
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో నివసించే రాంరెడ్డి–రవీణ దంపతులకు పిల్లలు లేరు. ఓ ఆడబిడ్డను దత్తత తీసుకుందామని ప్రయత్నించినా ఎక్కడా దొరకలేదు. అయితే ఓరోజు పనినిమిత్తం క్యాబ్‌లో బయటకు వెళ్తుండగా రవీణకు ఫోన్ వచ్చింది. ఫోన్‌లో ఆడపిల్ల కావాలని మాట్లాడుతుండగా ఆ విషయాన్ని క్యాబ్ డ్రైవర్ రవి గమనించాడు. రవీణ ఫోన్ పెట్టయ్యగానే మేడమ్ మీకు ఆడపిల్ల కావాలా? పుట్టిన పిల్లని తీసుకువచ్చి మీకు ఇచ్చే వాళ్లున్నారు అని చెప్పాడు.
అయితే కంగారుపడ్డ రవీణ ‘అలా ఎలా ఇస్తారు, విక్రయించడం నేరం కదా?’అని అడగ్గా, అలా ఏంలేదు మేడమ్ మా మరదలు డెలివరీకి ఉంది. స్కాన్ చేయిస్తే ఆడపిల్ల పుడుతుందని వచ్చింది. వాళ్లు చాలా పేదవాళ్లు. మీకోసం నేను ప్రయత్నిస్తా అని చెప్పాడు. సరే అని రవీణ నంబర్ తీసుకున్నాడు. రవి నంబర్ రవీణ తీసుకుంది. ఇలా వారం రోజుల తర్వాత రవి నెంబర్ నుంచి రవీణకు ఫోన్ వచ్చింది. మేడమ్ మీరు కల్వకుర్తి వస్తే మీకు హాస్పిటల్‌లో మా మరదలికి పుట్టిన అమ్మాయిని చూపిస్తా అన్నాడు. సరే అన్న రవీణ రాంరెడ్డి దంపతులు వెళ్లి చూశారు.
అమ్మాయి బాగుంది తీసుకుందాం అని అనుకున్నారు. రవీణ ఈ విషయం తన స్నేహితురాలు, జాతీయ న్యూస్ చానల్ ప్రతినిధి రమాదేవికి చెప్పింది. అయితే ఇదేదో శిశు విక్రయంలాగా ఉందని, అతడి మాటలను నమ్మవద్దని చెప్పడంతో రవీణ ఇంటికి వచ్చింది. రమాదేవి శిశువిక్రయం వ్యవహారాన్ని స్టింగ్ ఆపరేషన్ చేసింది. అనుకున్నట్టుగానే రవితో కాంటాక్ట్ అయ్యారు. తమకు ఆడపిల్ల కావాలని చెప్పడంతో నమ్మిన రవి వారిని కల్వకుర్తి తీసుకెళ్లి పాపను చూపించాడు. అంతా మాట్లాడుకున్నారు. బాగానే ఉందని రెండు రోజుల్లో పాపను తీసుకురావాలని చెప్పారు.
డీల్ రూ.80 వేలు, ఏఎన్‌ఎమ్‌కు రూ.50 వేలు
రమాదేవి రవితో డీల్ మాట్లాడుకున్నారు. పాప కావాలంటే ఏఎన్‌ఎమ్ ద్వారా తీసుకొని హోం డెలివరీ చేస్తానని రవి చెప్పాడు. దానికి రూ.80 వేలు డిమాండ్ చేశాడు. ఇందులో రూ.50 వేలు ఏఎన్‌ఎమ్‌కు ఇవ్వాల్సి ఉంటుందని, తన మరదలికి విషయం తెలియకుండా పాప పుట్టి చనిపోయిందని నమ్మించాల్సి ఉంటుందని కట్టుకథ అల్లాడు. సరే అన్న రమాదేవి శనివారం సరూర్‌నగర్‌లోని ఓ దేవాలయం వద్దకు పాపను తీసుకొని రావాలని చెప్పింది. అనుకున్న సమయానికే రవి ఆయన భార్య సరోజ పాపను తీసుకొని వచ్చారు. రూ.80 వేలు ఇవ్వగానే లెక్కబెట్టుకున్న రవి అతడి భార్యకు సైగ చేసి పాపను తీసుకురావాలని చెప్పాడు. వారం రోజులుకూడా గడవని ఆడశిశువును రమాదేవికి ఇచ్చాడు.
యాక్షన్‌లోకి రాచకొండ పోలీసులు...
రమాదేవి మీడియా ప్రతినిధి కావడంతో ముందస్తుగా రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్‌ను సంప్రదించారు. జరిగిన డీల్ మొత్తం చెప్పి స్టింగ్ ఆపరేషన్‌కు సహకరించాలని కోరడంతో వారుకూడా ఓకే చెప్పారు. మఫ్టీలో లేడీ కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బందిని సరూర్‌నగర్ టెంపుల్ వద్ద పెట్టారు. రమాదేవికి పసిపాపను అందించగానే రంగంలోకి దిగిన పోలీసులు రవితోపాటు అతని భార్యను అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు పంపినట్టు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.
భారీ నెట్‌వర్క్..
రవి తన మరదలికి పుట్టిన పిల్ల అని చెప్పిన కథ అంతా అబద్ధమని, పసిపిల్లలను విక్రయించే పెద్దముఠానే నడిపిస్తున్నట్టు రాచకొండ పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే రవిపై నాలుగు కేసులున్నాయని, ఇటీవలే కొల్లాపూర్ జైలు నుంచి విడుదలయ్యాడని తెలిసింది. అంతేకాకుండా నాలుగు నెలలక్రితం మరో పసికందును ఇదే రీతిలో విక్రయించాడని పోలీసులు తెలిపారు.
క్యాబ్ డ్రైవర్‌గా బయటకు చెప్పుకున్నా, తెరవెనుక పసికందు విక్రయాల నెట్‌వర్క్ నడిపిస్తున్నట్టు రాచకొండ పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ శివారులోని వాసుదేవపూర్ తాండాకు చెందిన కేదావత్ రవి, సరోజలు శిశువిక్రయాలకు పాల్పడుతున్నట్టు సరూర్‌నగర్ పోలీసులు తెలిపారు. కల్వకుర్తి, కొల్లాపూర్ తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ అయ్యే అమాయకుల నుంచి పిల్లలను తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్టు విచారణలో తేలిందన్నారు.
గోతిలో 3 రాళ్లు పెట్టి...
పాప పుట్టగానే చనిపోయిందని చెప్పి నమ్మించడంలో రవి దిట్ట అని ఈ ఆపరేషన్‌లో బయటపడింది. స్టింగ్ ఆపరేషన్‌లో రవి ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. పాప చనిపోయిందని వారి తల్లిదండ్రులను నమ్మించేందుకు గొయ్యి తీసి తెల్లటి టవల్‌లో మూడు రాళ్లు పూడ్చిపెట్టి, అక్కడ కొద్దిసేపు వారి సంబంధీకులతో ఏడుపు డ్రామా రక్తికట్టించి విక్రయాలకు పాల్పడుతున్నట్టు వెల్లడైంది.
అమ్మడం, కొనడం నేరం
పసిపిల్లలను అమ్మినా, కొనుగోలు చేసినా చట్టరీత్యా నేరమని, ఇలాంటి వారికి 2013 మానవ అక్రమ రవాణా సవరణ చట్టం ద్వారా జీవిత ఖైదు పడుతుందని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. ఇలా ఎవరైనా పసిపిల్లలను అమ్ముతామని చెప్పినా, బ్రోకర్లున్నా తమ దృష్టికి తీసుకురావాలని, ఇలాంటి నేరాలను ప్రోత్సహించవద్దని ఆయన ప్రజలకు సూచించారు. తాను నల్లగొండ ఎస్పీగా ఉన్న సమయంలోనూ తండాలను టార్గెట్‌గా చేసుకొని శిశువిక్రయాలకు పాల్పడ్డ గ్యాంగులను అరెస్ట్‌చేసి కటకటాల్లోకి నెట్టామని గుర్తుచేశారు. – మహేశ్ భగవత్
Comments
Please login to add a commentAdd a comment