సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పక్కా ప్రణాళికతో నవ తెలంగాణ నిర్మాణానికి, జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న ప్రకటించారు. తెలంగాణలోని పల్లెలన్నింటినీ ఐదేళ్ల వ్యవధిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి స్వయం సమృద్ధిని సాధించే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని అన్నారు. 68వ స్వాతంత్య్ర వేడుకలు శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా జరిగాయి.
మంత్రి రామన్న జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న సమరయోధులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నూతన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూనే.. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ప్రగతిని ప్రస్తావించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుల త్యాగాలను కొనియాడారు.
మంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే..
భూపంపిణీ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బస్తీ పథకంలో భూములు లేని నిరుపేద దళితులు 154 మందికి.. మూడెకరాల భూమి చొప్పున మొత్తం 462 ఎకరాల భూమిని పంపిణీ చేస్తున్నాం. ఇందుకోసం రూ.18.19 కోట్లు నిధులు కేటాయించాం.
అమరులను ఆదుకుంటాం : ఎందరో వీరుల త్యాగఫలం తెలంగాణ రాష్ట్రం. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 1969 నుంచి 2014 వరకు ఎంతో మంది ప్రాణాలను అర్పించారు. వారి కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకోవడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అమరవీరుల కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయంతోపాటు వారి కుటుంబాల్లో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయాధార కుటుంబాలకు, వ్యవసాయ భూమి, అమరవీరుల పిల్లలకు ఉచిత విద్య, వైద్య సదుపాయాలను ప్రభుత్వం అందిస్తుంది.
తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసులన్నింటినీ మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సకలజనుల సమ్మె వంటి అద్భుత పోరాటాలు చేసిన ఉద్యోగులకు తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్ ఆగస్టు నెల జీతంతో అందజేయనున్నాం. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు కేరళ తరహా ప్యాకేజీని అమలు చేస్తాం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
పారిశ్రామికాభివృద్ధికి బాటలు : తెలంగాణలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడానికి నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నాము. దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలతో పరిశ్రమలు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నాము.
పంచాయతీలుగా గిరిజన తండాలు.. : ఆదివాసీ గూడెలను పంచాయతీలుగా గుర్తించనున్నాము. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ కల్పించి వారిని అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నాము. ఆటో రిక్షాలపై, ట్రాక్టర్లు వంటి వ్యవసాయ వాహనాలపై విధిస్తున్న రవాణ పన్ను రద్దు చేయడమే కాకుండా, వీటిపై ఉన్న రూ.76 కోట్ల పన్ను బకాయిలను కూడా రద్దు చేశాం.
కళ్యాణలక్ష్మితో లబ్ధి : ఈ వినూత్న పథకం ద్వారా దళిత, గిరిజన ఆడపిల్లల పెళ్లికి రూ.50 వేల ఆర్థిక సాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అమలవుతుండటం గర్వకారణం.
‘ఫాస్ట్’తో ఉన్నత చదువులు : నిరుపేద తెలంగాణ విద్యార్థులు ఉన్నత చదువులను అందించాలనే లక్ష్యంతో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ(ఫాస్ట్) కొత్త పథకాన్ని అమలు చేస్తున్నాము.
సమగ్ర సర్వేకు సహకరించండి : ఈనెల 19న అందరు ఇంట్లో ఉండి సమగ్ర సర్వేకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం. 19న సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది.
మన ఊరు.. మన ప్రణాళిక.. : జిల్లా సర్వతోముఖాభివృద్ధి కోసం మన ఊరు.. మన ప్రణాళికలను రూపొందించాము. రూ.2,325 కోట్లతో మన జిల్లా- మన ప్రణాళిక, రూ.10,240 కోట్లతో మన పట్టణం.. మన ప్రణాళిక రూపొందించి, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమోదించాం.
విద్యా.. వైద్యం : జిల్లాలో 14 మండలాల్లో మొదటి విడత ఆదర్శ పాఠశాలలను నెలకొల్పాము. గిరిజన విద్యార్థులకు గోండి లిపి నేర్పించడానికి 15 ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేక బోధనను అందుబాటులోకి తెచ్చాము. ఈ విద్యా సంవత్సరంలో రూ.57.87 కోట్లతో పాఠశాలల్లో 880 అదనపు గదుల నిర్మాణం చేపట్టాము. జిల్లాలో అంటు వ్యాధులు ప్రబలకుండా రాపిడ్ ఫీవర్ సర్వే చేశాం.
27 అంబులెన్సులు, 104, 108 సర్వీసుల ద్వారా తక్షణ వైద్యసేవలు అందిస్తున్నాము. ఆరోగ్యశ్రీ పథకం కింద రిమ్స్, మంచిర్యాల, నిర్మల్, భైంసా ఏరియా ఆస్పత్రులతోపాటు నిర్మల్ జీకే ఆస్పత్రుల ద్వారా నిరుపేదలకు ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నాము. గ్రామాల్లో ఉండే ఆర్‌ఎంపీ, పీఎంపీలకు వృత్తిపై ప్రత్యేక శిక్షణతో పాటు, సర్టిఫికేట్లు అందజేయాలని నిర్ణయించాము.
రుణమాఫీ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ైరైతులకు రూ.లక్ష పంట రుణాలను మాఫీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రూ.18 కోట్ల భారం ప్రభుత్వం పడినప్పటికీ.. 40 లక్షల రైతు కుటుంబాల కష్టాలను తీర్చడానికి సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. చేనేత కార్మికులకు కూడా రూ.లక్ష వరకు మాఫీ చేయాలని నిర్ణయించాము.
వ్యవసాయం : ఈ పథకం ద్వారా 50 శాతం రాయితీపై యంత్రాలను కొనుగోలుకు రూ.13.60 కోట్లు కేటాయించాం. ఆహార భద్రత పథకం ద్వారా ఈసారి జిల్లాలో 30వేల మంది రైతులకు రూ.9.66 కోట్లు వెచ్చించి రాయితీలో వరి, పప్పుదినుసులు, స్ప్రింక్లర్లు, పంపుసెట్ల పంపిణీ చేస్తున్నాం. సమగ్ర ఉద్యానవన అభివృద్ధి పథకం ద్వారా 292 మంది లబ్ధిదారులకు రూ.93 లక్షల రాయితీలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాము.
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద 1721 మంది లబ్ధిదారులకు రాయితీపై కూరగాయల హైబ్రిడ్ విత్తనాలు సరఫరా చేశాం. పశుగ్రాస అభివృద్ధికి 75 శాతం సబ్సిడీ కింద 25.5 మెట్రిక్ టన్నుల జొన్న పశుగ్రాస విత్తనాల సరఫరా చేశాం. 2500 హెక్టార్లతో బిందు సేద్యం, 1,510 హెక్టార్లలో తుంపర్ల సేద్యం చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం.
అటవీశాఖ : అటవీ సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం ఈ ఏడాది ఇప్పటి వరకు 1,921 అటవీ నేరాల కేసులు నమోదు చేసి రూ.1.37 కోట్ల అపరాధ రుసుం వసూలు చేశాం. కవ్వాల్ పులుల సంరక్షణ కార్యక్రమంలో పర్యావరణ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పులులు, వణ్యప్రాణాల సంరక్షణ కోసం ప్రణాళికలు రూపొందించాం. తెలంగాణను హరిత హారంగా తయారు చేయడానికి పచ్చదనాన్ని 33 శాతం పెంచడానికి రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు పెంచాలని నిర్ణయించారు.
సంక్షేమం : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లాలోని వృద్ధులు, వితంతువులకు రూ.1,000, వికలాంగులకు రూ.1500 చొప్పున పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించాం. జిల్లాలో ఐదు సమీకృత సాంఘిక సంక్షేమ వసతిగృహ సముదాయాలు మంజూరు కాగా, ఇప్పటివరకు మూడు వసతిగృహాలు నిర్మించాం. కార్పొరేట్ కళాశాలల పథకం, బెస్ట్ అవలెబుల్ స్కూల్ పథకాల కింద వందలాది మంది నిరుపేద విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాం. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచితంగా శిక్షణ, స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్నాం.
మూడు శాతం రిజర్వేషన్ ద్వారా ఇప్పటివరకు 218 వికలాంగులకు ఉద్యోగాలు ఇచ్చాము. ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో వయోవృద్ధుల కోసం హెల్ప్‌లైన్ 1253ని ఏర్పాటు చేశాం. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వక్ఫ్‌బోర్డుకు జ్యుడిషియల్ అధికారులు కల్పిస్తున్నాం. కొత్తగా వక్ఫ్ ట్రిబ్యునల్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. యువజన సర్వీసుల శాఖ ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు ఉపాధి కల్పించడానికి ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నాం.
క్రీడల అభివృద్ధి : అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు ఖర్చుల నిమిత్తం రూ.మూడు లక్షల ఆర్థిక సహాయం. అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన వారికి రూ.50 లక్షల నగదు ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజీవ్‌ఖేల్ అభియాన్ ద్వారా పోటీలను నిర్వహించడానికి సన్నహాలు చేస్తున్నాము. ప్రతి నియోజకవర్గంలో మిని స్టేడియంల నిర్మాణం, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, ఉట్నూర్ లలో క్రీడా వసతిగృహాలను ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాము.
గ్రామీణాభివృద్ధి : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఇందిరాక్రాంతి పథం ద్వారా ఈ ఏడాది 901 మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.24.62 కోట్ల రుణాలిచ్చాం. దీపం పథకం ద్వారా పేద మహిళలకు రాయితీపై వంట గ్యాస్ అందజేయడం జరుగుతుంది. బంగారు తల్లి పథకం ద్వారా జిల్లాలో 285 మందికి ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున అందజేశాం.
ఉపాధిహామి : పథకం ద్వారా ఇప్పటివరకు 5.38 లక్షల జాబ్‌కార్డులు జారీ చే శాం. 2.86 కుటుంబాలకు రూ.351.85 కోట్ల వేతనాలు చెల్లించాం. హరిత హారంలో ఎనిమిది వేల ఎకరాల్లో పండ్ల తోటలు పెంచాలని నిర్దేశించాం. మహాత్మాగాంధీ వన నర్సరీ పథకం ద్వారా 19 లక్షల మొక్కలు పెంచలని లక్ష్యంగా నిర్ణయించాం. ఇందిరా జలప్రభ పథకం కింద రూ.160 కోట్లతో ఎస్సీ, ఎస్టీల భూముల అభివృద్ధి పనులు చేపట్టాం.
సాగునీటి రంగం : వచ్చే ఏడాదిలోగా జిల్లాలో నీల్వాయి, జగన్నాథపూర్ ప్రాజెక్టుల ద్వారా 10వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడానికి పనులు చేపట్టాం. చిన్న నీటి పారుదల ప్రాజెక్టు ద్వారా నాబార్డు, ఏఐబీపీ, జేబీఐసీ, ప్రణాళిక ద్వారా రూ.811 కోట్ల అంచనా వ్యయంతో 1.79లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకు సాగునీరందించాలని నిర్ణయించాం అని మంత్రి జోగు రామన్న వివరించారు.
ఈ వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభారాణి, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీష, కలెక్టర్ ఎం.జగన్మోహన్, జిల్లా జడ్జి గోపాలకృష్ణ, ఎస్పీ గజరావు భూపాల్, అదనపు ఎస్పీ జోయల్ డేవిస్, డీసీసీబీ చైర్మన్ ఎం.దామోదర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు లోకభూమారెడ్డి వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు, పట్టణ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధికి బాటలు
Published Sat, Aug 16 2014 2:43 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement
Advertisement