ఆదిలాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఆదిలాబాద్ జిల్లాలో ఘన స్వాగతం లభించింది. కిసాన్ సందేశ్’ యాత్రలో భాగంగా నిర్మల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేసేందుకు వచ్చిన యువనేతకు పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా రాహుల్‌గాంధీ నిర్మల్‌కు చేరుకుంటారని తొలుత నిర్ణయించినప్పటికీ గురువారం మధ్యాహ్నం పర్యటనలో స్వల్ప మార్పు జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన రాహుల్ అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నిర్మల్‌కు చేరుకున్నారు. రాత్రి 8.40 గంటల ప్రాంతంలో రాష్ట్ర సరిహద్దుల్లోని తానూరు మండలం బేల్ తరోడా మీదుగా తెలంగాణలోకి ప్రవేశించారు. మార్గమధ్యంలో భైంసా నియోజకవర్గ నాయకుడు నారాయణరావు పటేల్ నివాసానికి వెళ్లిన రాహుల్ కొన్ని నిమిషాల్లోనే బయలుదేరి రాత్రి పది గంటలకు నిర్మల్‌కు చేరుకున్నారు. నేరుగా మయూర్ ఇన్ హోటల్‌కు వెళ్లారు.
అక్కడ కాంగ్రెస్ శ్రేణులు రాహుల్‌కు ఘనస్వాగతం పలికారు. పెద్దఎత్తున నినాదాలు చేశారు. నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా హోటల్ వద్దకు రావడంతో ఆ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వారంతా రాహుల్‌ను కలిసేందుకు పోటీపడటంతో ఎస్పీజీ పోలీసులకు, నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఈ తరుణంలో హోటల్ రెయిలింగ్ విరిగిపోవడంతో యువజన కాంగ్రెస్ నేతలు వంశీచందర్‌రెడ్డి, భార్గవ్‌దేశ్‌పాండే సహా పలువురు నాయకులు మెట్ల వద్ద పడిపోయారు. కాగా, హోటల్‌లోనే రాష్ట్ర ముఖ్యనాయకులతో రాహుల్ భేటీ అయ్యారు. శుక్రవారం నిర్వహించే పాదయాత్రపై చర్చించారు. రాత్రి అక్కడే బస చేశారు. హోటల్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మీడియా ప్రతినిధులకు పోలీసులు ప్రత్యేకంగా పాసులు జారీ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించడంలో భాగంగా రాహుల్ గాంధీ శుక్రవారం పాదయాత్ర చేపట్టనున్నారు.
రాహుల్‌కు ఘన స్వాగతం...
Published Fri, May 15 2015 12:15 AM | Last Updated on Sat, Aug 11 2018 7:56 PM
Advertisement