సాక్షి, హైదరాబాద్ : వర్షాకాలపు ముంపు సమస్యల పరిష్కారంలో భాగంగా నాలాల విస్తరణలకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ యంత్రాంగం.. మారియట్ హోటల్ నుంచి అంబర్‌పేట వరకు హుస్సేన్ సాగర్ సర్‌ప్లస్ నాలా విస్తరణ స్థానే గ్రేట్ వాల్ నిర్మాణానికి సిద్ధమైంది. భారీ వర్షాలు కురిసినా నాలాకు రెండు వైపులా ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు జలమయం కాకుండా ఉండేందుకు భారీ వాల్ నిర్మాణ పనులు త్వరలో చేపట్టనుంది. నగరంలో 2000 సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు సర్‌ప్లస్ నాలా వెంబడి బస్తీలు నీట మునగడంతో నాలాను విస్తరించి ఆధునీకరించాలనుకున్నారు. కిర్లోస్కర్ కమిటీ నివేదిక మేరకు నాలాను ఎక్కువ వెడల్పునకు విస్తరించాలంటే ఎన్నో ఆస్తులు సేకరించాల్సి ఉండటంతో ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో పనులు చేపట్టలేదు.
గత సంవత్సరం భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో నాలా విస్తరణకు అధికారులు సిద్ధంకాగా, ప్రజల నుంచి మళ్లీ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో నాలా పరిధి వరకే విస్తరణ తదితర చర్యలు చేపట్టాలనుకున్నారు. అందులో భాగంగా నాలా పొడవునా వాల్ నిర్మించాలని, అందుకు రూ. 68.40 కోట్లు ఖర్చు కానుందని ప్రతిపాదించారు. తప్పని సరైతే తప్ప ఆస్తులను తొలగించకుండానే వాల్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 2000 సంవత్సరం వరదల తర్వాత కొన్ని ప్రాంతాల్లో నాలా వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మించారు. దాన్ని కూడా కలుపుతూ నాలా మొత్తానికి భారీ వాల్ నిర్మాణానికి ఇప్పుడు సిద్ధమయ్యారు. ఈ పనులు పూర్తయితే కవాడిగూడ, గాంధీనగర్, అశోక్‌నగర్, నల్లకుంట, అంబర్‌పేట ప్రాంతాల్లోని నాలా వెంబడి లోతట్టు ప్రాంతాలకు ముంపు సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు.
ముందుకు సాగని నాలాల విస్తరణ..
జీహెచ్‌ఎంసీలో 390 కిలోమీటర్ల పొడవున్న ప్రధాన నాలాల వెంబడి 12,432 ఆస్తులున్నట్లు సర్వే ద్వారా గుర్తించారు. ఈ మొత్తం ఆస్తులను తొలగించేందుకు భారీ వ్యయం కావడమే కాక, ఆస్తుల తొలగింపు సంక్లిష్టంగా మారడంతో, తొలిదశలో అత్యంత సమస్యాత్మకంగా ఉన్న బాటిల్‌నెక్స్‌లో మాత్రమే నాలాల విస్తరణ పనులు చేయాలని నిర్ణయించారు. ఈ పనులు చేసేందుకు 1,002 ఆస్తులను తొలగించాల్సి ఉంటుందని గుర్తించారు.
తొలిదశలో నాలాల విస్తరణ పనులకు అవసరమైన రూ. 230 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి పరిపాలన అనుమతులిచ్చింది. అలాగే నగరంలో వరద ముంపు సమస్యల పరిష్కారానికి నాలాల్ని విస్తరించాలని తొలుత భావించారు. ఆయా ప్రాంతాల ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు నాలాలను విస్తరించే బదులు ఎక్కువ లోతు చేయడం ద్వారా సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. హుస్సేన్‌సాగర్ సర్‌ప్లస్ నాలాకు సంబంధించి కిర్లోస్కర్ సిఫార్సులకు షార్ట్‌కట్ పరిష్కారాన్ని అమలు చేయబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment