శ్రవణం.. దంతక్రాంతి! | Government to treat hospitals for dental examinations | Sakshi
Sakshi News home page

శ్రవణం.. దంతక్రాంతి!

Published Sat, Jan 12 2019 3:14 AM | Last Updated on Sat, Jan 12 2019 3:15 AM

Government to treat hospitals for dental examinations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల నుంచి ఉచితంగా ప్రారంభించాలని భావిస్తున్న చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ) పరీక్షలకు ‘శ్రవణం’అని, దంత వైద్య పరీక్షలకు ‘దంతక్రాంతి’అని పేర్లు పెట్టాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపనున్నట్లు తెలిసింది. పలు దఫాలుగా మేధోమథ నం అనంతరం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈ పేర్లను ప్రతిపాదిస్తున్నట్లు తెలియవచ్చింది. కంటి వైద్య పరీక్షలకు ‘కంటి వెలుగు’అని, గర్భి ణులకు ప్రోత్సాహక సొమ్ము, కిట్ల పంపిణీకి ‘కేసీఆర్‌ కిట్‌’ అని ప్రభుత్వం పేరు పెట్టడం తెలి సిందే. కేసీఆర్‌ కిట్‌ పథకానికి తొలుత ‘అమ్మ ఒడి’అని పేరు పెట్టాలని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ప్రతిపాదించగా సీఎం ఈ పథకానికి కేసీఆర్‌ కిట్‌గా పేరు ఖరారు చేశారు. 

ఉచితంగా వినికిడి యంత్రాలు... 
కంటి వెలుగు పథకం కింద ప్రజలకు రీడింగ్‌ గ్లాసులు, చత్వారీ కళ్లద్దాలను ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం... ఈఎన్‌టీ, దంత వైద్య పరీక్షలు చేయించుకున్న వారిలో ఎవరికైనా ఉపకరణాలు ఇవ్వాల్సి వస్తే వాటిని కూడా ఉచితంగానే ఇవ్వాలని యోచిస్తోంది. వినికిడి లోపంతో బాధపడే వారికి వినికిడి యంత్రం ఉచితంగానే ఇవ్వాలని భావిస్తున్నట్లు ఒక ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం ఆ పరికరం ధర బహిరంగ మార్కెట్లో రూ.2,500 నుంచి రూ. 3 వేల వరకు ఉంది. అలాగే సాధారణ వినికిడి పరికరాలు పెట్టుకోవడాన్ని ఇష్టపడని వారికి కొత్తరకం పరికరాలను కూడా సరఫరా చేసే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

కొత్త రకం వినికిడి పరికరాలు చెవికి బ్లూటూత్‌ పెట్టినట్లుగానే ఉంటాయి. వాటి ధర రూ.3,500పైగానే ఉండొచ్చంటున్నారు. సాధారణంగా చెవి పరీక్షలు చేస్తే ఒక శాతం నుంచి రెండు శాతం మందికి వినికిడి లోపం ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఆ ప్రకారం రాష్ట్రంలో లక్షన్నర మంది వినికిడి లోపంతో బాధపడుతుండవచ్చని అంచనా. వారందరికీ వినికిడి యంత్రాలు ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రంలో అందరికీ ఈఎన్‌టీ, దంత వైద్య పరీక్షలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నా అందుకు సంబంధించిన కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటివరకు తేదీలు ఖరారు కాకపోగా మార్గదర్శకాలు కూడా వెలువడలేదు. పైపెచ్చు ఏర్పాట్ల విషయంలో ఇంకా అధికారులకు ఎటువంటి స్పష్టత లేదు.

ఆరోగ్యశ్రీ కింద కాక్లియర్‌ ఆపరేషన్లు! 
చెవికి సంబంధించిన కాక్లియర్‌ ఆపరేషన్‌ అత్యంత ఖరీదైన వ్యవహారం. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇందుకు రూ.6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అటువంటి సమస్య ఉన్న వారిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ఉచితంగానే ఆపరేషన్లు చేయాలని సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కంటి వెలుగు కింద చేసే క్యాటరాక్ట్‌ ఆపరేషన్లను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అంధత్వ నివారణ పథకం నిధుల ద్వారా చేస్తున్నారు. దీంతో కాక్లియర్‌ ఆపరేషన్లనూ అదే తరహాలో ఏదో ఒక పథకం పరిధిలోకి తీసుకొచ్చి చేయాలనేది సర్కారు ఉద్దేశంగా కనిపిస్తోంది. అలాగే గొంతు కేన్సర్ల చికిత్సలను కూడా ఆరోగ్యశ్రీ ద్వారా లేదా ఇతరత్రా పద్ధతుల ద్వారా చేయాలని భావిస్తోంది.

ఇక దంత సమస్యలకు సంబంధించి పుచ్చిపోయిన పళ్లను తీయడం, కొత్త వాటిని అమర్చడం వంటి చికిత్సలను గ్రామాల్లో చేసే పరిస్థితి ఉండదు. దీంతో వాటన్నింటినీ నిర్దేశించిన ఆసుపత్రులకు రిఫర్‌ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఆయా ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇటీవల రెండు దశల్లో ఈఎన్‌టీ, దంత పరీక్షల పైలట్‌ ప్రాజెక్టును కొన్ని జిల్లాల్లో నిర్వహించారు. అయితే కొన్నిచోట్ల కేవలం రిఫర్‌ చేయడంపైనే దృష్టిపెట్టగా మరికొన్నిచోట్ల గ్రామాల్లోనే సమగ్రంగా చికిత్సలు చేసినట్లు తెలిసింది.

ఇంకా మార్గదర్శకాలు ఖరారు కాలేదు 
ఈఎన్‌టీ, దంత పరీక్షలకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి మార్గదర్శకాలు ఖరారు కాలేదు. ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాక ఆ ప్రకారం నడుచుకుంటాం. ఎప్పటి నుంచి ప్రారంభించాలన్నదీ కూడా ఖరారు చేయలేదు. కంటి వెలుగు కార్యక్రమం వచ్చే నెల పూర్తయ్యే అవకాశముంది. 
– యోగితా రాణా,
ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement