సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌తో కరోనా పీడ విరగడవుతుందా? వైరస్ విరుగుడుకు లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారమా? దేశంలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ గడువు ముగిశాక మళ్లీ పొడిగించాలా? ఇలా ఎంతకాలం పొడిగించాలి? దీనికి అంతు ఉంటుందా? అసలు దీనికి సరైన పరిష్కారం ఏమిటి? ఈ అంశాలపై దేశంలోని ప్రముఖ అంటురోగాల వైద్య నిపుణులు, ప్రభుత్వ వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో మే 3తో లాక్‌డౌన్ ముగియనుండగా రాష్ట్రంలో మే 7తో ముగియనుంది. శనివారంతో 35 రోజుల లాక్‌డౌన్ గడిచిపోయింది.
అయినా దేశంలో, రాష్ట్రంలో రోజువారీగా బయటపడుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. లాక్‌డౌన్ వల్లే పరిస్థితి నియంత్రణలో ఉందని ప్రభుత్వం పేర్కొంటోంది. వైరస్ నియంత్రణకు ప్రస్తుత వ్యూహాన్నే మున్ముందూ యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తే లాక్‌డౌన్ పొడిగింపు తప్ప మరో మార్గం కనిపించడం లేదు. అయితే కరోనా వ్యాప్తి ప్రారంభానికి రెండేళ్ల ముందు నుంచే దేశం లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. కరోనా దెబ్బకు సమీప భవిష్యత్తులో కోలుకోలేనంతగా దేశ ఆర్థిక వ్యవస్థ కుంగి పోయింది. దేశ ఆర్థిక వ్యవస్థతో పోల్చితే గతంలో ఎంతో మెరుగైన స్థితిలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సైతం లాక్‌డౌన్‌తో కుదేలైంది.
ముగింపు పలకాలి.. అంటురోగాల వైద్య నిపుణులు
లాక్‌డౌన్‌కు ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని డాక్టర్ జయప్రశాశ్ ములియాల్, టి. జాకబ్‌జాన్ వంటి సీనియర్ అంటురోగాల వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధింపు ఎలుకను పట్టేందుకు ఇంటిని తగలబెట్టుకోవడం లాంటిదని అభిప్రాయపడుతున్నారు. దేశంలో కుష్టు వ్యాధి, పోలియో నిర్మూలనలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ జయప్రకాశ్ ములియాల్, డాక్టర్ టి. జాకబ్‌జాన్ లాక్‌డౌన్ అంశంపై ఏమన్నారంటే...
► లాక్‌డౌన్‌తో కరోనా వైరస్ పీడ విరగదు.
► యువతను ప్రధానంగా 25 నుంచి 40 ఏళ్ల వయస్కులను పనికి పంపించాలి. వస్తు, సేవల ఉత్పత్తి, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి కల్పన రంగాల్లో దేశం మళ్లీ క్రియాశీలకంగా మారాలి.
► యువతలో చాలా మంది వైరస్ బారినపడి అస్వస్థతకు గురైనా చికిత్స తర్వాత కోలుకుంటారు. మరణాల రేటు కూడా తగ్గిపోతుంది. ఇలా జనాభాలో 60% మందికి వైరస్‌ను తట్టుకునే రోగ నిరోధక శక్తి వస్తే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసినట్లే.
► వయోవృద్ధులు వైరస్ బారిన పడకుండా కాపాడుకోవాలి. మూడు నెలలు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంచాలి.
► వ్యక్తుల మధ్య కనీస భౌతిక దూరం పాటించాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలి. చదవండి: కరోనా సమయంలో పేదలను ఆదుకునే జకాత్
ఒకేసారి ఎత్తేస్తే భారీ మూల్యం తప్పదు: ప్రభుత్వ వైద్యులు
హెర్డ్ ఇమ్యూనిటీని నమ్ముకొని ఒక్కసారిగా లాక్‌డౌన్ ఎత్తేస్తే పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగి దేశ వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని, ఇందుకు మన వైద్య సదుపాయాలు సరిపోవని ప్రభుత్వంలో పనిచేస్తున్న వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీని నమ్ముకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తేయాలని సూచిస్తున్నారు. కంటైన్మెంట్ జోన్లలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తూ మిగిలిన ప్రాంతాల్లో సడలింపులు అమలు చేయాలని అభిప్రాయపడుతున్నారు. కరోనా నియంత్రణకు కేంద్రం ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్ బృందం సైతం దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తేయాలని, కంటైన్మెంట్ ప్రాంతాల్లో కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలని సూచించింది.
లాక్‌డౌన్‌తో వైరస్ వ్యాప్తిని పూర్తిగా అడ్డుకోలేం...
లాక్‌డౌన్ అమలు వల్ల రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యంకాదని దీని నియంత్రణకు రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన కీలక కమిటీలోని సభ్యుడు ఒకరు అభిప్రాయపడ్డారు. ‘చెక్‌పోస్టుల వద్ద స్మగ్లింగ్ గూడ్స్‌ను ఆపేసినట్లుగా దీన్ని నిలువరించడం సాధ్యం కాదు. వైరస్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఏ వైరస్ అయినా వ్యాప్తి చెందుతుంది. ఐదారేళ్ల క్రితం స్వైన్‌ఫ్లూ రాష్ట్రాన్ని వణికించింది. అయితే దానికి కరోనాలాగా వేగంగా వ్యాప్తి చెందే గుణం లేదు. ఇప్పుడు స్వైన్‌ఫ్లూ వైరస్ దాదాపు అందరిలోనూ ప్రవేశించింది. దీన్ని తట్టుకొనేందుకు ప్రజల్లో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చింది. అలాగే కరోనాకు కూడా మనం ఇప్పుడు అలవాటు పడాల్సి ఉంటుంది.
వైరస్ విస్త్రృతంగా, వేగంగా జనంపై దాడి చేయకుండా లాక్‌డౌన్, కంటైన్మెంట్లను పెట్టారు. ఇలాగే లాక్‌డౌన్‌ను కొనసాగిస్తే అది మున్ముందు ఇంకా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తేయాలి. ముందుగా 20–45 ఏళ్లలోపు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని యువకులను పనుల్లోకి పంపాలి. ఆఫీసులకు, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలకు యువకులను వెళ్లనివ్వాలి. వారు తప్పకుండా వైరస్‌కు ఎక్స్‌పోజ్ కావాలి. వారికి పెద్దగా ముప్పు లేదని అంతర్జాతీయ నివేదికలే చెబుతున్నాయి. దీంతో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేసినా స్వైన్‌ఫ్లూ వైరస్‌కు అలవాటు పడినట్లే కరోనాకు అలవాటు పడగలం. లేకుంటే వచ్చే శీతాకాలంలో అది విజృంభించే అవకాశముంది.
యువకులు కరోనాకు ముందుగా ఎక్స్‌పోజ్ అయితే మెల్లమెల్లగా ఇతరులూ దానికి ఎక్స్‌పోజ్ అవుతారు. తద్వారా సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. వినోదం, సినిమాలు, క్రీడలు, మాల్స్ వంటి గుంపులుగా ఉండే ప్రాంతాలను ఇప్పుడే తెరవకూడదు. అలాగే ఆఫీసులకు అందరినీ ఒకేసారి కాకుండా వయసు, అవసరాల మేరకు షిఫ్టుల ప్రకారం వదిలిపెట్టాలి’అని ఆయన అభిప్రాయపడ్డారు. అవసరమైతే శని, ఆదివారాలు పూర్తిగా లాక్‌డౌన్ అమలు చేయాలని వైద్య శాఖకు చెందిన మరో సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. దశలవారీగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా లాక్‌డౌన్‌ను ఎత్తేయాలని రాష్ట్రంలోని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
చదవండి: జేబులో డబ్బులున్నా తిండికి తిప్పలు
Comments
Please login to add a commentAdd a comment