శకటాలొద్దు.. నిర్మాణాలు చేపట్టొద్దు | Golkonda Fort: Tussle between army and govt over Independence Day Celebrations | Sakshi
Sakshi News home page

శకటాలొద్దు.. నిర్మాణాలు చేపట్టొద్దు

Published Thu, Aug 7 2014 2:00 AM | Last Updated on Fri, Jul 12 2019 4:35 PM

శకటాలొద్దు.. నిర్మాణాలు చేపట్టొద్దు - Sakshi

శకటాలొద్దు.. నిర్మాణాలు చేపట్టొద్దు

నేలపై గోతులూ తవ్వద్దు
గోల్కొండ కట్టడానికి నష్టం జరిగే పనులు లేకుండా చూడండి
రాష్ట్రప్రభుత్వానికి కేంద్రపురావస్తు శాఖ సూచనలు
ఢిల్లీ నుంచి అధికారికంగా రావాల్సిన అనుమతి    


 హైదరాబాద్: చారిత్రక గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర పురావస్తు శాఖ ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చేందుకు సిద్ధమైంది. కోట ప్రాంగణంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, భారీ గుంతలు తవ్వొద్దని, అక్కడి కట్టడాలకు ఇబ్బంది కలిగించేలా మార్పులు చేర్పులు చేయొద్దని సూచించింది. సాధారణంగా ఆగస్టు 15న వివిధ రూపాల్లో అలంకరించిన శకటాలను ప్రదర్శిస్తుంటారు.  కోట ప్రాంగణంలోకి వాటిని తీసుకురావద్దని సూచించింది. దీనికి రాష్ట్రప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది.  కేంద్రపురావస్తు శాఖ నుంచి అధికారికంగా అనుమతి మాత్రం రావాల్సి ఉంది. దీనికోసం ఇప్పటికే  రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసింది. దీన్ని పరిశీలిస్తున్న పురావస్తు శాఖ తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉంది.కోట వద్ద ఉత్సవాలను నిర్వహించే ప్రాంతాలను ఎంపిక చేయటానికి ఇటీవల  ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అక్కడ పర్యటించడంతో... హైదరాబాద్‌లో ఉన్న కేంద్రపురావస్తు శాఖ అధికారులు కూడా వెళ్లారు. ఈ విషయాన్ని వారు ఢిల్లీలోని ఉన్నతాధికారులకు తెలియజేయడంతో అక్కడి నుంచి ప్రాథమికంగా కొన్ని సూచనలు అందాయి. వాటిని సీఎం కేసీఆర్ కూడా అంగీకరించారు.

చారిత్రక వారసత్వ సంపద జాబితాలో ఉన్న గోల్కొండలోకి సాధారణ పర్యాటకులను మాత్రమే అనుమతిస్తారు. ఆ ప్రాంగణంలో ఎలాంటి ఉత్సవాలకు అనుమతించరు. ప్రభుత్వపరంగా జరిగే కార్యక్రమాలైతే దాని ఉద్దేశం, వివరాలను ముందస్తుగా పరిశీలించి  పురావస్తు శాఖ షరతులతో కూడిన అనుమతినిస్తుంది. పంద్రాగస్టు నేపథ్యంలో జాతీయ పతాకాన్ని ఎగుర వేయటం, పోలీసు వందన స్వీకారం, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడంతో అనుమతికి అడ్డంకులు ఉండక పోవచ్చు.

గతానుభవాల నేపథ్యంలో...

గత ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన యునెటైడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యూఎన్‌డబ్ల్యూటీఓ) సదస్సుల సందర్భంగా కేంద్రపురావస్తు శాఖ అనుమతితో సంబంధం లేకుండా గోల్కొండ కోటలో విదేశీ అతిథులకు రాత్రి విందు ఏర్పాటు చేశారు. నాటి కేంద్రమంత్రి చిరంజీవి ఆధ్వర్యంలో ఇది జరిగింది. ఆ విందులో మద్యం సరఫరా కూడా ఉండనుందన్న సమాచారంతో కేంద్రపురావస్తు శాఖ తీవ్రంగా స్పందించి కార్యక్రమానికి అనుమతి నిరాకరించింది. ఇది అప్పట్లో వివాదాస్పదమైంది. చివరకు మద్యం సరఫరా ఉండదని, కోటలో నిర్మాణాలకు  ఇబ్బంది కలగకుండా చూస్తామని కేంద్ర పర్యాటక శాఖ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వటంతో  షరతులతో అనుమతి లభించింది. ఆ కార్యక్రమాన్ని వెలుపల ఉన్న లాన్‌కే పరిమితం చేశారు. ఈ  ఉదంతం నేపథ్యంలోనే  పురావస్తు శాఖ కచ్చితంగా వ్యవహరిస్తోంది.
 
రాణిమహల్ వద్ద వేడుకలు  

స్వాతంత్య్ర దినోత్సవాల నిర్వహణకు గోల్కొండ కోటలోని రాణిమహల్ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎంపిక చేశారు. కోటలోనికి ప్రవేశించాక సౌండ్ అండ్ లైట్ షో నిర్వహించే చోట, సమీపంలోని మసీదు వద్ద లాన్‌లు ఉండటంతో విశాలంగా ఉన్న ఆ ప్రాంతాన్ని ఆయన ఎంపిక చేశారు. ఉత్సవాల నిర్వహణపై అధికారులతో బుధవారం సాయంత్రం నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతో అక్కడ అవసరమైన ఏర్పాట్లు మొదలయ్యాయి. ఎంపిక చేసిన కళాకారులతో  జెండా వందనానికి రెండు గంటల ముందు నుంచి సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని అధికారులు తెలిపారు.
 
డిఫెన్స్ కొర్రీతో..సీఎం వద్దకు పంచాయితీ
 
తాజాగా పతాకావిష్కరణకు ఎటువంటి ఇబ్బందులు లేనప్పటికీ, వేడుకల్లో భాగంగా నిర్వహించే పోలీస్ పరేడ్‌పైనే ఉత్కంఠ నెలకొంది. కోట వెనుక భాగాన ఉన్న ఖాళీ ప్రదేశంలో పరేడ్ నిర్వహణకు అధికారులు సన్నాహాలు చేస్తుండగా, మంగళవారం ఢిఫెన్స్ అధికారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. పరేడ్ నిర్వహించాలనుకుంటున్న 51ఎకరాల భూమి తమదేనని డిఫెన్స్ వారు చెబుతుండగా, ఆ స్థలం సర్కారుదేనని రెవెన్యూ యంత్రాంగం వాదిస్తోంది. అందుకు సంబంధించి డిఫెన్స్ అధికారులు బుధవారం అందజేసిన ధ్రువీకరణపత్రాలను స్థానిక రెవెన్యూ సిబ్బంది జిల్లా కలెక్టర్ ముఖేష్‌కు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థలాన్ని 1990కి ముందే తమకు కేటాయించినట్లు డిఫెన్స్ అధికారులు ఆధారాలు చూపుతుండడంతో.. హైదరాబాద్ జిల్లా యంత్రాంగం సంశయంలో పడింది. కలెక్టర్ వద్ద పంచాయితీ తేలకపోవడంతో అది కాస్తా సీఎం వద్దకు చేరింది. జిల్లా కలెక్టర్‌తో చర్చించిన సీఎం కేసీఆర్.. గురువారం డిఫెన్స్‌వారితో కూడా చర్చలు జరపాలనుకుంటున్నట్లు తెలిసింది. పరేడ్ నిర్వహణకు సంబంధించి గురువారం మధ్యాహ్నానికి స్పష్టత రావచ్చని రెవెన్యూ వర్గాలంటున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement