హుజూరాబాద్: ప్రభుత్వం తమకు అప్పగించిన కస్టమ్ మిల్లింగ్ ధాన్యాన్ని(సీఎంఆర్) మరపట్టించి మళ్లీ ప్రభుత్వానికి లెవీ బియ్యాన్ని సరఫరా చేయాల్సిన మిల్లర్లు కొత్త పంథాలో పోతున్నారు. సర్కారు ధాన్యాన్ని కంటికి రెప్పలా కాపాడాల్సినవారు ఏకంగా ఆ ధాన్యాన్ని తాకట్టుపెట్టి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటున్నారు. అలాంటి సంఘటనే తాజా వెలుగు చూసింది. హుజూరాబాద్ శివారులోని పెంచికలపేట గడ్డపై ఉన్న బాలాజీ పారాబాయిల్డ్ మిల్లుకు గత సీజన్‌లో 23వేల క్వింటాళ్ల సీఎంఆర్ ధాన్యాన్ని కేటాయించారు. ఈ ధాన్యాన్ని మరపట్టించి ప్రభుత్వానికి లెవీ ద్వారా 15674 క్వింటాళ్ల బియ్యాన్ని సరఫరా చేయాలి. కాని ఇప్పటివరకు కేవలం 8100 క్వింటాళ్ల బియ్యాన్ని మాత్రమే సరఫరా చేశారు. ఇంకా 7574 క్వింటాళ్ల బియ్యాన్ని పంపించాల్సి ఉంది. అయితే గడువు ముగిసినా ఇంకా ఎందుకు పంపించడం లేదని అధికారులు విచారణ జరపగా సదరు మిల్లు నిర్వాహకులు స్పందించలేదు. ఆ తర్వాత అసలు వాస్తవాలు బయటపడ్డాయి.
పదిరోజుల క్రితం షిఫ్టింగ్‌కు ఆదేశం
బాలాజీ రైస్‌మిల్లులో ఉన్న సర్కారు ధాన్యాన్ని వెంటనే వేరే మిల్లులకు తరలించాలని జిల్లా అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో పదిరోజుల క్రితం 2500 క్వింటాళ్ల ధాన్యాన్ని తరలించారు. ధాన్యాన్ని తరలిస్తున్న సమయంలోనే ఓ బ్యాంకు ప్రతినిధులు వచ్చి అడ్డుకున్నారు. ఈ ధాన్యం తమకు సంబంధించిందని, దీనిని తరలించే హక్కు అధికారులకు లేదని వారు చెప్పడంతో సివిల్‌సప్లయ్ ఉద్యోగులు కంగుతిన్నారు. ఈ క్రమంలో ధాన్యం ఉన్న గోదాముకు బ్యాంకు ప్రతినిధులు తాళాలు వేసుకొని స్వాధీనం చేసుకున్నారు.
రూ.70లక్షల రుణం పొందిన వైనం
మిల్లులో ఉన్న సర్కారు ధాన్యాన్ని తాకట్టు పెట్టి సదరు నిర్వాహకులు రూ.70లక్షల రుణం తీసుకున్న విషయం అధికారులకు తెలియడంతో బుధవారం డీఎస్‌వో చంద్రప్రకాశ్, డీఎం సంపత్, తహశీల్దార్ శంకరయ్య, ఎఫ్‌ఐ శ్రీనివాస్, డీటీసీఎస్‌లు రమేశ్, రాజమౌళి పోలీసు బలగాలతో మిల్లు వద్దకు చేరుకున్నారు. గోదాములకు తాళాలు వేసి ఉండటంతో బ్యాంకు ప్రతినిధులకు, మిల్లు యజమానికి సమాచారం ఇచ్చారు. అయినా వారు రాలేదు. దీంతో స్వయంగా అధికారులే గోదాముల తాళాలను పగలగొట్టించారు. అనంతరం ధాన్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ధాన్యాన్ని అప్పగించకుంటే కేసులు పెడతామని డీఎస్‌వో, డీఎం చెప్పారు.
సర్కారు ధాన్యం తాకట్టు
Published Thu, Dec 11 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM
Advertisement