రాగికి బదులు పసిడి!
► ఓల్టేజ్ కన్వర్టర్‌లో కేజీకి పైగా బంగారం
► గుట్టురట్టు చేసిన ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులు
సాక్షి, హైదరాబాద్: ఓల్టేజ్ కన్వర్టర్‌లో దాచి దుబాయ్ నుంచి తీసుకువచ్చిన 1.23 కేజీల బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు శనివారం రాత్రి పట్టుకున్నారు. ఈ దందాలో సూత్రధారులు ఓ బాధితుడిని క్యారియర్ (అక్రమ రవాణా చేసే వ్యక్తి)గా వాడుకున్నారని వెలుగులోకి వచ్చింది. ఓల్టేజ్ కన్వర్టర్‌లో ఉండే రాగి వైండింగ్ స్థానంలో 24 క్యారెట్ల బంగారంతో చేసిన దిమ్మెల్ని ఏర్పాటు చేశారు. వీటి చుట్టూ సిల్వర్ ఫాయిల్స్ చుట్టారు. ఈ కన్వర్టర్‌ను హైదరాబాద్‌కు అక్రమ రవాణా చేయడానికి ఓ బాధితుడిని క్యారియర్‌గా వాడుకున్నారు.
రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌లో ఉద్యోగం కోసం వెళ్లి మోసపోయి... తిరిగి భారత్ బయలుదేరాడు. ఇతడిని దుబాయ్ విమానాశ్రయంలో ట్రాప్ చేసిన స్మగ్లింగ్ సూత్రధారులు ఆ బాక్సును ఇచ్చారు. హైదరాబాద్‌లో దిగిన తర్వాత తమ మనిషి వచ్చి పార్సిల్ తీసుకుంటాడని మాత్రమే చెప్పారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 6ఈ 025 విమానంలో ఈ క్యారియర్ శనివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత బాక్స్ తీసుకోవడానికి వచ్చే వారి కోసం ఎదురు చూస్తున్నాడు. ఇతని కదలికలు అనుమానంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 1.23 కేజీల బంగారం దిమ్మెలు బయటపడ్డాయి. వీటిని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు ‘బాధితుడి’ని ప్రశ్నిస్తున్నారు. ఈ బంగారం విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.36,86,670 ఉంటుందని అధికారులు తెలిపారు.