఏలో లే అవుట్లు, భారీ భవనాల అనుమతుల విషయంలో రోడ్ అప్రోచ్‌లు, జోన్ నిబంధనలు, మాస్టర్‌ప్లాన్ నియమాలు చూసీచూడనట్లు వదిలేసేందుకు ప్రత్యేక ప్రైవేటు వ్యవస్థలే పనిచేస్తున్న దాఖలాలున్నాయి. వాటర్‌బోర్డులోనూ ఏళ్ల తరబడి పాతుకుపోయిన సిబ్బంది చేతివాటం బోర్డుకు నష్టాలను పంచుతోంది.
పోలీస్ శాఖలో పర్యవేక్షణ లోపం...
పోలీస్‌స్టేషన్ల నిర్వహణకు ప్రతి నెలా నిధుల విడుదలతో పాటు అత్యాధునిక వాహనాలు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నా..సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లలో ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐల ధనదాహం పోలీస్ శాఖలో ఉన్నతాధికారుల లక్ష్యాలకు గండికొడుతోంది. దొంగలతో పాటు, దొంగ సొత్తు కొనుగోలుదారులు, పలు కేసుల్లో నిందితులతో కుమ్మక్కై రూ.2 వేల నుండి లక్షల వరకు లంచాలు గుంజుతున్న వైనం ఆయా కమిషనరేట్లలో పర్యవేక్షణ లోపాలను వెల్లడిస్తోంది. ఏసీబీ గడిచిన కాలంగా కొరఢా ఝులిపిస్తుండటంతో ఆయా పోలీస్‌స్టేషన్లలో ఇన్‌స్పెక్టర్లు, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు బహిరంగంగా దొరికిపోతున్న వైనం కింది స్థాయిలో మారని పరిస్థితిని తెలియచేస్తోంది. ఇక డిస్కంలో అయితే పరిస్థితిలో ఏ మార్పు కనిపించటం లేదన్న ఫిర్యాదులున్నాయి. కరెంటు మీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, కాలనీలు, అపార్ట్‌మెంట్లకు లైన్లు వేసే విషయంలో భారీఎత్తున అవినీతి చోటు చేసుకుంటోంది. రెవెన్యూ శాఖలో ఐతే కింది స్థాయి నుండి ఉన్నతాధికారుల వరకు ప్రతి పనికి ఓ రేటును నిర్ధారించుకున్నారు. నగరంతో పాటు శివార్లలోనే భారీగా భూ క్రయవిక్రయాలు చోటు చేసుకుంటుండటంతో మ్యుటేషన్ మొదులకుని రికార్డులు, పాస్ పుస్తకాల జారీలో గ్రామ రెవెన్యూ అధికారి నుండి ఉన్నతాధికారుల వరకు భారీ మొత్తాలు ఫిక్స్ అయి ఉన్నాయి.
నేరుగా ఫిర్యాదు చేయండి: ఏసీబీ
గడిచిన ఐదేళ్లలో నగరంలో 75 మంది మున్సిపల్, రెవెన్యూ, డిస్కం, పోలీస్ శాఖలకు సంబంధించి సుమారు 95 కేసులు నమోదు చేసిన ఏసీబీ, 2019లో రెండు మాసాల్లోనే 14 మందిని వలపన్ని పట్టుకుంది. అందులో అత్యధికం రెడ్‌హ్యాండెడ్‌వి కావటం విశేషం. నగరంలో ఎవరు లంచం అడిగినా, డిమాండ్ చేసినా 040–23251501, 23251 555, 94404 46126 ఫోన్ నంబర్లలో ఫిర్యాదు చేయొచ్చు. అలాగే వాట్సాప్ నెంబర్: 94404 46106లలో ఫిర్యాదు చేయాలని ఏసీబీ ముఖ్య అధికారులు నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
న్యాయశాఖ ఉద్యోగి...
యాకుత్‌పురా: కోర్టు వారెంట్‌లో జాప్యం కొరకు రూ.35 వేలు లంచం తీసుకుంటూ సిటీ సివిల్ కోర్టు న్యాయశాఖ ఉద్యోగి మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. హైదరాబాద్–1 ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన కృష్ణ నాయక్ పురానీహవేలిలోని సిటీ సివిల్ సెంట్రల్ నజారత్ సెక్షన్‌లో ఫిల్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన అమితుల్ సయ్యిదా హజ్రా ఇంట్లో అద్దెకుంటున్న ఆరీఫ్ మోహిద్దీన్ అనే వ్యక్తి ఇల్లు ఖాళీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో 2009 నుంచి అమితుల్ సయ్యిదా హజ్రా, ఆరీఫ్ మోమిద్దీన్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. కోర్టు ఇటీవల ఆరీఫ్ మోహిద్దీన్‌కు వారెంట్ జారీ చేసింది. సదరు వారెంట్‌ను పెండింగ్‌లో ఉంచాలని కోరుతూ ఆరీఫ్ మోహిద్దీన్ కృష్ణ నాయక్‌ను ఆశ్రయించాడు. ఇందుకు అతను రూ. లక్ష డిమాండ్ చేశాడు. చివరికి రూ.35 వేలకు ఒప్పందం కుదిరింది.దీనిపై ఆరీఫ్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారుల సూచనమేరకు మంగళవారం మధ్యాహ్నం అతను కోర్టు ప్రాంగణంలోని పార్కింగ్ వద్ద కృష్ణ నాయక్‌ను కలిసి రూ.35 వేలు ఇస్తుండగా దాడి చేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వర్ రావు, రవీందర్ రెడ్డి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఏసీబీ వలలో జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు
బంజారాహిల్స్: ఖైరతాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌జోన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసి ఇద్దరు ఉద్యోగులను లంచం తీసుకుంటుండగా రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఖైరతాబాద్‌లోని సెంట్రల్‌జోన్ కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ సర్కిల్ 13లో ఎం.సత్యనారాయణ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్‌గా, కె.చరణ్ బిల్ కలెక్టర్ కమ్ రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. సయ్యద్‌షా అలీం అనే బాధితుడు తన ఇంటి ఆస్తిపన్ను అసెస్‌మెంట్ ఫైల్‌ను పరిష్కరించుకునేందుకు పలుమార్లు సత్యనారాయణ వద్దకు వచ్చాడు. ఇందుకోసం రూ.8 వేలు లంచం కావాలంటూ ఈ నెల 12న సత్యనారాయణతో పాటు బిల్‌కలెక్టర్ చరణ్ డిమాండ్ చేశారు. ఇందుకు అంగీకరించిన బాధితుడు ముందస్తు పథకం ప్రకారం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఏసీబీ అధికారులు మంగళవారం సాయంత్రం పక్కా ప్లాన్‌తో బాధితుని నుంచి వీరిద్దరూ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. వీరిద్దరినీ ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.