లిఫ్ట్..ఇవ్వరా? | Halliya constituents acreage under cultivation | Sakshi
Sakshi News home page

లిఫ్ట్..ఇవ్వరా?

Published Fri, Jul 24 2015 10:43 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

Halliya constituents acreage under cultivation

ఏటేటా తగ్గిపోతున్న హాలియా నియోజక వర్గ సాగు విస్తీర్ణం
 సరఫరా కాని 16 గంటల విద్యుత్
 నత్తనడక ఆధునీకరణ పనులు
 అయోమయంలో రైతులు
 
 హాలియా :తలాపున కృష్ణమ్మ పరుగులిడుతున్నప్పటికీ టేలాండ్ భూములకు సాగునీరు అందడం లేదు. హాలియా నియోజకవర్గంలోని అనుముల, పెద్దవూర, నిడమనూరు, త్రిపురారం మండలాల్లోని టేలాండ్ భూములకు సాగునీరు అందించడం కోసం ఏర్పాటుచేసిన 12  లిఫ్ట్‌లు నిర్వహణాలోపంతో అస్తవ్యస్తంగా మారాయి. దీంతో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేడు. దీంతో కోట్లు వెచ్చించి ఎడమ కాల్వపై నిర్మించిన లిప్టుల లక్ష్యం నీరుగారిపోతుంది. ఈ ఏడాది పూర్తి స్ధాయిలో సాగునీరు అనుమానమే:ఎడమ కాల్వపై ఉన్న లిఫ్ట్‌ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడం.. ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతుండడంతో ఈ ఏడాది కూడా కింద పూర్తిస్థాయిలో నీరందే పరిస్థితి లేదు. లిఫ్ట్‌ల నిర్వహణ ప్రభుత్వం రైతులకు అప్పగించిన విష యం తెలిసిందే. రైతులకు నిర్వహణ సామర్థ్యం లేకపోవడంతో సమస్య తీవ్రరూపం దాల్చింది. ఏటా  సగం భూములకే సాగునీరు అందుతోంది.
 
  పెద్దవూర మండలం చలకుర్తి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన లిఫ్ట్ ద్వారా 2 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్నప్పటికీ కేవలం గత ఏడాది  వెయ్యి ఎకరాల లోపే సాగునీరు అందింది.  అనుముల మండలంలో ఆర్-1 అల్వాల లిఫ్ట్ కింద 1200 ఎకరాలకు గాను 400 ఎకరాలకు, తెట్టెకుంట గ్రామం వద్ద ఉన్న ఎల్-1లిప్టు కింద 1400 ఎకరాలకు గాను కేవలం 600 ఎకరాలకు, స్పెషల్ అల్వాల లిఫ్ట్ కింద 600 ఎకరాలకు గాను 200 ఎకరాలకు నీరందుతుంది.  అనుముల ఎల్-2 లిఫ్ట్ కింద 300 ఎకరాలకు గాను సెంటు భూమికి కూడా నీరందడం లేదు. శ్రీనాథపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ల ద్వారా 1500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా కేవలం 600ఎకరాలకే సాగునీరుఅందుతున్నది.
 
  త్రిపురారం మండలంలో గజలాపురం ఫేజ్-1, ఫేజ్-2 లిఫ్ట్ పరిధిలో ఎల్- 8, 9 కింద 1400 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా కేవలం 500 ఎకరాలకు మాత్రమే అందుతుంది. ఎల్-7 కింద 1500ఎకరాలకు గాను వెయ్యి ఎకరాలకు సాగునీరు అందుతుంది. పల్గు ఎత్తిపోతల కింద 500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా 300 ఎకరాలకు, పెద్దదేవులపల్లిలోని ఎఫ్ 1, ఎఫ్ 2 లిప్టు కింద 1600 ఎకరాలకు 800 ఎకరాలకు, జానకిరావు లిఫ్ట్ కింద 1200 ఎకరాలకు గాను 500 ఎకరాలకు నీరందుతుంది.
 
  బృందావనం గ్రామ లిప్టు కింద 1000 ఎకరాలకు గాను 600 ఎకరాలకు, ముకుందాపురం వద్దగల ఆర్-4 లిప్టు కింద 1300 ఎకరాలకు గాను 1000 ఎకరాలకు, హనుమాన్ ఎఫ్-1, ఎఫ్ -2 లిప్టు కింద 1500 ఎకరాలకు గాను 500 ఎకరాలకు, గాడిబిచ్చ ఎత్తిపోతల కింద 70 ఎకరాలకు గాను 10 ఎకరాలకు, రాగడప లిప్టు కింద 100 ఎకరాలకు గాను 20 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది.  అదేవిధంగా నిడమనూరు మండలంలో వేంపాడు, ముప్పారం, ముకుందాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన లిప్టుల కింద 3 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా కేవలం పావులా వంతు భూములకు మాత్రమే సాగునీరు అందుతుంది.
 
 నాసిరకం మరమ్మతులతో నీళ్లపాలవుతున్న నిధులు
 లిఫ్ట్‌ల నిర్వహణపై ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తున్నప్పటికీ చైర్మన్లు ఇష్టానుసారంగా ఖర్చు చేయడంతో నిధులన్నీ నీళ్లపాలవుతున్నాయి. పనుల్లో నాణ్యత లేకపోవడంతో లిప్టుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. లిప్టు మోటార్లు తరచు మరమ్మతులకు గురవుతుండడంతో లిప్టుల కింద సాగు భూములకు పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు. దీంతో టేలాండ్ భూములు అలానే  మిగిలిపోతున్నాయి. లిప్టుల ఆధునికీకరణ కోసం హాలియా మండలంలో సుమారు కోటి రూపాయలను విడుదల చేసినప్పటికీ ఏ పనులు పూర్తికాకపోవడంతో ఈ ఏడాది కూడా పూర్తిస్థాయిలో సాగునీరు అందడం అనుమానంగానే మారింది.
 
 అందని సరిపడా విద్యుత్
 లిఫ్ట్‌ల కింద సేద్యం చేసే భూముల్లో పంటలను కాపాడేందుకు ప్రభుత్వం 16 గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించినప్పటికీ ఆచరణలో మాత్రం అది అమలు కావడం లేదు. గత ఏడాది  లిఫ్ట్‌లకు 10 గంటలకు మించి విద్యుత్ సరఫరా కావడం లేదంటూ రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో కాల్వ చివరి భూమి రైతులకు నీరు అందక ఎండిపోతున్నాయి. విద్యుత్‌సరఫరాలో కూడా తరచు అంతరాయం కలుగుతుండడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement