సేవలు.. చాలిక!
మహబూబ్‌నగర్ వ్యవసాయం: ఆదర్శ రైతులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంసిద్ధం చేసింది. రైతులకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పంటలసాగు, సస్యరక్షణ చర్యలను తెలియజేసేందుకు నియమితులైన వీరంతా ఇక ఇంటిబాట పట్టనున్నారు. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో జిల్లా లో 2747మంది ఆదర్శరైతులపై వేటుపడనుంది. 2008లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదర్శరైతులను నియమించారు. రైతులకు అందుబాటులో ఉంటూ తగిన సమయంలో సూచనలు, సలహాలు ఇస్తున్న వీరికి ప్రభుత్వం వెయ్యి రూపాయల గౌరవవేతనం ఇస్తోంది.
ఇలా నెలకు రూ.27.47లక్షల చొప్పున ఏడాదికి రూ.3.29 కోట్లను వీరికి కోసం చెల్లిస్తున్నారు. మొదట్లో నెలనెలా ఇచ్చిన గౌరవవేతనాన్ని ఆ తరువాత ఆరేడు నెలల కు ఒకమారు ఇస్తున్నారు. వీరిని జిల్లా, డివి జన్ స్థాయి వ్యవసాయశాఖ అధికారు లు ఎంపికచేసేవారు. గ్రామాల్లో 250 మంది రైతులకు ఒక ఆదర్శరైతును నియమించారు. కాగా, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ రైతుల నుంచి ఎలాంటి ఉపయోగం లేదని, రాజకీయ పలుకుబడి కలిగిన ఆదర్శరైతులు వ్యవసాయశాఖ అధికారులపై పెత్త నం, అజమాయిషీ చెలాయిస్తున్నరని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచా రం. పంట నష్టపరిహారం, రుణమాఫీ విషయాల్లోనూ ఆదర్శరైతులు అధికారులను తప్పుదోవపట్టించారనే నెపం తో తొలగింపునకు సిద్ధమయ్యారు.
ఆదర్శ రైతుల విధులు
గ్రామాల్లో రైతులకు ఎప్పటికప్పుడు వ్యవసాయంలో వచ్చిన నూతన పద్ధతులు, మార్పులను తెలియజేయడం లో కీలకంగా వ్యవహరిస్తారు.ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాలను అన్నదాతలకు చేరవేయడంలో ప్రభుత్వం, రైతులకు మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరిస్తారు. పొలంబడి, సీడ్ విలేజ్ పథకాల ద్వారా రైతులకు క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తారు. అలాగే ఇన్‌పుట్ సబ్సి డీ పంపిణీ, పంటల బీమా, విత్తనాలు, ఎరువుల పంపిణీ వంటి కార్యక్రమాల్లో అధికారులకు చేదోడువాదోడుగా ఉం టారు. ఆదర్శ రైతులను తొలగించడంతో రైతుల దరికి ప్రభుత్వ పథకాలు చేరే అవకాశం లేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.