మరింత ఆసరా! | Good News For Aasara Pension Scheme Elders | Sakshi
Sakshi News home page

మరింత ఆసరా!

Published Sat, Jul 20 2019 11:41 AM | Last Updated on Sat, Jul 20 2019 11:41 AM

Good News For Aasara Pension Scheme Elders - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఆసరా పింఛన్ల సొమ్ము రెట్టింపుగా అందనుంది. పెరిగిన పింఛన్లు అమల్లోకి రావడంతో హైదరాబాద్‌ మహానగర పరిధిలో సుమారు 4.80 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. పెరిగిన పింఛన్‌ సొమ్ము జూలై మాసంలో లబ్ధిదారులకు అందనున్నాయి. శనివారం రవీంద్రభారతిలో  హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌లు లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌ పత్రాలను అందించి పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇక వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు రూ.1000లుగా ఉన్న పింఛన్‌  రూ.2016ల చొప్పున అందనుంది. అదేవిధంగా వికలాంగులు, వృద్ధ కళాకారులకు రూ.1500లుగా ఉన్న పింఛన్‌  రూ.3016లుగా అందనుంది. ప్రొసీడింగ్‌ పత్రాల పంపిణీ ముగిసిన వెంటనే  లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో పింఛన్‌ సొమ్ము జమ కానుంది.

మరో నాలుగు లక్షల మంది లబ్ధిదారులు
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పింఛన్‌ వయోపరిమితి 57కు తగ్గింపుతో మరో నాలుగు లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే 57 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపు వయసు గల వారు నాలుగు లక్షల వరకు ఉండవచ్చని రెవెన్యూ అధికార యంత్రాంగం ప్రాథమిక అంచనా వేసింది. తాజాగా కొత్త వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు లబ్ధిదారుల ఎంపిక కోసం 57 ఏళ్ల నుండి 64 సంవత్సరాల లోపు వ్యక్తుల ముసాయిదా జాబితాను ఈ నెల 25వ తేదీలోపు పూర్తిచేసే విధంగా జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. 2018 నవంబర్‌ మాసంలో ప్రకటించిన ఎన్నికల తుది జాబితాను అనుసరించి 57 సంవత్సరాల పైబడ్డవారి వివరాల జాబితాను రూపొందించనున్నారు. నగర ప్రాంతాల్లో 2 లక్షల వార్షిక ఆదాయం కలిగి ఏవిధమైన స్థిరాస్తి లేకుండా గతంలో పింఛను పొందని వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నారు. బి.ఎల్‌.ఓలు ఇంటింటి సర్వేను చేపట్టి ప్రాథమికంగా అర్హులుగా ఉన్నవారి ఆధార్‌ నెంబర్లను సేకరించనున్నారు. పింఛన్ల మంజూరుకు వయోపరిమితిని సాధారణంగా ఆధార్‌ కార్డు లేదా రేషన్‌ కార్డు, ఎన్నికల గుర్తింపు కార్డుల్లో ఉన్న వయసును ప్రామాణికంగా చేసుకొని నిర్ధారించనున్నారు. 57 ఏళ్ల నుండి 64 సంవత్సరాల లోపు ఉన్నవారి జాబితాను సేకరించి వారికి గతంలో వద్ధాప్య పింఛన్లు గాని, మరే ఇతర పింఛన్లు గానీ పొందుతున్న వివరాలను సకుటుంబ సర్వే, అందుబాటులో ఉన్న ఇతర సమాచారంతో అనుసంధానం చేసి అనర్హులను తొలగించి ముసాయిదాను రూపొందించనున్నారు. మొత్తం మీద వయసు సడలింపు అమలుతో ఆసరా పింఛన్లు పొందే వారి సంఖ్య దాదాపు రెట్టింపు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement