ప్రీ ప్రైమరీ కూడా ప్రవేశపెట్టే యోచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశపెట్టేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమల్లోకి తేవాలని భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లోనే ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టాలా? అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశ పెట్టాలా? అన్న అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి సారించాలని పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ ఇటీవల జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించారు. మరోవైపు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ (ఎల్‌కేజీ, యూకేజీ) విద్యను కూడా ప్రవేశపెట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది.
ప్రీప్రైమరీని ప్రవేశ పెడితే అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలలతో అనుసంధానం చేయాల్సి వస్తుందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై ఇదివరకే ప్రభుత్వ స్థాయిలో చర్చ జరిగినా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే ప్రభుత్వ బడులను బతికించుకోవాలంటే ప్రీప్రైమరీ తప్పనిసరిగా ప్రవేశ పెట్టాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తుండగా, తల్లిదండ్రులు కూడా ఇంగ్లిష్ మీడియం విద్యను కోరుకుంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని 35,700 అంగన్‌వాడీ కేంద్రాల్లో 7,64,905 మంది 3-6 ఏళ్ల వయసున్న పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీని అమల్లోకి తెస్తే ఈ పిల్లలను పాఠశాలల ఆవరణలోకి తీసుకురావాల్సి వస్తుంది. ఇది సాధ్యమవుతుందా? లేదా? అన్న అంశంపై చర్చ జరుగుతోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం
Published Fri, Apr 15 2016 2:53 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement
Advertisement