అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న యువతి
చేర్యాల(సిద్దిపేట) : తనకు జన్మనిచ్చిన తల్లి ప్రేమ కావాలని.., తనను కన్న తల్లివద్దకు చేర్చాలని కోరుతూ ఓ యువతి ధర్నాకు దిగింది. శుక్రవారం సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చేర్యాల మండల కేంద్రానికి చెందిన ఎర్రోల్ల భాగ్యలక్ష్మి, ఆరుకట్ల నాగభూషణంలకు 1998లో వివాహం జరిగింది. వారికి 2001లో పాప (గ్రీష్మిక) జన్మించింది. పాప పుట్టిన నాలుగు నెలలకు నాగభూషణం మృతి చెందాడు.
అప్పటినుంచి నుంచి గ్రీష్మిక తన పెద్దనాన్న ప్రభాకర్ ఇంట్లో వారి బిడ్డలాగే పెరిగింది. కాగా, ఇటీవల బంధువుల ద్వారా తన కన్న తల్లి వేరే ఉందని తెలుసుకున్న గ్రీష్మిక, భాగ్యలక్ష్మి వద్దకు వచ్చింది. అయితే భాగ్యలక్ష్మి గ్రీష్మిక ఇంట్లోకి రావడానికి నిరాకరించింది. దీంతో గ్రీష్మిక పెద్దమనుషులు, పోలీసులను ఆశ్రయించింది. అయినా ఫలితం లేక పోవడంతో తనకు కన్నతల్లి ప్రేమకావాలని, తనను తల్లివద్దకు చేర్చాలని కోరుతూ శుక్రవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకుని చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారం అందించారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు గ్రీష్మికతో మాట్లాడి అనంతరం తల్లి భాగ్యలక్ష్మికి పోలీసుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment