సాక్షి, హైదరాబాద్: దేశంలోకి ఏటా భారీ స్థాయిలో బంగారం అక్రమంగా ‘ఎగిరొస్తోంది’! పుత్తడి డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు అడ్డదారుల్లో దాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. దుబాయ్‌లో కొన్న బంగారాన్ని విమానాల్లో తమ మనుషుల ద్వారా అక్రమంగా దేశంలోకి తెప్పిస్తున్నారు. దుబాయ్‌లో అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్న ఈ వ్యాపారులు.. మన దేశంలో మాత్రం దిగుమతి సుంకం ఎగ్గొడుతున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, కొచ్చి, హైదరాబాద్ విమానాశ్రయాల ద్వారా ఏటా టన్నులకొద్దీ బంగారాన్ని వక్రమార్గాల్లో తెప్పించుకుంటున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) గణాంకాల ప్రకారం ఏటా 150 నుంచి 200 టన్నుల బంగారం దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తోంది. ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలో సీటు పైపుల్లో దాచిన 14 కిలోల బంగారం పట్టుబడిన కేసులో అక్రమార్కులు ఎగ్గొట్టజూసిన సుంకం విలువ సుమారు రూ. 70 లక్షలు కావడం గమనార్హం.
హైదరాబాదే ఎందుకు..?
వాస్తవానికి దేశంలోని మిగిలిన విమానాశ్రయాలతో పోలిస్తే హైదరాబాద్ విమానాశ్రయం ద్వారా జరుగుతున్న బంగారం అక్రమ రవాణా చాలా తక్కువ. కొచ్చి, చెన్నై, బెంగళూరు విమానాశ్రయాల్లో నిఘా అధికమైనప్పుడు మాత్రమే స్మగ్లర్లు హైదరాబాద్ ఎయిర్‌పోర్టును ఎన్నుకుంటున్నారు. డీఆర్‌ఐ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) అధికారుల కళ్లుగప్పేందుకే వారు హైదరాబాద్‌ను వాడుకుంటున్నారు. అయితే చాలా కేసుల్లో హైదరాబాద్ విమానాశ్రయంలో పట్టుబడుతున్న వారెవరూ హైదరాబాదీలు కాదు. స్థానిక డీఆర్‌ఐ అధికారులకు బంగారం అక్రమ రవాణా చేస్తున్న వారిలో భారతీయులతోపాటు విదేశీయులు కూడా పట్టుబడుతున్నా వారి వెనుక ఉన్న వ్యాపారులు మాత్రం తమ దందా సాగిస్తుండటం గమనార్హం. అయితే కొచ్చి, చెన్నై, హైదరాబాద్‌లకు ఏ రూపాల్లో బంగారం ఎలా వచి్చనా అంతా చేరుతున్నది మాత్రం ముంబైకే.
రూపుమార్చి... ఏమార్చి
డీఆర్‌ఐ అధికారులను బోల్తా కొట్టించి విమానాశ్రయం నుంచి బంగారాన్ని బయటకు తీసుకురావడం మాటలు కాదు. పుత్తడిని రహస్యంగా తరలించేందుకు కొందరు తమ శరీరాన్నే వాడుతున్నారు. కడుపులో, విగ్గుల్లో ఎవరికీ అనుమానం రాకుండా బంగారం తీసుకువస్తున్నారు. ఇంకొందరు బంగారాన్ని పౌడరులా మార్చి షాంపూలు, పేస్టుల్లో నింపి పట్టుకొస్తున్నారు. ఇంకొందరు బంగారం బిస్కెట్ల ఆచూకీని స్కానర్లు పట్టుకోకుండా వాటికి కార్బన్ ఫిలింలను అంటిస్తున్నారు. ఇంకొందరు విమానం సీట్ల పైపుల్లో, స్వీటు బాక్సుల్లో, లగేజీ హ్యాండిళ్లలోనూ తరలిస్తున్నారు. అయితే పెరుగుతున్న టెక్నాలజీ, ఆధునిక స్కానర్ల కారణంగా ఎక్కువశాతం కేసుల్లో పట్టుబడుతున్నారు.
ధరల్లో భారీ తేడా...
దుబాయ్‌లో 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) ధర రూ. 34 వేలు పలుకుతుండగా మన దేశంలో మాత్రం రూ. 39 వేలు పలుకుతోంది. అంటే 10 గ్రాముల ధరలో ఏకంగా రూ. 5 వేల వరకు వ్యత్యాసం ఉంటోంది. అదే కిలో బంగారానికి దాదాపు రూ. 5 లక్షల వరకు, ఒకేసారి పదుల కిలోల్లో తెచ్చుకుంటే రూ. కోట్లలో తేడా ఉంటుంది. దీంతో కొందరు వ్యాపారులు అక్కడ భారీగా కొనుగోళ్లు జరిపి అక్రమంగా దేశంలోకి బంగారాన్ని తరలిస్తున్నారు.
గణనీయంగా తగ్గిన కేసులు
శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో క్రమంగా బంగారం స్మగ్లింగ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. 2017–18లో అత్యధికంగా 151 కేసులు నమోదవగా ఆ తరువాత ఏడాది 97, ఈ ఏడాది 21 నమోదయ్యాయి. ఆధునిక బాడీ స్కానర్లు, డీఆర్‌ఐ, కస్టమ్స్ నిఘా, వేగుల సమాచారం ఆధారంగా శంషాబాద్ ద్వారా జరుగుతున్న బంగారం అక్రమ రవాణాకు అధికారులు చెప్పుకోదగ్గ స్థాయిలో ముకుతాడు వేయగలిగారు. ఈ ఏడాది గణనీయంగా తగ్గిన కేసులే ఇందుకు నిదర్శనం. అయితే పట్టుబడ్డ బంగారం మాత్రం భారీగా పెరిగింది.
ఎగిరొస్తున్న బంగారం!
Published Mon, Dec 23 2019 2:38 AM | Last Updated on Mon, Dec 23 2019 2:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment