‘బీసీ’ నిధికి 30 వేల కోట్లు | Government Mulls on BC Fund of 30,000 Crores | Sakshi
Sakshi News home page

‘బీసీ’ నిధికి 30 వేల కోట్లు

Published Mon, Jan 8 2018 12:48 AM | Last Updated on Wed, Aug 15 2018 9:45 PM

Government Mulls on BC Fund of 30,000 Crores - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వెనుకబడిన కులాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్‌డీఎఫ్‌) ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. భారీ మొత్తంలో నిధిని కేటాయించి చట్టబద్ధత కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు బీసీ నివేదికకు మెరుగులు దిద్దుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ కులాల కోసం ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్సీ ఎస్‌డీఎఫ్‌), షెడ్యూల్డ్‌ తెగల కోసం ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్టీ ఎస్‌డీఎఫ్‌)ని అమలు చేస్తోంది.

ఈ క్రమంలో బీసీలకు సైతం ప్రత్యేక అభివృద్ధి నిధిని ప్రవేశపెట్టాలనే డిమాండ్‌ రావడంతో గతేడాది అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దీనిపై ప్రకటన చేశారు. అనంతరం బీసీల సమగ్రాభివృద్ధికి సంబంధించి నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేశారు. బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్న కమిటీ తొలిసారి సీఎం నేతృత్వంలో గతేడాది డిసెంబర్‌ 3న అసెంబ్లీ హాలులో సమావేశమైంది.

సంతృప్తికర స్థాయిలో నిధులిస్తామని సీఎం ఈ భేటీలో స్పష్టం చేశారు. తర్వాత కమిటీ సభ్యులు డజనుకుపైగా సమావేశాలు నిర్వహించి ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం దీనికి తుది రూపు ఇస్తున్నారు. మెజారిటీ సభ్యులు బీసీ ప్రత్యేక అభివృద్ధి నిధి(బీసీ ప్లాన్‌)కి మొగ్గు చూపారు. దీంతో బీసీల కోసం అమలు చేసే కార్యక్రమాలన్నీ ఒకేచోటుకు తీసుకొచ్చి ప్రత్యేక అభివృద్ధి నిధిగా రూపొందించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బీసీ ఎస్‌డీఐఫ్‌ వైపు అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.

జన సంఖ్యకు అనుగుణంగా కేటాయింపులు
2011 జనగణన ప్రకారం రాష్ట్ర జనాభా 3.50 కోట్లు. ఇందులో ఎస్సీ జనాభా శాతం 15.45, ఎస్టీ జనాభా 9.27 శాతంగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే బీసీల జనాభాపై స్పష్టత ఇవ్వలేదు. అయినా అధికారిక అంచనాల్లో భాగంగా 51.09 శాతంగా లెక్కిస్తున్నారు. ఈ మేరకు సీఎంతో సహా మంత్రులు సైతం ఈ గణాంకాలను ప్రస్తావిస్తున్నారు. సబ్‌ కమిటీ సైతం 50 శాతాన్ని పరిగణిస్తూ బీసీలకు సగం వాటా దక్కాలని పేర్కొంది. నివేదిక తయారీలోనూ ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

మున్ముందు మరిన్ని నిధులు
2018–19లో బీసీ అభివృద్ధి నిధికి ఓ రూపు తీసుకురావాలని భావిస్తున్న అధికార యంత్రాంగం.. ప్రాథమికంగా రూ.30 వేల కోట్ల నిధికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. బీసీ ఎస్‌డీఎఫ్‌కు చట్టబద్ధత వస్తే తదుపరి ఏడాదిలో భారీ నిధులను కేటాయించే వీలుంటుందని బీసీ కమిటీ సభ్యుడు ఒకరు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల కోసం అమలు చేసిన ఉప ప్రణాళికలకు బదులుగా 2017–18 నుంచి ఎస్సీ ఎస్‌డీఎఫ్, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

బడ్జెట్‌లో మార్పుల దృష్ట్యా వీటిని ప్రత్యేక అభివృద్ధి నిధిగా మార్చి చట్టబద్ధత కల్పించింది. ఇందులో భాగంగా ఎస్సీలకు రూ.14,375.12 కోట్లు, ఎస్టీలకు రూ.8,165.87 కోట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీల కంటే అధికంగా ఉన్న బీసీలకు ప్రత్యేక అభివృద్ధి నిధి కింద కనిష్టంగా రూ.30 వేల కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

జనాభా నిష్పత్తితో పోలిస్తే ఈ నిధి తక్కువైనప్పటికీ... తొలిసారి అమలు చేస్తున్నందున ఈ మోత్తాన్ని కేటాయిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలను సీఎంకు సమర్పించిన తర్వాత ఆయన నిర్ణయాన్ని బట్టి కేటాయింపులు మారే అవకాశం ఉంది. 2018–19 బడ్జెట్‌ సమావేశాల్లో ప్రభుత్వం బీసీ ప్రత్యేక అభివృద్ధి నిధిని ప్రవేశపెట్టనుందని బీసీ కమిటీ సభ్యుల్లో ఒకరు పేర్కొన్నారు.

2017–18లో ఎస్సీ, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌ కేటాయింపులు ఇవీ..
కేటగిరీ                   రూ.కోట్లలో
ఎస్సీలకు               14,375.12
ఎస్టీలకు                 8,165.87 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement