
ఆచార్య దేవో భవ
మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యాబోధనలో ఉత్తమ సేవలు అందించిన 48 మంది ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సన్మానించారు. రాష్ట్రస్థాయి పురస్కారాలకు జిల్లా నుంచి ఎంపికైన నలుగురు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఘన సన్మానం అందుకున్నారు. కాగా పాఠశాల ల్లో విద్యార్థులు గురువు పాత్రలను పోషించి సందడి చేశారు.
ప్రగతినగర్ : ప్రతి వ్యక్తి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకే స్థానం ఉంటుందని జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదర్ రాజు అన్నారు. విద్యార్థులను సన్మార్గంలో నడిపించడం వెనుక ఉపాధ్యాయుల కృషి ఘననీయమైనదని అన్నారు. శుక్రవారం నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్‌లో భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గురుపూజోత్స వం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ చిన్నప్పుడు తాను కూడా ఉపాధ్యాయుల దినోత్సవం రోజు ఉపాధ్యాయునిగా వేషం వేసేడినని తెలిపారు. ఆ రోజు పాఠశాలకు సెలవు ప్రకటించడం, తోటి విద్యార్థులంతా ఉపాధ్యాయుల్లా న టించడం ఎన్నటికీ మరిచి పోలేనన్నారు. జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ మాట్లాడుతూ తాను ఈ స్థాయికి ఎదగడానికి తన గురువులే కారణమన్నారు. ప్రతి విద్యార్థి పైకి ఎదగాలనే తపనతో విద్యాబోధన చేయడం గురువుల లక్షణమన్నారు.
గురుపూజోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా గురువులను గౌరవించిన వారమవుతామన్నారు. విద్యార్థులు గురువులను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని అన్నారు. ఆయన జీవితం విద్యార్థులందరికీ ఆదర్శం కావాలన్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన రాధాకృష్ణన్ దేశ రాష్ట్రపతిగా ఎదిగారన్నారు. నిజామాబాద్ నగర మేయర్ ఆకుల సుజాత మాట్లాడుతూ ఉపాధ్యాయులంటే తనకు ఎనలేని గౌరవమన్నారు.
డీఈఓ శ్రీనివాసచారి మాట్లాడు తూ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికే వన్నే తెచ్చారని, అదే స్ఫూర్తితో నేటితరం ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. అనంతరం కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ఎంపిక చేసిన 48 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. సాక్షర భారతి డీడీ కృష్ణరావు, డైట్ ప్రిన్సిపాల్, శ్రీని వాస్, బాల్‌భవన్ పర్యవేక్షకులు ప్రభాకర్,డిప్యూటీ డీఈఓలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.