నిర్మల్‌లో రాహుల్ గాంధీ
* రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ యువనేత
* స్థానిక హోటల్‌లోనే బస, ముఖ్య నేతలతో సమావేశం
*నేడు లక్ష్మణచాంద, మామడ మండలాల్లో పాదయాత్ర
* ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరామర్శ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఆదిలాబాద్ జిల్లాలో ఘన స్వాగతం లభించింది. ‘కిసాన్ సందేశ్’ యాత్రలో భాగంగా నిర్మల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేసేందుకు వచ్చిన యువనేతకు పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా రాహుల్ నిర్మల్‌కు చేరుకుంటారని తొలుత నిర్ణయించినప్పటికీ గురువారం మధ్యాహ్నం పర్యటనలో స్వల్ప మార్పు జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన రాహుల్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నిర్మల్‌కు చేరుకున్నారు. రాత్రి 8.40 గంటల ప్రాంతంలో రాష్ట్ర సరిహద్దుల్లోని తానూరు మండలం బేల్ తరోడా మీదుగా తెలంగాణలోకి ప్రవేశించారు.
మార్గమధ్యంలో భైంసా నియోజకవర్గ నాయకుడు నారాయణరావు పటేల్ నివాసానికి వెళ్లిన రాహుల్ కొన్ని నిమిషాల్లోనే బయలుదేరి రాత్రి పది గంటలకు నిర్మల్ చేరుకుని నేరుగా మయూర్ ఇన్ హోటల్‌కు వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ శ్రేణులు రాహుల్‌కు ఘనస్వాగతం పలికాయి. నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా హోటల్ వద్దకు రావడంతో ఆ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వారంతా రాహుల్‌ను కలిసేందుకు పోటీపడటంతో ఎస్పీజీ పోలీసులకు, నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఈ తరుణంలో హోటల్ రెయిలింగ్ విరిగిపోవడంతో యువజన కాంగ్రెస్ నేతలు వంశీచందర్‌రెడ్డి, భార్గవ్‌దేశ్‌పాండే సహా పలువురు నాయకులు మెట్ల వద్ద పడిపోయారు. కాగా, హోటల్‌లోనే రాష్ట్ర ముఖ్యనేతలతో రాహుల్ భేటీ అయ్యారు. శుక్రవారం నిర్వహించే పాదయాత్రపై చర్చించారు. రాత్రి అక్కడే బస చేశారు. హోటల్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మీడియా ప్రతినిధులకు పోలీసులు ప్రత్యేక పాసులు జారీ చేశారు.
‘గ్రేటర్’ శ్రేణుల్లో నిరాశ
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌కు రాకపోవడం కాంగ్రెస్ పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. రాహుల్‌గాంధీ గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుని, రోడ్డు మార్గాన నిర్మల్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే షెడ్యూల్‌లో మార్పు కార ణంగా రాహుల్ హైదరాబాద్‌కు బదులు నేరుగా మహారాష్ట్రలోని నాందేడ్‌కు వచ్చి అక్కడి నుంచి నిర్మల్‌కు చేరుకున్నారు. తిరుగుప్రయాణంలోనూ ఆయన హైదరాబాద్‌కు రాకుండా నాందేడ్ నుంచే ఢిల్లీకి చేరుకోనున్నారు. అత్యవసర భేటీ కారణంగా రాహుల్ హైదరాబాద్‌కు రావడం లేదని, నేరుగా నాందేడ్‌కు చేరుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాజకీయ కార్యక్రమంపై తొలిసారి రాష్ట్రానికి వస్తున్న రాహుల్‌గాంధీ పర్యటనను పార్టీ బలోపేతానికి, కేడర్‌లో ఉత్సాహాన్ని నింపేందుకు ఉపయోగించుకోవాలని రాష్ట్ర ముఖ్యనేతలు ఆశించారు. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు రాహుల్ పర్యటన ‘బూస్ట్’గా పనికొస్తుందని భావించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల మీదుగా మేడ్చల్ వరకు రాహుల్ రోడ్డుషోగా ఉపయోగించుకోవాలని ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్ర, నగర పార్టీ ముఖ్యనేతలంతా ఆయా ప్రాంతాల్లో రహదారులను ఫ్లెక్సీలు, కాంగ్రెస్ జెండాలతో నింపేశారు. అయితే చివరి నిమిషంలో మార్పు చోటుచేసుకుని హైదరాబాద్ రాకుండానే రాహుల్ పర్యటన ముగిసే పరిస్థితి రావడంతో నాయకులు, కార్యకర్తలు ఉస్సూరుమంటున్నారు.
నేడు పాదయాత్ర
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించడంలో భాగంగా రాహుల్ గాంధీ శుక్రవారం పాదయాత్ర చేపట్టనున్నారు. ఉదయం 7 గంటలకు మామడ మండలం కొరిటికల్ నుంచి ప్రారంభించి లక్ష్మణచాంద మండలం వడ్యాల్ వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర ఆయన నడవనున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. స్థానిక రైతులతో మాట్లాడతారు. కాగా, రాహుల్ పర్యటన నేపథ్యంలో ముఖ్య నేతలంతా ముందుగానే నిర్మల్‌కు చేరుకుని రోజంతా ఏర్పాట్లను పరిశీలించారు. ఏఐసీసీ నేతలు ఆర్.సి.కుంతియా, దిగ్విజయ్‌సింగ్, టీపీసీసీ నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్క, దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, శ్రీధర్‌బాబు తదితర నాయకులంతా సందడి చేశారు.