తెలంగాణ సర్కారీ కాలేజీల హవా | Government colleges results in Junior inter Exams | Sakshi
Sakshi News home page

తెలంగాణ సర్కారీ కాలేజీల హవా

Published Thu, Apr 23 2015 3:24 PM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM

తెలంగాణ సర్కారీ కాలేజీల హవా

తెలంగాణ సర్కారీ కాలేజీల హవా

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన జూనియర్ ఇంటర్ ఫలితాల్లో వివిధ జిల్లాల్లో కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాల విద్యార్థులు తమ సత్తా చాటారు.  దాదాపు అన్ని జిల్లాల్లోనూ  అమ్మాయిల హవా కొనసాగింది. బాలురతో పోలిస్తే బాలికలు ఎప్పటిలాగానే ప్రతిభ కనబర్చారు.

తెలంగాణలోని పది జిల్లాల ఫలితాలు ఇలా ఉన్నాయి:

హైదరాబాద్- రంగారెడ్డి
హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన గాయ్రతి జ్యోతి, కావ్య, భార్తవి, రవీంద్ర అత్యుత్తమ  పలితాలు సాధించారు.
మూసాపేట: ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షల్లో కూకట్‌పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు... కార్పొరేట్ కళాశాలలకు తీసిపోమని నిరూపించారు.  గత ఏడాది 50.5 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈసారి ఈ సంఖ్య 72.2కు పెరిగింది. సాధారణ కోర్సుల్లో 314 మంది విద్యార్థులకు 206 మంది ఉత్తీర్ణులయ్యారు. వృత్తి విద్యలో 104 మంది విద్యార్థులకు 96 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కోర్సులో (ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్-పీఎస్‌టీటీ) గాయత్రి జ్యోతి 487 మార్కులు, కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్ (సీజీఏ)లో స్వాతి 484, అకౌంటింగ్, ట్యాక్సేషన్(ఏటీ)లో ఎ.కావ్య 482 మార్కులు సాధించారు. సీఈసీలో బి.రవీంద్ర 457, ఎంపీసీలో భార్గవి 429, బైపీసీలో పవిత్ర 388 మార్కులు సాధించారు.

రాయదుర్గం:  ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షా ఫలితాల్లో పేద విద్యార్థినులు సత్తా చాటారు. గౌలిదొడ్డిలోని తెలంగాణ  సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల విద్యార్థినులు అత్యధిక మార్కులు సాధించారు. క ళాశాల ఉత్తీర్ణత శాతం 75గా నమోదైంది. ఎంఈసీలో 25 మంది పరీక్షలు రాయగా... 17 మంది ఉత్తీర్ణులయ్యారు. సీఈసీలో 37 మందికి గాను 25 మంది పాసయ్యారు.
 గౌలిదొడ్డిలోని గురుకుల బాలికల కళాశాలలో ఎంఈసీ చదువుతున్న మాధురి మొత్తం 500 మార్కులకు గాను 483 మార్కులు సాధించింది.  ఇదే కళాశాలకుచెందిన స్రవంతి మొత్తం 500 మార్కులకుగాను 479 సాధించింది.
గౌలిదొడ్డిలోని టీఎస్‌డబ్ల్యూఆర్(ఐఐటీ-ఎల్‌టీసీడీ) కళాశాల విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో సత్తా చాటారు.  ఈ కళాశాలకు చెందిన ఎంపీసీ విద్యార్థిఅఖిల్ ,లీల, ప్రేమ్‌సాగర్  పవిత్ర టాప్లో నిలిచారు.

వరంగల్
జిల్లాలో ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే ఈ ఏడాది 6.21 శాతం పెరిగింది. జిల్లాలో దేవరుప్పల ప్రభుత్వ జూనియర్ కళాశాల 92 శాతం ఉత్తీర్ణతతో టాప్‌గా నిలిచింది. తాడ్వారు, నెల్లికుదురు  సంగెం తర్వాతి  స్థానంలో నిలిచాయి.పర్కాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 43 మందికి నలుగురే ఉత్తీర్ణత సాధించి అట్టడుగున నిలిచారు. ప్రభుత్వ కళాశాలల్లోని ఒకేషనల్ కోర్సుల్లో 59.35 శాతం ఉత్తీర్ణులయ్యూరు.  కాగా జిల్లాలోని 14 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీల్లో రెండు కళాశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి. ఇందులో మడికొండ రెసిడెన్షియల్ కాలేజీలో 76 మందికి 76 మంది.. పర్వతగిరి రెసిడెన్షియల్‌కాలేజీలో 79 మందికి 79 మంది ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు.

మహబూబాబాద్ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలో 77 మందికి 24 మంది ఉత్తీర్ణత సాధించి చివరి స్థానంలో నిలిచారు.  జిల్లాలో నాలుగు గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ కాలేజీల్లో 75.67 శాతంఉత్తీర్ణత సాధించారు. ఇందులో ములుగు రోడ్డులోని ట్రైబల్ వెల్ఫేర్ ఎక్సెలెన్స్ జూనియర్ కాలేజీ టాప్‌లోనూ  ఏటూరునాగారం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీ  చివరి స్థానంలో నిలిచాయి.  మోడల్ స్కూళ్లలో నెల్లికుదురు మోడల్ స్కూల్ 98.46 శాతం ఉత్తీర్ణతతో టాప్‌లోను, వెంకటాపూర్ మండలంలోని జవహార్‌నగర్ మోడల్ స్కూల్‌ చివరి స్థానంలో నిలిచింది. జిల్లాలో ఆరు ఏయిడెడ్ జూని యర్ కాలేజీల్లో డోర్నకల్‌లోని డీ డీ కాలేజీలో 58.57 శా తం ఉత్తీర్ణత సా ధించి టాప్‌లో నిలిస్తే మహబూబియా పంజ తన్ ఏయిడెడ్ కాలేజీలో 100 మందికి ఐదుగురే  ఉత్తీర్ణత సాధించారు.

కరీంనగర్
జిల్లాలో 58 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. ఇందులో మొత్తం 6,866 మంది విద్యార్థులు పరీక్షలకు హజరు కాగా 3,227 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో 47 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సారంగాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి 66 మంది విద్యార్థులు పరీక్షలకు హజరు కాగా 64 మంది పాసై జిల్లాలో మొదటి స్థానంలో నిలిపారు. రెండవ స్థానాన్ని అదే మండలంలోని బీర్‌పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కైవసం చేసుకుంది. మల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ మూడో స్థానం పొందింది. చొప్పదండి ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లాలోనే చివరి స్థానంలో నిలిచింది.

ఖమ్మం
2014లో ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది స్థానంలో నిలిచిన జిల్లా బుధవారం వెలువరించిన ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జీజేసీ బనిగండ్లపాడు నూటికి నూరుశాతం ఫలితాలు సాధించింది. గుండాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 52 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే కేవలం ఐదుగురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.  
 

ఆదిలాబాద్
ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని గురుకుల కళాశాలలు ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఫలితాలు గతేడాతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించాయి. ఈ విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇచ్చోడ, ఉట్నూర్, ఆసిఫాబాద్ బాలికల కళాశాలలు, ఆదిలాబాద్, నార్నూర్, లాల్‌టెక్డి బాలుర కళాశాలలు కలిపి మొత్తం ఆరు కళాశాలల్లో మొదటి సంవత్సరంలో 779 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరు కాగా.. 681 మంది ఉత్తీర్ణత సాధించారు. 98 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఇచ్చోడ బాలికల కళాశాల అత్యధికంగా 99.13 శాతం సాధించి మొదటి స్థానంలో నిలువగా.. రెండో స్థానంలో నార్నూర్ బాలుర కళాశాల 96.48 శాతం సాధించింది. ఆదిలాబాద్ బాలుర కళాశాల 68 శాతం సాధించి చివరి స్థానంలో నిలిచింది.

నిజామాబాద్
ప్రభుత్వ కళాశాలలలో కూడా ఉత్తీర్ణత పెరిగింది. రాష్ట్ర స్థాయిలో జిల్లా మూడవ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ కళాశాలలలో 5,159 మంది విద్యార్థు లు పరీక్షలు రాయగా 2,743 మంది  ఉత్తీర్ణులయ్యారు.

మెదక్
ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో జిల్లా 45 శాతం ఉత్తీర్ణ సాధించి రాష్ట్ర స్థాయిలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. క్రితం సారి కంటే ఈసారి ఒక శాతం ఫలితాలు క్షీణించాయి. కాగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాత్రం రాష్ట స్థాయిలో జిల్లా రెండో స్థానాన్ని దక్కించుకుంది. జిల్లా స్థాయిలో తొగుట జూనియర్ కళాశాల వందశాతం ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలవగా నార్సింగ్ జూనియర్ కళాశాల కేవలం 14 శాతం ఉత్తీర్ణత సాధించి చివరి స్థానానికి పడిపోయింది. కోహీర్: ఇంటర్ ఫలితాల్లో కోహీర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లాలో రెండో స్థానంలో నిలిచిందని ప్రిన్సిపాల్ జయరావు తెలిపారు.  

మహబూబ్ నగర్
మహబూబ్ నగర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 48శాతం ఉత్తీర్ణత శాతం సాధించి రాష్ట్రంలో అయిదవ స్థానంలో నిలిచాయి.  ఉత్తీర్ణతా శాతంలో జిల్లాలో ప్రథమ స్థానంలో తాడూరు,  రెండవ స్థానంలో పెబ్బేరు, కొల్లాపూర్ బాలికల జూనియర్ కళాశాల చివరి స్థానంలో నిలిచింది.

నల్గొండ
జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ సంవత్సరం ఇంటర్ ఫలితాల శాతం ఘోరంగా దెబ్బతింది.  గత కొన్నేళ్లుగా 90 శాతానికి పైగా ఫలితాలతో అగ్రస్థానంలో నిలిచిన జీజేసీ నెమ్మికల్‌లో ఈ సంవత్సరం  13.77 శాతం ఫలితాలు సాధించింది. 94.53 శాతం ఉత్తీర్ణతతో జీజేసీ సంస్థాన్ నారాయణ్‌పూర్ ప్రథమ స్థానంలో ఉండగా, 87.90 శాతంతో జీజేసీ నడిగూడెం 2వ స్థానంలో నిలిచింది. 84.29 శాతం ఉత్తీర్ణతతో జీజేసీ విజయపురి నార్త్ (నాగార్జునసాగర్) తృతీయ స్థానం పొందింది. జిల్లాలోని నాలుగు ఎయిడెడ్ కాలేజీల్లో కేవలం 12.02 శాతం ఉత్తీర్ణతే నమోదయ్యింది.  సూర్యాపేటలోని రాజారాం మెమోరియల్ జూనియర్ కాలేజీలో 70 మంది పరీక్ష రాయగా ఒకే ఒక్కడు  ఉత్తీర్ణుడయ్యాడు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement