పైలట్ ప్రాజెక్టుగా నల్లగొండ జిల్లా ఎంపిక
నల్లగొండ: జాతీయ రహదారులపై ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. మృత్యుమార్గాలుగా మారిన జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణతో పాటు నిషేధిత పదార్థాల రవాణా జరగకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-వరంగల్ మార్గాల్లోని జాతీయ రహదారులపై ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం నల్లగొండ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి ంది. నల్లగొండమీదుగా హైదరాబాద్-విజయవాడ(ఎన్‌హెచ్-65), హైదరాబాద్-వరంగల్(ఎన్‌హెచ్-163) జాతీయ రహదారులు వెళ్తున్నాయి.
వీటిపై ఈ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి 25-30 కిలోమీటర్లకు ఒక పోలీస్ స్టేషన్ చొప్పున ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై కూడా జిల్లా పోలీసు శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఎన్‌హెచ్-65పై ఆరు, ఎన్‌హెచ్-163పై రెండు పోలీస్‌స్టేషన్లు ఏర్పాటవుతాయని అంచనా. నల్లగొండ నుంచి 200 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు వెళుతున్నాయి. చౌటుప్పల్ మండలం కొత్తగూడెం నుంచి కోదాడ మండలం రామాపురం వరకు 153 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. మరోవైపు హైదరాబాద్-వరంగల్ మార్గంలో బీబీనగర్ నుంచి ఆలేరు వరకు 55 కిలోమీటర్లు జాతీయ రహదారి ఉంది. ఇవి తరచూ ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
ట్రాఫిక్ ఠాణా.. ఓ భరోసా
నల్లగొండ జిల్లా పరిధిలోని జాతీయరహదారులపై ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా చాలా రకాలుగా మేలు జరుగుతుందని స్థానిక పోలీసులంటున్నారు. ప్రమాదాలను నివారించడమే కాకుండా ప్రమాదాలకు గురయ్యే బాధితులకు సత్వర సాయం అం దుతుందని చెబుతున్నారు. శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం అయితే జాతీయ రహదారులను తనిఖీ చేయడం, నిషేధిత పదార్థా లు, అక్రమ మద్యం, దొంగ రేషన్ బియ్యం, ఇసుక లాంటి వనరుల అక్రమరవాణా కూడా అరికట్టవచ్చని పోలీసులు చెబుతున్నారు.
జాతీయ రహదారులపై ట్రాఫిక్ ఠాణాలు!
Published Sat, May 2 2015 3:13 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM
Advertisement
Advertisement