సివిల్ సప్లయీస్ హమాలీల నిరవధిక సమ్మె
జిల్లావ్యాప్తంగా గోదాంలకు తాళం
నిత్యావసర వస్తువుల ఎగుమతులు, దిగుమతుల నిలిపివేత
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ రేషన్‌కార్డుదారులకు పస్తులు తప్పేలా లేవు. పౌరసరఫరాల హమాలీల సమ్మెతో నిత్యావసర వస్తువుల ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. సివిల్ సప్లయీస్ గోదాంలకు తాళాలు దర్శనమిస్తున్నాయి. సమ్మెపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో జూన్ నెల రేషన్.. సందిగ్ధంలో పడింది.
వైరా: సివిల్ సప్లయీస్ హమాలీల నిరవధిక సమ్మెతో ఖమ్మం జిల్లాలో పౌర ‘సరఫరాలు’ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హమాలీల సంఘం ఈ నెల 25 నుంచి రాష్ర్ట వ్యాప్తంగా సమ్మెకు పిలుపు నిచ్చింది. జిల్లాలో సివిల్ సప్లయీస్ కార్పొరేషన్‌కు చెందిన ఎంఎల్‌ఎస్ పాయింట్లు (గోదాంలు) 16 ఉన్నాయి. వీటిలో 392 మంది హమాలీలు పని చేస్తున్నారు. వీరంతా నాలుగు రోజుల నుంచి సమ్మెలో ఉండటంతో గోదాంల సేవలకు బ్రేక్ పడింది. పొరుగు జిల్లాల నుంచి జిల్లాకు దిగుమతి కావాల్సిన గోధుమలు, చక్కెర సరఫరా కూడా నిలిచిపోయింది. రేషన్ షాపులకు నిత్యావసర వస్తువుల సరఫరా ఆగిపోయింది.
సమ్మెకు కారణాలేమంటే..
ఎగుమతులు, దిగుమతుల కమీషన్ 12 నుంచి 20 శాతానికి పెంచాలని హమాలీలు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ర్టంలో ఒప్పందం చేసుకున్న వేతనాల అగ్రిమెంట్ గడువు 2015 డిసెంబర్ నాటికి ముగిసింది. 2016 జనవరి నుంచి హమాలీల రేట్లు పెంచాలని కోరుతూ సంబంధిత శాఖ మంత్రి ఈటెల రాజేందర్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. హమాలీల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదు. ఏప్రిల్ 25 నుంచి సమ్మెకు దిగుతామని అదే నెల 5 తేదీన సమ్మె నోటీసు ఇచ్చారు. కార్పొరేషన్ అధికారులు మరోమారు కార్మికులతో చర్చలు జరిపారు. 20 రోజుల్లో వేతనాలు సవరణ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారులు ఇచ్చిన గడువు ఈనెల 15 నాటికి పూర్తయింది. పరిష్కార మార్గాన్ని సూచించపోవడంతో ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు.
ప్రజలకు ప ‘రేషన్’...
హమాలీల సమ్మె వల్ల గోదాంల నుంచి గింజ బియ్యం కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. మే నెల రేషన్ సరుకుల పంపిణీ ఈసారి ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లాలో 41 మండాల పరిధిలో 1,187 రేషన్ దుకాణాలు ఉండగా 7,23,923 లక్షల మంది కార్డుదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా 13,016 టన్నుల బియ్యం, 431 టన్నుల గోధుమలు, చక్కెర 363 టన్నులు పంపిణీ చేస్తున్నారు. వాస్తవానికి ప్రతి నెలా 20 నుంచి 23వ తేదీ వరకు రేషన్ దుకాణాలకు సరుకులు అలాట్‌మెంట్ చేస్తారు. 23లోగా డీలర్లు డీడీలు చెల్లిస్తారు. 23 నుంచి 30 తేదీ లోపు ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు సరుకులు సరఫరా చేస్తారు. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపుల వరకు హమాలీలే సరుకులు ఎగుమతి, దిగుమతి చేస్తారు. ఆ తర్వాత 2 నుంచి 13వ తేదీ వరకు డీలర్లు కార్డుదారులకు రేషన్ సరకులు పంపిణీ చేస్తారు. కానీ ప్రస్తుతం హమాలీలు సమ్మెలో ఉండటంతో జూన్ నెల కోటా రేషన్ అందకునేందుకు వేచి చూడాల్సిందే.
ప‘రేషన్’..!
Published Tue, May 31 2016 5:57 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM
Advertisement
Advertisement