
కనగల్ (నల్లగొండ) : ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని తేలకంటిగూడెం పరిధి తిమ్మన్నగూడెంలో బుధవారం చోటుచేసుకుంది. చండూరు సీఐ రమేశ్‌కుమార్, కనగల్ ఎస్‌ఐ డి.నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన నల్లబోతు సైదులు, లక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం చేయగా.. చిన్న కుమార్తె అనూష(17) హైదరాబాద్‌లోని ఈస్ట్ మారేడ్‌పల్లిలోని పాలిటెక్నిక్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే అనూష పదో తరగతి వరకు కనగల్ జెడ్పీహెచ్‌ఎస్‌లో తెలుగు మీడియంలో చదివి స్కూల్ టాపర్‌గా నిలిచింది. పదో తరగతి మార్కుల శాతం ఆధారంగా పాలిటెక్నిక్‌లో సీటు రావడంతో ఆంగ్ల మాధ్యమంలో చేరింది.
అయితే పది వరకు తెలుగు మీడియంలో చదవడం.. దానికితోడు కుటుంబ నేపథ్యం గ్రామీణ వ్యవసాయ కుటుంబం కావడంతో పైచదువుల్లో ఆంగ్ల మాధ్యమంలో రాణించలేకపోయింది. పాలిటెక్నిక్‌లో మార్కులు తక్కువగా వచ్చాయి. దీం తో తాను ఇంగ్లీష్‌లో చదువలేనని తల్లిదండ్రులకు చెప్పింది. ఈ క్రమంలో దసరా సెలవులకు ఇంటికి వచ్చిన అనూష మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు గదిలో చదువుకుంది. ఇంటి వరండాలో తల్లిదండ్రులు నిద్రకు ఉపక్రమించిన తర్వాత తెల్లవారుజామున ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం ఉదయం ఎంతకూ గది తలుపులు తీయకపోవడంతో ఇంటి పైకుప్ప తొలగించి చూసేసరికి అనూష ఉరేసుకుని మృతిచెందింది. ఉన్నత చదువులు చదివి ప్రయోజకురాలు అవుతుందనుకున్న కూతురు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.