మిడ్జిల్‌కు చెందిన రైతు ఆంజనేయులు ఆదివారం వరి విక్రయించేందుకు ధాన్యాన్ని బాదేపల్లి మార్కెట్‌కు తీసుకొచ్చాడు. పరిశీలించిన వ్యాపారులు టెండర్‌లో ధరలువేశారు. కమీషన్ ఏజెంట్ సదరు రైతుకు ధర ఎంత నిర్ణయించారో తెలిపాడు. ఇది విన్న ఆంజనేయులు ఒక్కసారిగా కంగుతిన్నాడు. క్వింటాలుకు రూ.920గా నిర్ణయించినట్లు చెప్పడంతో అతడు విస్తుపోయాడు. ఇదేం ధర క్వింటాలు ధాన్యం అమ్మితే పిండి సంచి కూడా రావడం లేదు ఎట్లా? అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదీ ఒక ఆంజనేయులుకు ఎదురైన సమస్యే కాదు.. ఇక్కడికి ధాన్యం తీసుకొస్తున్న ప్రతీ రైతుది.
జడ్చర్ల, న్యూస్‌లైన్: ఆరుగాలం శ్రమించిన రైతులకు చివరకు చిల్లిగవ్వ మిగలడం లేదు. అష్టకష్టాలు పడి పం డించిన ధాన్యాన్ని మార్కెట్ యార్డులో విక్రయించబోతే మద్దతుధరలు రాక దిగాలు తీసే ప రిస్థితి దాపురించింది. దీంతో అన్నదాతల పరి స్థితి అగమ్యగోచరంగా మారింది. కమీషన్ ఏ జెంట్లు, వ్యాపారులు కుమ్మక్కయ్యారు. సుదూ ర ప్రాంతాల నుంచి ఎంతో ఆశతో ఆశించిన ధ రలు వస్తాయని ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతుల ను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదేమంటే సర కు నాణ్యతగా లేదన్న సాకులు చూపుతున్నారు.
రెండుమూడు రోజులు మార్కెట్ యార్డులోనే పడిగాపులు గాసి ధాన్యాన్ని ఎలాంటి తేమ లేకుండా ఎండబెట్టినా అవే ధరలు లభిస్తున్నాయని రైతన్నలు వాపోతున్నారు. అదేమంటే ధర తక్కువగా అనిపిస్తే మంచి ధరలు వచ్చేదాక ఆగండి అంటూ..! అటు కమీషన్ ఏజెంట్లు ఇటు వ్యాపారులు రైతులకు నచ్చజెప్తున్నారు. రెండు మూడు రోజులు ఆగినా మంచి ధరలు లభిస్తాయనుకుంటే అదీలేదు. చివరికి ఎదురుచూడలేక ఎంతకో అంతకు అమ్ముకుపోయిన సందర్భాలు కోకొల్లలు. ఇలా రైతుల కష్టాన్ని నిలువునా దోచుకుంటున్నా అడిగే దిక్కులేదు. ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.1310 ఉన్నా ఆ ధర ఎక్కడా మచ్చుకైనా కనిపించడం లేదు.
వ్యాపారుల రింగ్
బాదేపల్లి మార్కెట్ యార్డుకు ప్రతిరోజు ఐదు నుంచి ఎనిమిది వేల బస్తాల ధాన్యం విక్రయానికి వస్తుంది. అయితే ఇక్కడ కొనుగోలుదారులు మాత్రం ఒకరిద్దరే ఉండటంతో వారి ఇష్టానుసారంగా కొనుగోళ్లు జరుపుతున్నారు. అదేమంటే తాము ధాన్యమే కొనుగోలు చేయమని.. ఏం చేసుకుంటారో చేసుకొండని.. భీష్మించుకుకూర్చొనే పరిస్థితి ఏర్పడింది. దీంతో అయ్యా! అబ్బా!! అంటూ బతిమిలాడే పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా వ్యాపారులు తమకు నచ్చిన ధరలకే కొనుగోలు చేస్తున్నారు. కాగా, రబీ సీజన్‌లో ధాన్యం పెద్దమొత్తంలో మార్కెట్‌కు వస్తున్నా.. ప్రభుత్వ కొనుగోళ్లు మాత్రం జాడేలేకుండా పోయాయి. భారత ఆహార సంస్థ, రాష్ట్ర పౌరసరఫరాల శాఖల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు మద్దతు ధరలు కల్పిస్తారని ఆశించిన రైతులకు చివరికి నిరాశే మిగిలింది.
దళారులకు వ్యాపారుల అండ
అన్నదాతకు అండగా ఉండాల్సిన స్థానిక మార్కెట్‌యార్డు అధికారులు దళారులకు వంత పాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మార్కెట్‌కు ధాన్యం తెచ్చిన రైతుకు భరోసా కల్పించలేని నిస్సహాయ స్థితిలో మార్కెట్‌యార్డు యంత్రాంగం పనిచేస్తోంది. వర్షం వచ్చి ధాన్యం కొట్టుకుపోయినా.. ధరలు తక్కువగా వచ్చినా..తూకాల్లో తేడాలు వచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు. మద్దతుధర ఎందుకు రావడం లేదని అధికారులు ఏనాడూ విచారించలేదు. ‘కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు కుమ్మక్కయ్యారు. అధికారులు ఎంత మాత్రం పట్టించుకోవడంలేదు. ప్రభుత్వం స్పందించకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం’ అని బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు కరకల కృష్ణారెడ్డి హెచ్చరించారు.
రూ.960 ధర వచ్చింది
ఎంతో కష్టపడి సాగుచేసి పండించిన ధాన్యాన్ని అమ్ముకుపోదామని బాదేపల్లి మార్కెట్‌కు శుక్రవారం తీసుకువచ్చాను. ధాన్యాన్ని మంచిగా ఆరబెట్టాను. కానీ వ్యాపారులు ధరను మాత్రం రూ.960గా నిర్ణయించారు. దీంతో మంచి ధర కోసం ఆగాను. కానీ ఇక్కడికి వచ్చి ఇప్పటికే మూడురోజులైంది. ఇక ఎంత ధర వచ్చినా అమ్ముకుపోద్దామనే ఆలోచనతో ఉన్నా..
- శ్రీకాంత్‌రెడ్డి, ఖానాపూర్, నవాబ్‌పేట(మం)
రైతులను బాధ ను అర్థం చేసుకోవాలి
బాదేపల్లి మార్కెట్‌లో రైతులను పట్టించుకునే వారే కరువయ్యారు. మద్దతు ధరలు రాక అన్నదాతలు విలవిల్లాడుతున్నారు. వ్యాపారులు కుమ్మక్కవుతున్నారు. దీంతో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఇప్పటికైనా రైతులకు న్యాయం చేసేందుకు అధికారులు చొరవచూపాలి.
-రమేశ్‌రెడ్డి, మాజీ యార్డు చైర్మన్, బాదేపల్లి
ధాన్యం.. దైన్యం
Published Mon, May 26 2014 2:38 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
Advertisement
Advertisement