స్వైన్..భయం
సిటీబ్యూరో : నగర వాసులను స్వైన్ భయం వెంటాడుతోంది... ఈ వైరస్ బారిన పడి మృతి చెందిన వారు.. రోజు రోజుకూ పెరుగుతున్న బాధితుల సంఖ్యను చూసి సిటిజన్లు హడలిపోతున్నారు. ఇళ్లు వదిలి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. దీని ప్రభావం పర్యాటకులపైనా పడింది. నగరంలోని పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల రాక భారీగా తగ్గిపోయింది. నిత్యం జనాలతో కిటకిటలాగే లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్స్, లేజర్ షోలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. సాధారణ రోజుల్లో లేజర్ షోకు నిత్యం 1500 మంది సందర్శకులు వస్తుంటారు. అదే శని, ఆదివారాల్లో అయితే... ఆ సఖ్యం 2000లకు పైగానే ఉంటోంది. సాగర్ బోటింగ్, సంజీవయ పార్కు వంటివాటికి సెలవు రోజుల్లో జనం పోటెత్తుతుంటారు. వారం రోజులుగా రద్దీ క్రమక్రమంగా తగ్గుతోందని బీపీపీ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
రైతుబజార్లలో భయం భయం
కూరగాయలు కోసం రైతుబజార్‌కు వెళ్లిన వినియోగదారులు భయం భయంతో గడుపుతున్నారు. ప్రత్యేకించి మెహిదీపట్నం, కూకట్పల్లి, ఎర్రగడ్డ రైతుబజార్లు ఇరుకిరుకుగా ఉండడంతో అక్కడ ఎవరు తుమ్మినా, ముక్కుచీదినా పక్కవారు ఉలిక్కిపడుతున్నారు. ఎక్కువ మంది వినియోగదారులు మాస్క్‌లు ధరించి వస్తున్నారు.
స్కూళ్లలో ఆంక్షలు
విద్యార్థులు విధిగా మాస్క్ ధరించి స్కూల్‌కు రావాలని పలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆంక్షలు విధించాయి. మాస్క్ ధరించని విద్యార్థులను వెనక్కు పంపేస్తున్నారు. తొలిరోజు హెచ్చరిక జారీ చేసి మరునాడు మాస్క్‌తో రాకపోతే ఆ విద్యార్థులకి ఫైన్ విధించేలా చర్యలు తీసుకొన్నట్లు సమాచారం.
అమ్మో...హైదరాబాద్
సికింద్రాబాద్: హైదరాబాద్ పేరు చెబితే ప్రజలు హడలి పోతున్నారు. ఇక్కడ ఉండాలన్నా.. పొరుగు ప్రాంతాల నుంచి ఇక్కడకు రావాలన్నా జంకుతున్నారు. స్వైన్ ఫ్లూ వైరస్ విజృంభణే ఇందుకు కారణం .. సిటీలో స్వైన్ మహమ్మారి స్వైర విహారం చేస్తుండడంతో భయంతో నగర వాసులు సొంతూరి బాట పడుతున్నారు.. అలాగే సిటీకి వచ్చే వారి సంఖ్య కూడా తగ్గింది. మూడు రోజులుగా సిటీ నుంచి బయటకు వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోరోజువారీ ప్రయాణికుల కన్నా శనివారం 20 వేల పైచిలుకు ప్రయాణికులు ఇక్కడినుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్తున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు. శనివారం నగరానికి చేరుకున్న రైళ్లలో ప్రయాణికుల సంఖ్య దాదాపు నలభై వేలకు తగ్గినట్టు అధికారులు చెపుతున్నారు.మహాత్మాగాంధీ , జూబ్లీ బస్టేషన్లు రద్దీగా కనిపించాయి. నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది.
ఫ్లూ..లూఠీ
సిటీబ్యూరో: గ్రేటర్ లో చలి తీవ్రత త గ్గుముఖం పట్టినా స్వైన్‌ఫ్లూ మాత్రం ఇంకా విజృంభిస్తూనే ఉంది. రోజులకు సగటున 30-35 పాజిటీవ్ కేసులు నమోదు అవుతుండగా, అనుమానితుల సంఖ్య లెక్కేలేదు. ఫ్లూను బూచిగా చూపి పలు కార్పొరేట్ ఆస్పత్రులు రోగులను దోచేస్తున్నాయి. సాధారణ జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన రోగిని కూడా ఫ్లూ జాబితాలో చేర్చి అవసరం లేకపోయినా పరీక్షలు చేయిస్తున్నారు. వ్యాధి తీవ్రత నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్వైన్‌ఫ్లూను ఆరోగ్య శ్రీ జాబితాలో చేర్చినప్పటికీ..పలు కార్పొరేట్ యాజమాన్యాలు చికిత్స చేసేందుకు నిరాకరిస్తున్నట్టు తెలిసింది. వైద్య ఖర్చులు భరించలేని వారు ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లోని ఫ్లూ నోడల్ కేంద్రాలకు వస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడమే ఇందుకు కారణం. స్వైన్‌ఫ్లూను బూచిగా చూపించి అవసరం లేనివారికి వాక్సిన్ అమ్ముతున్నాయి. వాక్సిన్ కోసం ప్రజలు క్యూ కడుతుండడంతో ఇదే అదనుగా భావించిన యాజమాన్యాలు మందుల ధరలను అమాంతం పెంచేశాయి. రూ. 5 విలువ చేస్తే మాస్కును రూ. 50కి అమ్ముతుండటం విశేషం. ఇక నాలుగు లేయర్లతో తయారు చేసిన ఎన్-95 మాస్క్ ధర రూ.100 చేశారు. ఎంఆర్పీకి మించి అమ్మకూడదనే నిబంధన ఉన్నా..డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
299 పాజిటివ్ కేసులు
తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 893 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షల కోసం ఐపీఎంకు పంపగా, వీరిలో శనివారం మధ్యాహ్నం వరకు 299 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారు. గాంధీ ఆస్పత్రిలో 10 మంది మృతి చెందగా, వీరిలో అత్యధికులు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొంది చివరి క్షణంలో ఇక్కడకు వస్తున్నారు. వ్యాధి తీవ్రత పెరిగి చనిపోతున్నారు. దీనికి తమను బాధ్యత చేస్తుండడం ఏమిటని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లోని స్వైన్‌ఫ్లూ నోడల్ ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.