ధాన్యం కొనుగోళ్లకు స్థలం సమస్య
స్టాక్‌ను దించుకోకుండా చేతులెత్తేస్తున్న మిల్లర్లు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు
ఉచితంగా మార్కెట్ గోదాముల కేటాయింపు
సాక్షి, నిజామాబాద్ : ధాన్యం కొనుగోళ్లకు కొత్త సమస్య వచ్చి పడింది. వర్షాలు కురవడం ప్రారంభం కావడంతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ దాచాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. కేంద్రాల నుంచి ధాన్యాన్ని వెంట వెంటనే రైస్‌మిల్లులకు తరలిస్తుంటే మిల్లర్లు తమ మిల్లుల్లో స్థలం లేదని ధాన్యం లారీల నుంచి స్టాక్‌ను దించుకోవడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం, ఈదురు గాలుల నుంచి ధాన్యాన్ని రక్షించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుండటంతో జిల్లా అధికారయంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. జిల్లాలో అందుబాటులో ఉన్న గోదాముల కోసం అన్వేషిస్తున్నారు.
ఆరు వేల మెట్రిక్ టన్నులు..
జిల్లాలో ఇప్పటి వరకు 3.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ప్రస్తుతం రోజుకు ఏడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వస్తోంది. సీజను ప్రారంభంలో రోజుకు 13 వేల మెట్రిక్ టన్నులు వచ్చేది. కాంటాలైన ధాన్యాన్ని వెంట వెంటనే దించుకోకపోవడంతో
కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం సుమారు ఆరు నుంచి ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయాయి. వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో మిల్లులో ఆరు బయట నిల్వ చేయడానికి మిల్లర్లు జంకుతున్నారు. శని, ఆది, సోమ, మంగళవారాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో మిల్లర్లు ధాన్యం దించుకోవడంలో జాప్యం చేస్తున్నారు.
ఉచితంగా మార్కెట్ గోదాములు..
ఒక్కసారిగా స్థలం సమస్య ఏర్పడటంతో జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. ధాన్యం నిల్వలను ఉంచేందుకు అవసరమైన గోదాముల కోసం అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా బోధన్‌లో సుమారు 1,800 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన మార్కెట్ కమిటీ గోదాముల్లో ధాన్యాన్ని నిల్వ ఉంచాలని నిర్ణయించారు. అలాగే నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఖాళీగా ఉన్న గోదాముల్లో కూడా ధాన్యం నిల్వ చేయాలని భావిస్తున్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ గోదాములను రెండు నెలల పాటు ఉచితంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
సీడబ్ల్యూసీ అధికారులతో మాట్లాడుతున్నాం
వర్షాలు ప్రారంభం కావడంతో ఏర్పడిన స్థలం సమస్య పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము. నిజామాబాద్ దుబ్బలో ఉన్న సీడబ్ల్యూసీ గోదాములను వినియోగించుకోవాలని రైస్‌మిల్లులకు సూచిస్తున్నాము. ఇక్కడ 18 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములున్నాయి. అలాగే సారంగపూర్‌లోని సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ గోదాముల్లో కూడా ఐదు వేల మెట్రిక్ టన్నుల చొప్పున నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంది. వీటిని వినియోగించుకోవాలని భావిస్తున్నాము.
- హరికృష్ణ, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్
పది రోజులు దాటుతోంది..
ధాన్యం తెచ్చి పది రోజులు దాటింది. తూకం వేసి కూడా మూడు రోజులవుతోంది. కానీ ధాన్యం తరలించడం లేదు. దీంతో 600 బస్తాలను తడవకుండా కాపాడటం కష్టంగా ఉంది. అధికారులు స్పందించి వెంటవెంటనే ధాన్యం తరలించేలా చూడాలి.
- బైరి చిన్న గంగాధర్, ఇందల్వాయి