సాక్షి, హైదరాబాద్: నీట్–2019లో సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో జరిగిన ఈ అర్హత పరీక్షలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల నుంచి ఈ ఏడాది దాదాపు 150 మంది విద్యార్థులు వైద్య విద్యలో ప్రవేశాలు పొందనున్నట్లు గురుకుల సొసైటీలు అంచనా వేస్తున్నాయి. టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ పరిధిలో ఏటా 5వేల మంది విద్యార్థులు బైపీసీ కోర్సు చదువుతున్నారు. అదేవిధంగా టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ పరిధిలోని బైపీసీ కోర్పులో వెయ్యి మంది విద్యార్థులు చదువుతున్నారు. దాదాపు ఈ విద్యార్థులంతా నీట్–2019కు సన్నద్ధమై పరీక్ష రాశారు. తాజాగా విడుదలైన నీట్–2019 ఫలితాలను ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలు విశ్లేషిస్తున్నాయి. జాతీయ ర్యాంకులను ప్రకటించిన నేపథ్యంలో గత ఐదేళ్లలో వచ్చిన ర్యాంకులను బేరీజు వేసుకుంటూ రాష్ట్ర స్థాయిలో ఎంతమందికి ఎంబీబీఎస్, బీడీఎస్‌లో సీట్లు వస్తాయో అంచనాలు రూపొందించారు. ఈక్రమంలో దాదాపు 150 మంది గురుకుల విద్యార్థులకు సీట్లు వస్తాయని భావిస్తున్నారు.
82 మందికి ఎంబీబీఎస్ సీట్లు...
నీట్–2019 పరీక్షలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు ఏడుగురు సొంతం చేసుకున్నారు. ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీలో వీరికి జాతీ య స్థాయిలో వెయ్యిలోపు ర్యాంకులు వచ్చా యి. నీట్ పరీక్ష రాసిన వారిలో 82 మందికి ఎంబీబీఎస్ సీట్లు వస్తాయని అంచనా. మొత్తం 150 మంది మంచి ర్యాంకులు సాధించగా... అందులో 82 మందికి ఎంబీబీఎస్ సీట్లు, 68 మందికి బీడీఎస్ సీట్లు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. గతేడాది వచ్చిన ర్యాంకులు, సీట్ల ఆధారంగా విశ్లేషించి ఈమేరకు అంచనాలు రూపొందించారు.
సీఎస్ జోషి అభినందనలు...
నీట్–2019 ఫలితాలపై గురుకుల సొసైటీలు అంచనా వేసి ఎంతమందికి సీట్లు వస్తాయనే అంశాన్ని తాజాగా ట్విట్టర్‌లో నమోదు చేసింది. ఈక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి స్పందించారు. విద్యార్థులకు ముందస్తుగా శుభాకాంక్షలు సైతం తెలిపారు. సంక్షేమ గురుకుల కాలేజీలు మరో ముందడుగు వేశాయని, తాజాగా విద్యార్థులు సాధించిన ర్యాంకుతో వాటి పరపతి మరింత పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment