నాగోల్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌కు రోడ్డు ముప్పు | GHMC Plan Road Construction in Nagole Driving Test Track | Sakshi
Sakshi News home page

నాగోల్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌కు రోడ్డు ముప్పు

Published Mon, Jan 13 2020 7:41 AM | Last Updated on Mon, Jan 13 2020 7:41 AM

GHMC Plan Road Construction in Nagole Driving Test Track - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: రహదారి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో  నిర్మించిన   నాగోల్‌  డ్రైవింగ్‌  టెస్ట్‌ ట్రాక్‌  ఉనికి  ప్రశ్నార్థకంగా మారింది. ట్రాక్‌ మధ్యలోంచి  కొత్తగా  రోడ్డు నిర్మించేందుకు  జీహెచ్‌ఎంసీ సన్నాహాలు చేపట్టింది. నాగోల్‌ నుంచి  ట్రాక్‌  మార్గంలో  ఆదర్శనగర్, గణేశ్‌నగర్, బండ్లగూడ మార్గంలో హయత్‌నగర్‌కు  వెళ్లేందుకు  వీలుగా  ఉంటుందని నిర్మించతలపెట్టిన  ఈ  రోడ్డు వల్ల  ట్రాక్‌  భవితవ్యం పై నీలినీడలు కమ్ముకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, దక్షిణాదిలోనే  మొట్టమొదటి  మోడల్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌గా గుర్తింపు పొందిన  ఈ ట్రాక్‌ను 15 ఏళ్ల  క్రితం రవాణాశాఖ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.  లైసెన్సు  కోసం వచ్చే అభ్యర్ధుల  డ్రైవింగ్‌ సామర్థ్యాన్ని  శాస్త్రీయమైన పద్ధతిలో అంచనా వేసేందుకు అప్పటి వరకు ఎలాంటి విధానాలు లేవు. వాహనదారులను చెట్టు చుట్టు  తిప్పి, రోడ్డు మార్గంలో కొంతదూరం  పరిశీలించి  డ్రైవింగ్‌ లైసెన్సులను పొందేందుకు అర్హతను  ధృవీకరించేవారు. అయితే ఇది పూర్తిగా అసమంజసమని భావించిన రవాణా శాఖ అధికారులు 2003లో  మొట్టమొదటిసారి  శాస్త్రీయమైన పద్ధతిలో  నాగోల్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. రహదారిలోని ఎత్తుపల్లాలను, వివిధ రకాల మార్గాలను  ప్రతింబించేలా ఈ ట్రాక్‌ నిర్మాణం చేపట్టారు. సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ట్రాక్‌ మధ్యలోంచే  ప్రస్తుతం రోడ్డు వేసేందుకు  అధికారులు ప్రణాళికలను సిద్ధం చేయడం  గమనార్హం.

ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నా..
నాగోల్‌ నుంచి  హయత్‌నగర్‌కు  దూరభారాన్ని తగ్గించేందుకు  రోడ్డు నిర్మాణం చేపట్టడం ఆహ్వానించదగిన పరిణామమే. అయితే అందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ  నాగోల్‌ ట్రాక్‌ మధ్యలోంచే రోడ్డు వేయడం వల్ల  ట్రాక్‌ మనుగడకు  ప్రమాదం ఏర్పడింది. నాగోల్‌ చౌరస్తా నుంచి  ట్రాక్‌ వరకు  మూడు మార్గాల్లో కొత్త రోడ్డు నిర్మాణం, విస్తరణకు అవకాశం  ఉందని, ట్రాక్‌ మధ్యలోంచి రోడ్డు వేయాల్సిన అవసరం లేదని స్థానికులు, డ్రైవింగ్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పేర్కొంటున్నారు. కేవలం డ్రైవింగ్‌ పరీక్షలకే కాకుండా కొత్తగా డ్రైవింగ్‌ నేర్చుకునేందుకు కూడా ఈ ట్రాక్‌ అనుకూలంగా ఉంటుంది. కేవలం రూ.50 నామమాత్రపు ఫీజుతో సాయంత్రం వేళల్లో  ఈ  ట్రాక్‌లో డ్రైవింగ్‌ నేర్చుకోవచ్చు. దీనివల్ల  డ్రైవింగ్‌లో మరింత నాణ్యమైన శిక్షణ  లభిస్తుంది. నైపుణ్యం పెరుగుతుంది. ఎన్నో విధాలుగా  ప్రయోజనకరంగా ఉన్న డ్రైవింగ్‌ ట్రాక్‌ను కాపాడాలని వాహనదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఎన్నో ప్రత్యేకతలు,...
నాగోల్‌  డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లో మొత్తం 11 ట్రాక్‌లు ఉంటాయి.1,2,3,4,5,6 ట్రాక్‌లను  కార్లు, ఇతర తేలికపాటి వాహనాలు నడిపే అభ్యర్థుల డ్రైవింగ్‌ సామర్థ్య పరీక్షల కోసం వినియోగిస్తుండగా, మరో 4 ట్రాక్‌ను ద్విచక్ర వాహనదారుల కోసం వినియోగిస్తున్నారు. ఒక ట్రాక్‌ ను లారీలు, బస్సులు తదితర భారీ వాహనాలను నడిపే వారి కోసం కేటాయించారు. ఇక్కడ ‘ ఎస్‌’, ‘8’,  ‘హెచ్‌’, వంటి వివిధ ఆకృతుల్లో ట్రాక్‌లు ఉంటాయి. ప్రతి రోజు 300 నుంచి 350 మందికి ఇక్కడ డ్రైవింగ్‌ టెస్ట్‌లను నిర్వహిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement