న్యూఢిల్లీ: పార్లమెంట్ అనేది ప్రజల గొంతుక అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవాన్ని పట్టాభిషేక కార్యక్రమంలా నిర్వహించారని ఆక్షేపించారు. ఈ మేరకు రాహుల్ ట్వీట్ చేశారు. ప్రజస్వామ్యం మనగలిగేది భవనాల్లో కాదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. ప్రజల గొంతుకల్లో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందని తెలిపారు.
ప్రజాస్వామ్యం, జాతీయవాదం, ఆడశిశువుల సంరక్షణపై బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ పాలకులు చెబుతున్న మాటల్లోని డొల్లతనం బయటపడిందన్నారు. పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవం సందర్భంగా మహిళా రెజ్లర్లపై దాడి చేయడం దారుణమని విమర్శించారు. పార్లమెంట్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పుడు అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను దూరంగా ఉంచారని, ఇప్పుడు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును దూరం పెట్టారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు.
ఎన్నికల రాజకీయాల కోసం దళితులను, గిరిజనులను పావులుగా వాడుకోవడం ప్రధాని మోదీకి అలవాటేనని దుయ్యబట్టారు. చరిత్రాత్మక సందర్భానికి రాష్ట్రపతిని దూరం పెట్టడం ఏమిటని నిలదీశారు. ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ ట్వీట్‌పై బీజేపీ ఎంపీ సుశీల్‌కుమార్ సింగ్ స్పందించారు. నరేంద్ర మోదీకి దేశ ప్రజలు రెండుసార్లు అధికారం కట్టబెట్టడాన్ని రాహుల్ గాంధీ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే మోదీపై అసూయ పెంచుకున్నారని విమర్శించారు.
భారీ ప్రచార కార్యక్రమం..
పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించిన తీరుపై వామపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమం చక్రవర్తి పట్టాభిషేక మహోత్సవంలా ఉందని వ్యాఖ్యానించాయి. దేశ ప్రజలను భాగస్వాములుగా చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘న్యూ ఇండియా’అనే ప్రకటనతో భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రతిపక్ష పార్టీలు ఎవరూ లేకుండానే పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన మోదీ ప్రభుత్వం దీనిని భారీ ప్రచార కార్యక్రమంగా మార్చుకుందని సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు.
ఒక వైపు సెంగోల్‌కు పూజలు చేసిన మోదీ ప్రభుత్వం మరోవైపు రెజ్లర్లపై లాఠీలను ఝళిపించిందని సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వమ్ ఆరోపించారు. మున్ముందు నిరంకుశ ఫాసిస్ట్ విధానాలు సాగుతాయనేందుకు ఈ ఘటనలే నిదర్శనమన్నారు. చక్రవర్తి పట్టాభిషేకం మాదిరిగా పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం జరుగుతుండగానే మహిళా రెజ్లర్లు, మహిళా పంచాయత్‌కు వచ్చిన మహిళలపై పోలీసు జులుం సాగింది. ఇది ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తిపై నిరంకుశ దాడి’అని సీపీఐ ఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య పేర్కొన్నారు.
मैं भारत की आवाज़ के लिए लड़ रहा हूं।
— Rahul Gandhi (@RahulGandhi) March 24, 2023
मैं हर कीमत चुकाने को तैयार हूं।
తిరోగమనానికి నిదర్శనం: పవార్
పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ వివిధ మతసంబంధ పూజలు చేయడంపై ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశం వెనక్కి వెళుతోందనటానికి ఇవే నిదర్శమన్నారు. ‘మన సమాజంలో శాస్త్రీయ దృక్పథం పెంపొందాలని భారత ప్రథమ ప్రధాని నెహ్రూ ఆకాంక్షించారు. కొత్త పార్లమెంట్ భవన సముదాయం ప్రారంభం సందర్భంగా నిర్వహించిన మతాచారాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి’అని పవార్ పుణేలో మీడియాతో పేర్కొన్నారు.
మన దేశం కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్తున్నట్లు భయం కలుగుతోందన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కూడా ఆహ్వానించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలు రాష్ట్రపతి ప్రసంగంతోనే ప్రారంభమవుతున్నప్పుడు వారిని ఆహ్వానించకపోవడమేంటన్నారు. ‘పార్లమెంట్ నూతన భవనం ప్రారంభానికి నాకు ఆహ్వానం పంపిందీ లేనిదీ తెలియదు. ఒక వేళ ఢిల్లీలోని నా కార్యాలయానికి ఆహ్వానం వచ్చి ఉంటుందేమో తెలియదు’అని వ్యాఖ్యానించారు.
శవపేటికలా పార్లమెంట్ భవనం: ఆర్‌జేడీ వివాదాస్పద ట్వీట్
బిహార్‌లోని అధికార పార్టీ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్‌జేడీ )పార్లమెంట్ నూతన భవనాన్ని శవపేటికతో పోల్చింది. పార్లమెంట్ కొత్త భవనం శవపేటిక మాదిరిగా త్రిభుజాకారంలో ఉందంటూ బిహార్ అధికార ఆర్‌జేడీ ఆదివారం ట్వీట్ చేసింది. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఆర్‌జేడీని శవపేటికలోనే సమాధి చేస్తారంటూ వ్యాఖ్యానించింది. ‘ఆర్‌జేడీ అథమ స్థితికి దిగజారింది.
త్రికోణానికి భారతీయ వ్యవస్థలో ఎంతో ప్రాధాన్యం ఉంది. శవపేటిక షట్కోణంగా గానీ బహుభుజిగా కానీ ఉంటుందని తెలుసుకోవాలి’అని పేర్కొంది. అయితే, ఆర్‌జేడీ తన వ్యాఖ్యలను సమర్థించుకుంది. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టింది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని గానీ, రాజ్యసభాధ్యక్షుడైన ఉపరాష్ట్రపతిని గానీ పిలవలేదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి జరగవు’అంటూ ఆ పార్టీ ట్వీట్ చేసింది.
ఇదీ చదవండి:త్వరలో ఎంపీల సీట్లు పెరుగుతాయి: ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment