
జీఎం శ్రీవాస్తవకు ఘనంగా వీడ్కోలు
దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జి జీఎంగా సక్సేన
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ శ్రీవాస్తవ మంగళవారం పదవీ విరమణ చేశారు. 36 ఏళ్లుగా భారత రైల్వేలో వివిధ హోదాలలో పనిచేసిన ఆయన ఏడాదిన్నరకు పైగా ద.మ.రైల్వే జీఎంగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన స్థానంలో దక్షిణ పశ్చిమ రైల్వే జనరల్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ సక్సేనా ఇన్‌చార్జి జనరల్ మేనేజర్‌గా నియమితులయ్యారు. 2013 నవంబర్ 20 నుంచి ద.మ.రైల్వే జీఎంగా పని చేసిన శ్రీవాస్తవకు రైల్వే అధికారులు, ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు.
మంగళవారం రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు జీఎంతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హోదాతో నిమిత్తం లేకుండా ప్రతి ఉద్యోగిని ఆప్యాయంగా పలకరించి కుటుంబంలో పెద్దన్నలా వ్యవహరించారని శ్రీవాస్తవ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ఏజీఎం ఉమేశ్ సింగ్, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా, సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్, జీఎం సెక్రటరీ శ్రీకాంత్‌రెడ్డి, ప్రజాసంబంధాల అధికారి షకీల్ అహ్మద్ తదితరులు శ్రీవాస్తవతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక వాహనంలో శ్రీవాస్తవ దంపతులను కూర్చొబెట్టి ఉద్యోగులు స్వయంగా వాహనాన్ని లాగుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
నేటి నుంచి సక్సేనా...
దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జి జనరల్ మేనేజర్‌గా నియమితులైన ప్రదీప్ కుమార్ సక్సేనా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇండియన్ రైల్వే ఇంజనీరింగ్ సర్వీస్ 1977 బ్యాచ్‌కు చెందిన సక్సేనా అసిస్టెంట్ ఇంజనీర్‌గా సెంట్రల్ రైల్వేలో తన కెరీర్‌ను ప్రారంభించారు. ముంబై మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు. దక్షిణ మధ్య రైల్వేకు రెగ్యులర్ జనరల్ మేనేజర్ నియామకం జరిగే వరకు ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తారు.