రాజాధిరాజుగా రామయ్య..
శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఘనంగా పట్టాభిషేకం
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో గురువారం శ్రీసీతారామ చంద్రస్వామి వారికి పట్టాభిషేక మహోత్సవం కనులపండువగా జరిగింది. మిథిలా స్టేడియంలో శిల్పకళా శోభితమైన కల్యాణ మండపంలో అత్యంత వైభవోపేతంగా జరిగిన ఈ వేడుకను కనులారా చూసిన భక్తులు పులకించి పోయారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టాభిషేక మహోత్సవంలో భాగంగా రామాలయ ప్రాంగణంలోని యాగశాలలో ఉదయం చతుస్థానార్చన హోమం నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని సుందరంగా అలం కరించిన పల్లకీలో ఆలయం నుంచి గిరి ప్రదక్షిణగా మిథిలాస్టేడియానికి తీసుకొచ్చి, కల్యాణ మండపంపై వేంచేయింపజేశారు.
ముందుగా స్వామివారికి ఆరాధన జరిపి సకల విఘ్నాలు తొలగిపోయేలా విష్వక్సేన పూజ చేసి, ఆ తర్వాత పట్టాభిషేకం తంతు ప్రారం భించారు. అనంతరం పూజా ద్రవ్యాల కు పుణ్యాహవచనం చేశారు. కలశాలలో ఉన్న చతుస్సముద్రాలు, పంచ నదుల తీర్థ జలాల కు ప్రోక్షణ చేసి, ఆ తీర్థాన్ని అష్టదిక్కులలో, భక్తులపై చల్లి సంప్రోక్షణ జరిపారు. రామ దాసు కాలం నాటి ఆభరణాలైన బంగారు పాదుకలు, రాజదండం, రాజము ద్రిక, క్షత్రం సమర్పించి కిరీట«ధారణ చేశారు. తర్వాత ప్రధాన కలశంతో ప్రోక్షణ చేసి రామయ్యను పట్టాభిషిక్తుడిని చేశారు. ఈ వేడుక విశిష్టతను వేద పండితులు మురళీకృష్ణమాచార్యులు భక్తులకు వివరిం చారు. శ్రీరాముడు లోక కల్యాణం కోసం చేసిన త్యాగం గురించి వర్ణించారు. శ్రీరాముడి పాలన నేటి తరాలకు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు.
ఎండలతో భక్తులు లేక వెలవెల..
పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమానికి ఆశిం చిన స్థాయిలో భక్తులు హాజరు కాలేదు. కార్య క్రమాన్ని 2 వేలకు లోపే భక్తులు తిలకించారని అధికారుల అంచనా. ఒకవైపు ఎండలు.. మరోవైపు కల్యాణం మరుసటి రోజున స్వామి వారికి జరిపే పట్టాభిషేకం గురించి ఆలయ అధికారులు సరైన రీతిలో ప్రచారం చేయకపో వడం వల్లే ఇలా జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులు లేక మిథిలా స్టేడియంలోని సెక్టార్లన్నీ ఖాళీగానే దర్శనమిచ్చాయి.
పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్ దంపతులు
మహాపట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు హాజ రై ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు ఆయన రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీతాయారు అమ్మవారు, భద్రమహర్షి ఆలయాలను కూడా దర్శించు కొని పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాలు, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్‌మోహన్‌రావు, ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, ఆలయ ప్రధానార్చ కులు పొడిచేటి జగన్నాథాచార్యులు, వైఎస్సార్ సీపీ కేంద్రకమిటీ సభ్యులు తమ్మినేని సీతా రాం, దైవజ్ఞశర్మ తదితరులు పాల్గొన్నారు.