ఎదులాపురం : కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నా అవి కార్మికుల దరి చేరడం లేదు. పర్యవేక్షించే వారు కరువవడంతో కొన్నేళ్లుగా పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. జిల్లాలోని పలుకార్మిక శాఖ కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఉంది. కీలకమైన కార్మిక శాఖ సహాయ కమిషనర్‌లతోపాటు కింది స్థాయి ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
జిల్లా వ్యాప్తంగా కార్మిక శాఖ కార్యాలయాలు 8 ఉన్నాయి. జిల్లా కేంద్రంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్(డీసీఎల్)తోపాటు సహాయ కార్మిక కమిషనర్, ఇద్దరు లేబర్ ఆఫీసర్‌లు ఉండాలి. అదే విధంగా తూర్పు జిల్లా పరిధిలో మంచిర్యాలకు సహాయ కార్మిక శాఖ కమిషనర్(ఏసీఎల్), ఇద్దరు కార్మిక శాఖ అధికారి పోస్టులు ఉన్నాయి. ఇచ్చోడ, నిర్మల్, భైంసా, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, ఉట్నూర్‌లో కార్మిక శాఖ కార్యాలయాలున్నాయి. ఈ కార్యాలయాల్లో కార్మిక శాఖ అధికారులు విధులు నిర్వహిస్తారు.
ఖాళీగా పోస్టులు
పలు కార్యాలయాల్లో పోస్టులు ఖాళీగా ఉండడంతో క్షేత్రస్థాయిలో కార్మిక సంక్షేమ పథకాల గురించి కార్మికులకు అవగాహన కరువవుతోంది. ఆదిలాబాద్, మంచిర్యాల డి విజన్ పరిధిల్లో కీలకమైన సహాయ కార్మిక శాఖ కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆదిలాబాద్ సహాయ కార్మిక శాఖ కమిషనర్ పోస్టు జులై 1, 2012 నుంచి భర్తీ కాకపోగా, మంచిర్యాల సహాయ కార్మిక శాఖ కమిషనర్ పోస్టు ఆగస్టు 1, 2013 నుంచి భర్తీకి నోచుకోవట్లేదు. కార్మిక సంక్షేమం కోసం కీలకంగా భావించే ఈ పోస్టులతోపాటు బెల్లంపల్లి, ఉట్నూర్‌లలో సహాయ కార్మిక శాఖ అధికారుల(ఏఎల్‌వో) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
బెల్లంపల్లి కార్యాలయంలో ఆగస్టు 27, 2013 నుంచి, ఉట్నూర్‌లో సెప్టెంబర్ 3, 2013 నుంచి ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఇచ్చోడ, భైంసాలలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇచ్చోడ కార్యాలయంలో జులై 16, 2012 నుంచి, భైంసా కార్యాలయంలో అక్టోబర్ 14, 2013 నుంచి ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
క్షేత్రస్థాయిలో కార్మికులకు అవగాహన కరువు
జిల్లాలో ప్రాధాన్యత గల రెండు సహాయ కార్మిక శాఖ కమిషనర్ పోస్టులు, బెల్లంపల్లి, ఉట్నూర్, ఇచ్చోడ, భైంసా కార్మిక శాఖ కార్యాలయాల్లో ఉద్యోగుల పోస్టులు ఖాళీగా ఉండడంతో కార్యాలయాల్లో ఉన్న మిగితా సిబ్బంది అదనపు పనులు చేయాల్సి వస్తోంది. దీంతో వారిపై పనిభారం ఎక్కువవుతోంది. అధికారులు కార్యాలయాలకే పరిమితం అవుతుండడంతో క్షేత్ర స్థాయిలో కార్మికులకు అవగాహన కరువవుతోంది.
ఆయా అధికారుల పరిధిలోని పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ కార్మికులకు ప్రయోజనాలు కలిగేలా చుడాలి. కార్మిక శాఖలో పోస్టులు ఖాళీగా ఉండడంతో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ, కార్మిక సంక్షేమ పథకాల ప్రచారం కరువై కార్మికులకు సరైన న్యాయం జరగడం లేదు. బాల కార్మికులను పట్టించుకున్న దాఖలాలు లేవు. హోటళ్లు, దుకాణాలు తదితర వ్యాపార ప్రదేశాల్లో బాల కార్మికులు నిత్యం దర్శనమిస్తున్నారు. బాల కార్మికులను నివారించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది.
ప్రభుత్వం పట్టించుకోవాలి
కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కార్మిక వర్గాలు పేర్కొంటున్నాయి. పని భారం ఎక్కువగా ఉండడంతో కార్యాలయాల్లోనే విధులు నిర్వహించాల్సి వస్తోందని ఉద్యోగులు తెలుపుతున్నారు. ప్రభుత్వం ఖాళీలను పూర్తి స్థాయిలో భర్తీ చేసి కార్మికుల ప్రయోజనాలను కాపాడాలి. సంక్షేమ పథకాలు కార్మికులకు అందేలా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులకు ఉంది.
కార్మిక సం‘క్షామం’
Published Wed, Sep 3 2014 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 PM
Advertisement
Advertisement