
బడి బస్సులపై నిఘా కట్టుదిట్టం
- ప్రారంభమైన ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ
- జూన్ నెలాఖరు వరకు రవాణావెబ్‌సైట్‌లో నిక్షిప్తం
- నిబంధనలు ఉల్లంఘిస్తే బస్సుల స్వాధీనం
సాక్షి, సిటీబ్యూరో: బడి పిల్లల భద్రతపై ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. డ్రైవర్ల అనుభవరాహిత్యం, సామర్థ్యం ఉన్న వాహనాలను ఏర్పాటు చేయడంలో విద్యాసంస్థల నిర్లక్ష్యం..ఫలితంగా తరచు ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించే దిశగా రవాణాశాఖ కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 10,052 బస్సుల పూర్తి వివరాలను రవాణాశాఖ వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇలా ఆర్టీఏ వెబ్‌సైట్ లో నమోదయ్యే వివరాల ఆధారంగా బస్సుల నిర్వహణ, పనితీరుపై ఆర్టీఏ నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తుంది. మెదక్ జిల్లా మాసాయిపేట దుర్ఘటన నేపథ్యంలో తీసుకున్న ఈ కీలక నిర్ణయం వల్ల డ్రైవర్లు, విద్యార్థులు, సహాయకుల వివరాలు, ఫొటోలు కూడా ఆర్టీఏ వద్ద నమోదై ఉంటాయి. అంతేకాకుండా విద్యా సంస్థ పేరు, విద్యాశాఖ నుంచి పొందిన అనుమతి కూడా నమోదు చేస్తున్నట్లు రంగారెడ్డిజిల్లా ఉపరవాణా కమిషనర్ ప్రవీణ్‌రావు ‘సాక్షి’కి చెప్పారు. తమ వద్ద నమోదైన వాహనాలకు మాత్రమే ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించి, పిల్లల కోసం వినియోగించేందుకు అనుమతినిస్తున్నామన్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోకుండా తిరిగే బస్సులను స్వాధీనం చేసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఈ నిబంధనలూ తప్పనిసరి...
బస్సు పసుపు రంగులో ఉండాలి. విద్యార్థులు బస్సులోకి ఎక్కడం, దిగడం డ్రైవర్‌కు స్పష్టంగా కనిపించే విధంగా కన్వెక్స్ క్రాస్ వ్యూ అద్దాలు అమర్చాలి.
- బస్సు ఇంజిన్ కంపార్ట్‌మెంట్‌లో ఒక అగ్నిమాపక యంత్రం అందుబాటులో ఉండాలి. అత్యవసర ద్వారం ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏర్పాటు చేయాలి.
- పాఠశాల/కళాశాల పేరు, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, పూర్తి చిరునామా బస్సుకు ఎడమవైపున ముందు భాగంలో స్పష్టంగా రాయాలి.
- నాలుగు వైపులా గాఢ పసుపు పచ్చని రంగుగల ఫ్లాపింగ్ లైట్లను ఏర్పాటు చేయాలి. పిల్లలు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు ఈ లైట్లు వెలుగుతూ ఉండాలి.
- ఫుట్‌బోర్డుపై మొదటి మెట్టు 325 ఎం.ఎం.ల ఎత్తుకు మించకుండా ఉండాలి. అన్ని మెట్లు జారకుండా ఉండే లోహంతో అమర్చాలి.
- లోపలికి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టుకొనేందుకు వీలుగా ముందరి తలుపు మెట్లకు సమాంతరంగా రైలింగ్ ఉండాలి.
- బస్సులో ప్రయాణించే విద్యార్థుల పేర్లు, తరగతులు, ఇళ్ల చిరునామాలు, ఎక్కాల్సిన, దిగాల్సిన వివరాలు బస్సులో ఉండాలి.
డ్రైవర్ల అర్హతలు ...
- డైవర్‌కు బస్సు డ్రైవింగ్‌లో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
- వయస్సు 60 ఏళ్లకు మించకూడదు. పాఠశాల యాజమాన్యం ప్రతి డ్రైవర్ ఆరోగ్య పట్టికను విధిగా నిర్వహించాలి.
- యాజమాన్యం తమ సొంత ఖర్చుతో డ్రైవర్లకు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తపోటు, షుగరు, కంటి పరీక్షలు నిర్వహించాలి.